భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) కరీంనగర్ జిల్లా శాఖలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) కరీంనగర్ జిల్లా శాఖలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో తొమ్మిదేళ్ల పాటు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సుధీర్ఘకాలం పనిచేసిన మర్రి వెంకటస్వామి శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
పార్టీలో క్షేత్రస్థాయి మొదలు జిల్లాశాఖ వరకు గట్టి పట్టున్న వ్యక్తి మర్రి వెంకటస్వామి. ఆయన రాజీనామాతో జిల్లాలో సీపీఐ చీలే అవకాశాలూ లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాడ వెంకటరెడ్డి సొంత జిల్లా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. మర్రి వెంకటస్వామి సైతం పార్టీని నిట్టనిలువునా చీల్చి తన సత్తా ఏమిటో చూపాలని పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు.
మర్రి వెంకటస్వామి 1978లో ఏఐఎస్‌ఎఫ్‌లో చేరారు. 1983లో సీపీఐ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం పార్టీలో అనేక పదవుల్లో కొనసాగారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. మర్రి వెంకటస్వామి జిల్లా పగ్గాలు చేపట్టకముందు పాత ఇందుర్తి, ఇప్పటి హుస్నాబాద్ నియోజకవర్గాలకే పార్టీ పరిమితమైంది.
మర్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లావ్యాప్తంగా విసృ్తతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. పార్టీ అనుబంధ సంఘాలకు కమిటీలను నియమించారు. ఆయన హయాంలోనే పార్టీ సభ్యత్వాన్ని పది వేలకుపైగా పెంచారు. మర్రి జిల్లా కార్యదర్శిగా ఉన్న సమయంలోనే సీపీఐ 24వ రాష్ట్ర మహాసభలను కరీంనగర్‌లో విజయవంతంగా నిర్వహించి పార్టీ అగ్రనేత బర్దన్ ప్రశంసలను పొందారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర మహాసభలను సైతం జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు.
రెండు గ్రూపులుగా చాడ-మర్రి
గత కొన్నేళ్లుగా చాడ వెంకటరెడ్డితో మర్రికి పొసగడం లేదు. 2009 ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిగా మర్రి వెంకటస్వామిని నిలబెట్టాలని చంద్రబాబు, కేసీఆర్ ప్రతిపాదించారు. అదే సమయంలో హుస్నాబాద్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావును బరిలో దించాలని నిర్ణయించారు. అప్పటికే హుస్నాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాడ వెంకటరెడ్డి సీపీఐ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి తిరిగి హుస్నాబాద్ సీటు దక్కించుకున్నారు. మానకొండూరు సీటు మర్రికి రాకుండా చాడ వెంకటరెడ్డి అడ్డుకున్నారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ చాడకు, మర్రికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. జిల్లాలో పార్టీ సైతం చాడ, మర్రి గ్రూపులుగా మారిపోయింది.
కార్యదర్శి పదవి నుంచి తప్పించాడని ఆగ్రహం
వృత్తిపరంగా మర్రి వెంకటస్వామి న్యాయవాది. ఆయన జిల్లా కార్యదర్శిగా కొనసాగుతుండగా 2014 జనవరిలో వీణవంక మండలంలో మాజీ ఎంపీటీసీ ఉయ్యాల బాలరాజు హత్యకు గురయ్యాడు. ఆ కేసులోని నిందితుల తరపున వాదించేందుకు మర్రి వకాల్తా పుచ్చుకున్నారు. ఆ సమయంలో నిందితులను సీపీఐ జిల్లా కార్యాలయంలో దాచి ఉంచారనే కారణంతో మర్రిని జిల్లా కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించారు. దీనివెనుక చాడ వెంకటరెడ్డి కుట్ర ఉంద ని, పోలీసులతో కుమ్మక్కై తనపై అక్రమ కేసులు బనాయించారని మర్రి ఆరోపణ.
ఈ కేసుపై ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు జిల్లా కార్యదర్శి పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన మహాసభల్లో జిల్లా కార్యదర్శి పదవిని ఆశించి భంగపడ్డ మర్రి వెంకటస్వామి చివరకు రాష్ట్ర కమిటీలోనైనా చోటు దక్కుతుందని భావించారు. అయితే అక్కడ కూడా భంగపాటు ఎదురుకావడంతో ఇక లాభం లేదనుకుని పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా తెలంగాణ పోరాటయోధుడు, సీపీఐ నాయకుడు అనభేరి ప్రభాకర్‌రావు వర్ధంతి రోజైన శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సీపీఎంలో చేరే యోచన..
సీపీఐకి గుడ్‌బై చెప్పిన మర్రి వెంకటస్వామి సీపీఎం నాయకత్వం ఆహ్వానిస్తే ఆ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. ఈ మేరకు సీపీఎం నాయకత్వంతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. జిల్లాలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై వారందరినీ సీపీఎంలోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.
తన ఎదుగుదలను అడ్డుకున్న చాడ వెంకటరెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే దిశగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా జిల్లాలో సీపీఐని నిలువునా చీల్చే దిశగా యత్నిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే జిల్లాలోని ఇరవై మండలాల్లోని పార్టీ శాఖలు ఖాళీ కాబోతున్నట్లు మర్రి వర్గీయులు చెబుతున్నారు.
్చవిప్లవ పంథాలోనే పయనిస్తా : మర్రి
మర్రి వెంకటస్వామి శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ తాను విప్లవ పంథాలోనే శ్రమజీవుల హక్కుల కోసం అంకితమై పయనిస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరేది తనను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులతో సమావేశమై నిర్ణయిస్తానన్నారు. సీపీఐలో విమర్శ, ఆత్మవిమర్శలకు తిలోదకాలిచ్చిన చాడ వెంకటరెడ్డి ప్రశ్నించే నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వర్గశత్రువులు, పోలీసులతో కుమ్కక్కైన చాడ జిల్లాలో పార్టీని తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీని సరైన మార్గంలో నడిపించడం ఎంతమాత్రమూ సాధ్యం కాదనే భావనతోనే సీపీఐకి రాజీనామా చేసినట్లు తెలిపారు.