US Talibans Face To Face Meeting: అమెరికా సైనిక దళాల ఉపసంహరణ వల్లే తాలిబన్ల దురాక్రమణకు మార్గం సుగమం అయ్యిందనే విమర్శ ఉంది. అంతేకాదు అఫ్గనిస్తాన్ నుంచి చాలా దేశాలకు వర్తకవాణిజ్యాలు నిలిచిపోవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధపడడం ఆసక్తికరంగా మారింది.
ఆగష్టు 31తో ఆఫ్గన్ నుంచి బలగాల్ని ఉపసంహరించుకున్న అగ్రరాజ్యం.. ఆ తర్వాత అక్కడి పరిణామాల్లో తలదూర్చలేదు. కానీ, అక్కడి పౌర హక్కుల ఉల్లంఘనపై మాత్రం తాలిబన్లను నిలదీస్తూ వస్తోంది. మరోవైపు తాలిబన్ల చేష్టల్ని ఓ కంటకనిపెడుతున్న అమెరికా.. ఇప్పుడు ప్రత్యక్ష చర్చలకు సిద్ధపడుతుండడం విశేషం. ప్రపంచంతో వర్తకవాణిజ్యాల పునరుద్దరణ ప్రధాన ఎజెండాగా ముఖాముఖి చర్చలకు రెడీ అయ్యింది. ఈ చర్చల్లోనే తాలిబన్లకు పలు షరతులు విధించాలని భావిస్తోంది.
ఆ ఒక్కటి తప్ప..
అయితే ఆశ్చర్యకరరీతిలో చర్చలకు సిద్ధపడిన బైడెన్ ప్రభుత్వం.. తాలిబన్లకు మాత్రం గట్టి ఝలకే ఇచ్చింది. ఇలా చర్చలు జరిపినంత మాత్రానా తాలిబన్లను అఫ్గనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధులుగా గుర్తించబోమని (తాలిబన్ ప్రభుత్వంగా గుర్తించమని పరోక్షంగా) ప్రకటన విడుదల చేసింది. ‘‘తాలిబన్లు ఇప్పటికీ ఉగ్రవాద అనుబంధ సంస్థగానే ఉన్నారు. అమెరికాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజం నుంచి వాళ్లు(తాలిబన్లు) మారారనే నమ్మకం కలిగినప్పుడే ప్రభుత్వ గుర్తింపు అంశం పరిశీలిస్తాం’ అని అమెరికా తరపు ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు.
అమెరికా తరపున ప్రతినిధులు శనివారం నేరుగా తాలిబన్లతో సమావేశమై చర్చలు జరపబోతున్నారు. వాణిజ్య అంశాలతో పాటు ఎగుమతులు-దిగుమతుల కొనసాగింపు, సుంకాల విధింపు-సడలింపులు తదితర విషయాలపై చర్చించనున్నారు. వీటితో పాటే మానవ హక్కులు.. ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల్ని పరిరక్షించాలనే డిమాండ్‌ను సైతం తాలిబన్ల ముందు ఉంచాలని అమెరికా భావిస్తోందట. అంతేకాదు ఈ సంక్షోభ-విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దేశాలను, సహాయక బృందాలను అఫ్గనిస్తాన్‌లోకి అనుమతించాలని సైతం కోరనుంది.
Comments
Please login to add a commentAdd a comment