గిద్దలూరు: ప్రజలను మోసం చేస్తే తాము సహించమని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్‌సీపీ వెనకాడదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఒంగోలు ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ ప్రకటించిన రైతులు, డ్వాక్రా రుణమాఫీపై చేస్తున్న తాత్సారానికి నిరసనగా స్థానిక తహ శీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
మోసపూరితమైన రాక్షస పాలనను విడిచి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి సంక్షేమ పాలనను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు చెల్లించొద్దని, తాను అధికారంలోకి రాగానే అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిందన్నారు. రైతులు, మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు వారికిచ్చిన హామీలను అమలు పరచడంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు.
పంట దిగుబడులు రాక, పండిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు నాలుగేళ్లుగా అప్పుల్లో కూరుకుపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు చెల్లించలేని పరిస్థితిలో నలిగిపోతున్నారని, అప్పులు పుట్టక పెట్టుబడులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు.
2004 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌పై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని నెరవేర్చారని, అలానే చంద్రబాబు చేస్తాడని ఆశపడి ఓట్లేసిన వారి ఆశల్ని అడియాశలు చేస్తూ రోజుకో ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులు, మహిళలను ఇలా మోసం చేయడం ఎంత వరకు భావ్యమని ఆయన ప్రశ్నించారు.
రైతులు, మహిళలు తీసుకున్న రుణాలు తీరక పోగా, కొత్త అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 86 వేల కోట్ల రూపాయల అప్పులుండగా, దానికి మరో రూ.26 వేల కోట్ల వరకు వడ్డీ వచ్చిందని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదన్నారు. లక్ష కోట్లకు పైగా ఉన్న అప్పుకు రూ.5 వేల కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం దారుణమని ఆయన మండిపడ్డారు.
ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు:
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చె ప్పి.. ఐదు నెలలైంది ఏ ఒక్కటైనా అమలు చేశావా అని ఎంపీ ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశార ని...జాబు రావడం కాదు ఉన్న జాబు ఊడగొట్టావని విమర్శించారు.
కార్మికులు, ఆదర్శ రైతులను తొలగించి వారి ఉసురుకొట్టుకున్నారన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కావని, ఫీజులు చెల్లించి చదువుకోలేక, చదువు మానేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు సంక్షేమ పాలనను తెస్తానని నమ్మబలికి రాక్షస పాలనను అందిస్తున్నాడన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కార్పొరేషన్ సమావేశంలో ప్రశ్నించినందుకు మూడు కేసులు పెట్టించి రౌడీ షీట్ తెరుస్తామని చెబుతున్నారని, ఇలాంటి పాలన ఎన్నడూ చూడలేదన్నారు.
ఇదేనా సంక్షేమం..
వృద్ధులు, వితంతువుల పింఛన్లు వెయ్యి రూపాయలకు పెంచుతామని చెప్పిన బాబు రాష్ట్రంలో 10 లక్షల మంది పింఛన్లు తొలగించి, 16 లక్షల మందికి చెందిన తెల్లరేషన్ కార్డులు తొలగించారని, వారిని వీధులపాలు చేసి ఉసురుపోసుకున్నాడని దుయ్యబట్టారు. ఇదేనా సంక్షేమమని ప్రశ్నించారు. పశ్చిమ ప్రకాశానికి తలమానికగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు తాము కృషిచేస్తామని, అందుకు తగిన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ ముందుంటుందని, రేషన్ కార్డులు, పింఛన్లు అన్నీ మంజూరయ్యేలా పోరాటం చేస్తామన్నారు. ముందుగా ముత్తుముల గృహం నుంచి ర్యాలీగా తహ శీల్దారు కార్యాలయం వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. అనంతరం డిప్యూటీ తహ శీల్దారు వరకుమార్‌కు వినతి పత్రం అందించారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు కేవీ.రమణారెడ్డి, యేలం వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధులు సూరా స్వామిరంగారెడ్డి, దప్పిలి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనరు కే.హిమశేఖరరెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నగర పంచాయతీ చైర్‌పర్సన్ బండారు వెంకటసుబ్బమ్మ, ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దుగ్గా రామ్మోహన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, రైతులు, డ్వాక్రా మహిళలు వేలాదిగా పాల్గొన్నారు.
రాక్షస పాలనను వీడు బాబూ..
Published Thu, Nov 6 2014 3:24 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement
Advertisement