సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు.
కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్‌సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
పోటీకి అందరూ ససేమిరా
వాస్తవానికి.. ఎలాగైనా ఎవరో ఒకర్ని పోటీలో నిలపాలని కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు భావిస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో అధికార పక్షానికి బలం లేకపోవడం, వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో టీడీపీ అ«భ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్‌లలో ఎవరో ఒకర్ని పోటీచేయించాలని చంద్రబాబు ప్రయత్నించారు.
కానీ, గెలిచేందుకు ఏమాత్రం అవకాశంలేకపోవడం.. పైగా బలమైన ప్రత్యర్థి బొత్స ఉండడంతో పోటీకి వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా నిలిపేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి టికెట్ ఆశించారు. ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అతనికి ఆశాభంగమైంది.
ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశపెట్టి అతన్ని బరిలో దించాలని విశాఖ జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేశ్ కూడా ఈయన పేరును తెరపైకి తెచ్చారు. గెలిచే అవకాశంలేని ఎమ్మెల్సీ సీటుకు పోటీచేసేందుకు ఆయన కూడా ముందుకు రాకపోవడంతో గత్యంతరంలేని స్థితిలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు చంద్రబాబు మంగళవారం విశాఖ జిల్లా నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.
ఓటమి భయంతోనే వెనకడుగు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని ముందు నుంచి భావించిన టీడీపీ చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. విశాఖ స్థానిక సంస్థల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో వచ్చే ఓటమి ఘోర పరాభవం కింద లెక్కే. ఇటీవలే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఇదే జరిగింది.
అక్కడ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో.. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న వైఎస్సార్‌సీపీని తట్టుకుని నిలబడటం టీడీపీకి పెను సవాల్‌గా మారే పరిస్థితి ఉందని.. పైగా, ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలలకే ఓటమి చవిచూస్తే ఆ ప్రభావం తట్టుకోవడం కష్టమనే పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతులెత్తిసినట్టు సమాచారం.
బొత్స ఎన్నిక లాంఛనమే
మరోవైపు.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ సవాల్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా మాజీమంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా కూడా నామినేషన్ వేశారు. గడువులోగా ఈయన నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ పోటీ జరిగినా బొత్స ఎన్నిక లాంఛనమే.
దిలీప్‌కు హితోపదేశం..!
ఇదిలా ఉంటే.. దిలీప్ పేరుని ప్రతిపాదించిన లోకేశ్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ.. ఆ ప్రతిపాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగా టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్లు పావులు కదిపారు. టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దిలీప్ చక్రవర్తికి వ్యాపార భాగస్వామిగా ఉన్న ఓ ఎమ్మెల్సీ ద్వారా మంతనాలు ప్రారంభించారు.
సదరు అభ్యర్థిగా భావిస్తున్న వ్యక్తికి హితోపదేశం చేయడం ప్రారంభించారు. రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు ఖర్చుచేసినా.. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. డబ్బులు, టైమ్ వేస్ట్ అంటూ బ్రెయిన్‌వాష్ చేశారని సమాచారం. ఓట్ల అంతరం చాలా ఉందనీ.. దాన్ని అధిగమించడం కష్టమనీ.. అందుకే ఓడిపోయే సీటును అంటగట్టేందుకు చూస్తున్నారని చెప్పారు.
నామినేషన్ వేసి.. కోట్ల రూపాయలు నష్టపోయే కంటే.. అసలు పోటీలో ఉండకపోవడం మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే గండి బాబ్జీ, పీలా గోవింద్‌లు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వివరించారు. అంతా విన్న దిలీప్ పోటీచేయలేనంటూ లోకేశ్‌కి తెగేసి చెప్పేశారు.
Comments
Please login to add a commentAdd a comment