కాబూల్: అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం విలేకరులకు తెలిపారు. రెండుదశాబ్దాల పాటు అమెరికాతో పోరాడిన అగ్రనేతలు తాజా ప్రభుత్వంలో ప్రాధాన్యమైన పదవులు పొందారు. అమెరికాతో చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో పాటు మౌల్వీ హనాఫీలు అఖుంద్‌కు డిప్యూటీలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఏర్పాటైంది తాత్కాలిక ప్రభుత్వమేనని, శాశ్వత ప్రభుత్వం కాదని జబీహుల్లా చెప్పారు. దేశంలో ఇతర ప్రాంతాలవారిని కూడా ప్రభుత్వంలో కలుపుకునేందుకు యత్నిస్తామన్నారు.
అయితే ఎంతకాలం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వంలో మార్పులు ఎలా వస్తాయో వెల్లడించలేదు. ప్రభుత్వంలో ప్రతి మంత్రికి ఇద్దరు డిప్యూటీలుంటారని తెలిపారు. ప్రభుత్వంలో తాలిబనేతర వర్గాలకు స్థానం దక్కినట్లు కనిపించలేదు. అఫ్గాన్‌లో స్థిరత్వం కోసం దేశంలోని అన్ని తెగలను, వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావాలని అంతర్జా తీయ సమాజం ఆశిస్తోంది. ప్రభుత్వ కూర్పు, అధికార పంపిణీల విషయంలో తాలిబన్లు, హకాన్నీ నెట్‌వర్క్‌కు మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా ఉండటాన్ని హక్కానీ నెట్‌వర్క్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో పాక్ ఐఎస్‌ఐ చీఫ్ మధ్యవ ర్తిత్వానికి వచ్చారు.
చర్చల అనంతరం అందరికీ ఆమోదయోగ్యుడైన హసన్ అఖుంద్‌కు తాత్కాలికంగా పాలనాపగ్గాలు అప్పగించినట్లు కనపడుతోంది. మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లే మహిళలకు స్థానం కల్పించలేదు. ఖారీ ఫసిహుద్దీన్ బంద్‌క్షనిని ఆర్మీ చీఫ్‌గా నియమించారు. తాలిబన్ అధినేత హెబతుల్లా అఖుంద్‌జాదా సుప్రీం లీడర్‌గా ఇరాన్ నమూనా ప్రభుత్వం ఏర్పడుతుందని చాలామంది భావించారు. కానీ తాజా ప్రభుత్వంలో హెబతుల్లా ఎలాంటి పాత్ర పోషించేది స్పష్టం కాలేదు. ఇరాన్‌లో అధ్యక్షుడి కన్నా ఉన్నతస్థానంలో సుప్రీంలీడర్ ఉంటాడు. అంతిమాధికారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయి.
ఇతర ప్రముఖులు
డిప్యూటీగా నియమితులైన ముల్లా బరాదర్, తాలిబన్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2001లో తాలిబన్ల ప్రభుత్వం పడిపోయిన తర్వాత అప్పటి అఫ్గాన్ అధినేత హమీద్ కర్జాయ్‌తో సహకరిస్తామని సంప్రదింపులు జరిపినట్లు వార్తలున్నాయి. 2010లో పాక్‌లో అరెస్టయి అమెరికా ఒత్తిడితో 2018లో విడుదలయ్యారు. అప్పటినుంచి ఖతార్‌లో ఉంటున్నారు. యూఎస్ దళాల ఉపసంహరణ ఒప్పందంలో కీలకపాత్ర పోషించారు. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించాక దేశంలోకి అడుగుపెట్టారు. హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలకమైన హక్కానీ నెట్‌వర్క్ అధిపతి.
సూసైడ్ బాంబర్ల వినియోగం హుక్కానీ నెట్‌వర్క్ ప్రాముఖ్యత. తాలిబన్ల మిలటరీ ప్రధానబలం. తాలిబన్లతో అంతగా ఈ నెట్‌వర్క్‌కు పొసగదని, పాక్ కారణంగా కలిసి ఉంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్, తాలిబన్ స్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు. తాలిబన్ల ఫీల్డ్ కమాండర్లను పర్యవేక్షించే మిలటరీ కమిషన్‌కు అధిపతిగా వ్యవహరించారు.
ఎవరీ అఖుంద్?
ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(65), తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు. గత తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, కాందహార్ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం ఐరాస ఆంక్షల జాబితాకెక్కారు. తాలిబన్ కమాండర్లలో అత్యంత ప్రభావశాలి అని ఐరాస పేర్కొంది. అఖుంద్ పేరును స్వయంగా తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖుంద్‌జాదా ప్రతిపాదిం చారని పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరవైఏళ్లుగా తాలిబన్ల నాయకత్వ మండలి ‘రెహబరి షురా’కు అఖుంద్ అధిపతిగా ఉన్నారు. ఈ కూటమి అగ్రనేత అఖుంద్‌జాదా ఆదేశాల మేరకు అన్ని రకాల మిలీషియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
కీలక మంత్రులు– శాఖలు
► అమీర్ ఖాన్ ముత్తఖీ: విదేశాంగ మంత్రి
►షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానెక్‌జాయ్: విదేశాంగ సహాయ మంత్రి
► సిరాజ్ హక్కానీ: హోంశాఖ మంత్రి
► ముల్లా యాకూబ్: రక్షణ మంత్రి
► అబ్దుల్లా హకీం షరే: న్యాయ మంత్రి
► హిదాయతుల్లా బద్రి: ఆర్థిక మంత్రి
► షేక్ మవ్లావీ నూరుల్లా: విద్యా మంత్రి
► నూర్ మొహ్మద్ సాకిబ్: మత వ్యవహారాలు
(చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!)
చదవండి: క్రికెట్ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..?
Comments
Please login to add a commentAdd a comment