ఆధిపత్యపోరు!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుతమ్ముళ్లు మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రధాన నాయకులు పైచేయి సాధించాలనే లక్ష్యంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. భవిష్యత్‌లో పోటీగా నిలుస్తారనుకున్న నేతల్ని ఇప్పటి నుంచే కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గ రాజకీయాల్లో తొలిసారి ఆరంగేట్రం చేసిన పుట్టాసుధాకర్ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తోఎన్నికల ముందు చెలిమి కొనసాగించారు.
ప్రస్తుతం తనదైన శైలిలో పుట్టా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నారుు. అందుకు తగినట్లు కొన్ని సంఘటనలు కనిపిస్తుండంతో వాటికి బలం చేకూరుతోంది. మాజీ మంత్రి డిఎల్ మేనల్లుడు మాజీ ఎంపీపీ మధుసూదనరెడ్డి నేతృత్వంలో చేపట్టిన క్రషర్ మిషన్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
దీంతో అక్రమంగా తవ్వకాలు చేపట్టిందని అందుకు రూ.3.73కోట్లు జరిమాన విధిస్తూ అధికారులు డిసెంబర్‌లో నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై సవాల్ చేస్తూ మధుసూదన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ మంగళవారం మధుసూదన్‌రెడ్డి కంకర మిషన్ సీజ్ చేశారు. మైదుకూరు ప్రాంతంలో ఈచర్య హాట్ టాఫిక్‌గా మారింది. తెరవెనుక పట్టువదలని విక్రమార్కునిలా పుట్టా సుధాకర్ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారనే భావన కొందరిలో వ్యక్తమౌతోంది.
అంతటా అదే పరిస్థితి...
బద్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఎన్నికల్లో పోటీ చేసిన విజయజ్యోతి వర్గాలుగా విడిపోయారు. వారి మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. శాసనమండలి డిప్యూటి చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు ఉన్నట్లు తెలుగుతమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పులివెందుల నియోజకవర్గంలో సతీష్‌రెడ్డికి వ్యతిరేకంగా రాంగోపాల్‌రెడ్డి నేతృత్వంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ప్రొద్దుటూరు పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి గ్రూపుల మధ్య రాజకీయ ఎత్తుగడలు తెరవెనుక స్పీడుగా సాగుతున్నారుు. కమలాపురంలో సైతం ఇదే పరిస్థితి ఉండడంతో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూనే తెరవెనుక గ్రూపును పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ముదిరిపోయాయి.
ఎంపీపై గరంగరం...
ఎంపీ సిఎం రమేష్‌పై పార్టీ శ్రేణులు గరంగరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల హైవే రోడ్డు టెండర్లుల్లో స్థానిక నాయకుల్ని కాదని ఎంపీ శాసించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. బద్వేల్, మైదుకూరు నాయకుల్ని టెండర్లలో పాల్గొనకుండా నియంత్రించడంపై అగ్గిరాజుకుంది. ప్రతి విషయానికి ఆయన టిక్ కొడితేనే పనులు అవుతున్నాయని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.