ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది మొసళ్ల పండుగ... ఇలాంటి సామెతలన్నీ తాలిబన్లకు వర్తించేలా పరిస్థితులు మారుతున్నాయి. అఫ్గాన్‌ను స్వా«దీనం చేసుకున్న ఆనందం ఆవిరవడానికి తాలిబన్లకు ఎక్కువ సమయం పట్టడం లేదు. తాత్కాలిక ప్రభుత్వంలో వివిధవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేతల మధ్య సయోధ్య కరువవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.
అఫ్గాన్‌ను అమెరికా సైన్యాలు వదిలిపోవడంతో అలవోకగా స్వాదీనం చేసుకున్న తాలిబన్లు.. అది తమ ఘనవిజయంగా భావించారు. కానీ దేశానికి ఆధిపత్యం వహించే విషయంలో అగ్రనేతల మధ్య ఆరంభమైన కుమ్ములాటలు అఫ్గాన్ స్వాధీన విజయాన్ని ఆవిరి చేస్తున్నాయి. నిజానికి బయటనుంచి చూసేవారికి తాలిబన్లంతా ఒకటేనని, వారి సిద్ధాంతాల్లో తేడాలుండవని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు.
అన్ని పారీ్టల్లాగానే తాలిబన్లలో కూడా వర్గాలు, గ్రూపులు, అభిప్రాయభేదాలు, కుమ్ములాటలు బోలెడున్నాయని తాలిబన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు అజ్ఞాతంలో బతుకుతూ అమెరికాతో యుద్దం చేయాల్సిరావడం వల్ల ఈ వర్గాలు, భేదాభిప్రాయాలు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే దేశం స్వాదీనమై పాలనా పగ్గాలు చేతికి వచ్చాయో వీరిలో విభేదాలు ముదురుతున్నాయి.
ఉమ్మడి శత్రువు మొఖం చాటేయగానే తాలిబన్లలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ మంటలు ముదిరి సోమవారం రెండువర్గాల మధ్య అధ్యక్ష భవనంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తాలిబన్ అగ్రనేత, సహవ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించాడని పుకార్లు షికారు చేశాయి. కానీ తాను బతికే ఉన్నానని బరాదర్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అయినా సరే తన పరిస్థితిపై అయోమయం నెలకొంది.
(చదవండి:
ప్రభుత్వ ఏర్పాటుతో వేర్పాటు బీజాలు
అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగానే బరాదర్ నాయకుడిగా ఉంటారని ఎక్కువమంది భావించారు. అమెరికాతో చర్చలు జరిపి, వారి సేనలు వెనక్కుమరలిపోయేలా చేయడంలో బరాదర్ కీలకపాత్ర పోషించాడు. దీనికితోడు అతను ముల్లాఒమర్‌కు సన్నిహితుడు. ఖతార్‌తో తనకు సత్సంబంధాలున్నాయి. అందుకే సహజంగా బరాదరే ప్రధాని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని అఫ్గాన్ పరిణామాల విశ్లేషకుడు నైమతుల్లా ఇబ్రహిమి అభిప్రాయపడ్డారు.
కొత్త ప్రభుత్వంలో కాందహార్‌కు చెందిన పాతతరం తాలిబన్లతో పాటు అల్‌కాయిదా, పాక్ ఐఎస్‌ఐతో సత్సంబంధాలున్న హక్కానీలకు పెద్దపీట దక్కింది. ఇరాన్ అండ ఉన్న పశ్చిమ తాలిబన్ గ్రూపునకు అసలు ప్రాధాన్యమే దక్కలేదు. గతంలో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాందహార్ గ్రూపుదే ప్రభుత్వంలో ఆధిపత్యం ఉండేది. కానీ తాజా ప్రభుత్వంలో హక్కానీలకు ప్రాధాన్యత పెరిగింది. ఐఎస్‌ఐ అండదండలే హక్కానీల బలం పెరిగేందుకు కారణమయ్యాయని నైమతుల్లా చెప్పారు. హక్కానీల నేత సిరాజుద్దీన్ తలపై అమెరికా కోటి డాలర్ల బహుమతి ప్రకటించింది. కానీ ప్రస్తుతం సిరాజుద్దీన్ అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకమంత్రి అయ్యారు. ఇది పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని అంశం.
(చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు)
ఉమ్మడి ప్రభుత్వమే శరణ్యం?
హక్కానీల ప్రాధాన్యత పెరగడం వల్లనే అఫ్గాన్ ప్రభుత్వాన్ని యూఎస్, మిత్రపక్షాలు గుర్తించడంలో జాప్యం చేయడం, అమెరికాలోని అఫ్గాన్ బ్యాంకు నిధులు విడుదల చేయకుండా తొక్కిపట్టడం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీన్ని బరాదర్ వైఫల్యంగా హక్కానీలు ఎత్తిచూపుతున్నారు. అయితే ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చినందుకు ఈ విషయంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని బరాదర్ వర్గం భావిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం గుర్తించకపోతే అఫ్గాన్‌కు ఆర్థిక సాయం అందదు. దీంతో దేశం తీవ్ర సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉంది. దీన్ని పట్టించుకోకుండా తాలిబన్– హక్కానీలు సిగపట్లు పడుతున్నారు.
ఇది కేవలం అఫ్గాన్‌కే కాకుండా పొరుగుదేశాలకు కూడా ప్రమాదం తెస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్‌లోని పలు వర్గాలను ప్రభుత్వంలో చేర్చుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని, దీనివల్ల తిరిగి దేశంలో అంతర్యుద్ధం ఆరంభం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధమే ఆరంభమైతే మరలా రష్యా, ఇరాన్, ఇతర దేశాలు తమ అనుకూల గ్రూపులకు సాయం చేయడం మొదలుపెడతాయి. దీంతో మరోమారు అఫ్గాన్‌లో హింసాత్మక పోరు పెచ్చరిల్లుతుందని నైమతుల్లా అభిప్రాయపడ్డారు. మరి ఇప్పటికైనా తాలిబన్లు, హక్కానీలు భేదాభిప్రాయాలు మరిచి ఇతర గ్రూపులకు కూడా ప్రభుత్వంలో స్థానం కల్పిస్తాయా? లేక గ్రూపు రాజకీయాలను పెంచుతాయా? అని అన్ని దేశాలు ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment