ఎస్సైని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ | muthumula ashok reddy demand for suspend of si | Sakshi
Sakshi News home page

ఎస్సైని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్

Published Wed, Jul 2 2014 5:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

muthumula ashok reddy demand for suspend of si

గిద్దలూరు: ఎస్సై దురుసు వైఖరితో వైఎస్సార్ సీపీ నాయకుడు మృతి చెందడంతో గిద్దలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిద్దలూరు సహకార సంఘ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వైజా భాస్కరరెడ్డి గుండెలపై ఎస్సై వై శ్రీనివాసరావు బలంగా చేత్తో నెట్టడంతో ఆయన గుండెపోటుకు గురై మృతిచెందారు. దీంతో సోమవారం రాత్రి నుంచి గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లోనే మృతదేహాన్ని ఉంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ధర్నా నిర్వహించారు.

ఎస్సైని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముత్తుముల మాట్లాడుతూ ఎస్సై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడ్ని కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్సై చర్యలను ఖండించిన వైజా భాస్కర్‌రెడ్డిపై దుర్భాషలాడి దాడికి పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు. గతంలోనూ ఎస్సై ఇలాంటి దాడులకు పాల్పడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయాందోళనలకు గురిచేశారని అన్నారు.

 ఎస్సైతో పాటు డీఆర్‌ఆర్ ప్లాజా వద్దకు వెళ్లి దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుళ్లను కూడా వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా విరమించాలని సీఐ నిమ్మగడ్డ రామారావు వారిని కోరారు. అయినా ఆందోళన ఉధృతం కావడంతో మార్కాపురం డీఎస్పీ జీ రామాంజనేయులు అక్కడకు వచ్చారు. ఎస్సైని సస్పెండ్ చేయడం కుదరదని డీఎస్పీ చెప్పడంతో పోలీసు వ్యవస్థ టీ డీపీకి అమ్ముడు పోయిందని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తప్పు చేసిన ఎస్సైని రక్షించేందుకు డీఎస్పీ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఏఎస్పీ రామానాయక్ గిద్దలూరు చేరుకుని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో చర్చించారు.

సంఘటన వివరాలు తెలుసుకున్న ఆయన..ఎస్సైని వీఆర్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సై శ్రీనివాసరావుపై హత్యాయత్నం (సెక్షన్ 304) కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. వివాదానికి కారణమైన సుబ్బారావుపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వైజా భాస్కర్‌రెడ్డి చనిపోయాడని సమాచారం అందుకున్న బంధువులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బోరున విలపించారు.

 అసలేం జరిగిందంటే...
 పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డీజీఆర్ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న డాక్టర్ హరనాథరెడ్డి స్థానిక డీఆర్‌ఆర్ ప్లాజాలో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో హీరోహోండా షోరూం నిర్వాహకుడు తోట సుబ్బారావు కుటుంబం నివాసం ఉంటోంది. ముందుగా హరనాథరెడ్డి వాహనాన్ని పార్కింగ్‌లో పెట్టారు. వెనకాల అపార్ట్‌మెంట్‌కు వచ్చిన సుబ్బారావు తన కారుకు హరనాథరెడ్డి కారు అడ్డుగా ఉందంటూ ఆ వాహనాన్ని ఢీ కొట్టి దూషించారు.

దీంతో ఆగ్రహించిన హరనాథరెడ్డి తండ్రి ‘మా పార్కింగ్ స్థలంలో కారును పెట్టుకున్నాం.. నీవెందుకు తిడుతున్నావని’ ప్రశ్నించగా ఆయనపై సుబ్బారావు దాడికి దిగాడు. పక్కనే ఉన్న మరో విశ్రాంత ఉద్యోగి గొడవెందుకని వారించేందుకు వెళ్లగా సుబ్బారావు భార్య ఆయనను కొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ వెంటనే సుబ్బారావు ఎస్సైకి ఫోన్ చేసి గొడవ జరుగుతుందని సమాచారం అందించాడు. ఎస్సై వై.శ్రీనివాసరావు  అక్కడకు చేరుకుని డాక్టర్ హరనాథరెడ్డి, ఆయన తండ్రి, భార్య ఇలా అందరిపై దాడి చేశారు.

మహిళ అని కూడా చూడకుండా హరనాథరెడ్డి భార్యను దూషించి తన వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించాడు. డీఆర్‌ఆర్ ప్లాజా యజమాని అయిన వైజా భాస్కర్‌రెడ్డి సమాచారం తెలుసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికి హరనాథరెడ్డిని వైద్యుడు అని కూడా చూడకుండా పోలీసులు కింద కూర్చోబెట్టి..సుబ్బారావును కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో ఆగ్రహించిన భాస్కర్‌రెడ్డి డాక్టర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా..అని సీఐ రామారావును ప్రశ్నించారు. తాను మాట్లాడి పంపిస్తానని సీఐ చెబుతుండగానే..పక్కనే గదిలో ఉన్న ఎస్సై అక్కడకు చేరుకుని సుబ్బారావుపై దాడిచేసిన వారితో మాట్లాడేదేంటి అని..ముగ్గురిపై కేసు కడతానని ఆగ్రహంగా ఉన్నాడు.

 తాను వారితో మాట్లాడతానని సీఐ సర్దిచెప్పినా వినకుండా..కేసు రిజిస్టర్ చేయకపోతే తాను రాజీనామా చేస్తానని ఎస్సై చెప్పాడు. దీంతో ‘మా వారిపై కేసులు పెట్టడం మామూలే కదా’ అని వైజా భాస్కరరెడ్డి ఎస్సైని నిలదీశారు. అలా మాటా..మాటా పెరిగి ఎస్సై భాస్కర్‌రెడ్డి గుండెలపై చేత్తో బలంగా నెట్టాడు. దీంతో ఆయన గుండెల్లో నొప్పి అంటూ మంచినీళ్లు తాగి కాసేపు కూర్చున్నారు. శ్వాస అందడం లేదని బయటకు వచ్చిన వైజా నేలకొరిగి చనిపోయారు. భాస్కర్‌రెడ్డిని ఎస్సై కొట్టడంతోనే గుండెనొప్పికి గురై మరణించాడని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement