ప్రజల తీర్పును తిరగరాద్దాం!
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే జిల్లా ప్రజలు మద్దతు ఇచ్చారు
అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల పిలుపు
గిద్దలూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న అట్ల చినవెంకటరెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక తన నివాస గృహంలో కొమరోలు, గిద్దలూరు, రాచర్ల మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వైఎస్సార్‌సీపీ నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధిష్టానం నిర్ణయానుసారం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ కౌన్సిలర్లు చినవెంకటరెడ్డికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి పట్టు ఉందని.. అయితే ఏమాత్రం గెలుపునకు అవకాశం లేని అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించిందన్నారు.
ఓటుకు నోటు అన్న నినాదంతో టీడీపీ నేతలు స్థానిక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు సాధించేందుకు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ప్రజలు తీర్పునిచ్చారన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని గెలుపొందగలిగామన్నారు. ప్రజలు ఎలాంటి విజయాన్ని ఇచ్చారో అదే విధంగా ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఓట్లను కొనుగోలు చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో బృందాలు తిరుగుతున్నాయని హెచ్చరించారు. గిద్దలూరు, కొమరోలు ఎంపీపీలు కడప వంశీధరరెడ్డి, కే.అమూల్య, వైఎస్సార్‌సీపీ కొమరోలు మండల కన్వీనర్ హెచ్.సార్వభౌమరావు, వైస్ ఎంపీపీ డి.ఆంజనేయులు, సొసైటీ చైర్మన్ కె. వెంకటేశ్వర్లు, నాయకులు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.