ఆధార్‌లో వయోమాయ | Irregularities CSC centers in GIDDALUR | Sakshi
Sakshi News home page

ఆధార్‌లో వయోమాయ

Published Sun, Jul 15 2018 8:57 AM | Last Updated on Sun, Jul 15 2018 8:57 AM

Irregularities CSC centers in GIDDALUR - Sakshi

గిద్దలూరు: కామన్‌ సర్వీసు సెంటర్‌ (సీఎస్సీ)లు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఆధార్‌ కార్డులతో మాయలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలల్లో లబ్ధిపొందాలనుకునే వారి వయస్సు వారికి కావాల్సినట్టుగా మార్చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు నకిలీ గుర్తింపు కార్డులు ఐడీలు తయారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందుకు లబ్ధిదారుల నుంచి వేలకు వేలు వసూలు చేసి, జేబులు నింపుకొంటున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని మీ సేవ కేంద్రాలను పట్టణాల్లో నిర్వహిస్తూ అక్కడే సీఎస్సీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 

ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు వసూలు..
అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో బలం నిరూపించుకునేందుకు పింఛన్లు, పెళ్లికానుకలు ఇప్పిస్తామని చెప్పి వారి ఆధార్‌కార్డుల్లో తక్కువ వయసు ఉన్నా వయసు  పెంచి, అనర్హులకు లబ్ధి కల్పించడం.. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలు చొప్పున వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. గిద్దలూరు నియోజకవర్గంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాల్య వివాహాలు చేసుకునే వారు పెళ్లికానుక పథకానికి అనర్హులు. ఇందుకు బాలికకు చెందిన ఆధార్‌కార్డులో వయస్సు మార్పించేస్తున్నారు. 

మీసేవ కేంద్రాలను నిర్వహించే బాధ్యత 2012లో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీవారు అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలంలోని అంబవరం గ్రామంలో నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రం నిర్వాహకుడు అంబవరంతో పాటు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చెందిన ఆధార్‌కార్డులను మార్చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఏజెన్సీ నిర్వాహకులు కేంద్రాన్ని నాలుగు నెలల క్రితం రద్దు చేశారు. అప్పటికే కొన్ని వేల ఆధార్‌కార్డుల్లోని సమాచారాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా కొమరోలు, గిద్దలూరు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న మీసేవ కేంద్రాలను పట్టణంలో ఏర్పాటు చేసుకుని దందా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

కేంద్రాలు రద్దయినా ఆగని అక్రమాలు..
కొన్ని ఆధార్‌ సీడింగ్‌ కేంద్రాల నిర్వాహకులు గోప్యంగా ఉంచాల్సిన వ్యక్తుల యూఐడీఐని బహిర్గతం చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆధార్‌ ఎర్‌రోలింగ్‌ కేంద్రాలను తీసేసింది.  ఎన్‌రోలింగ్‌ బాధ్యతలను కేవలం మండల కేంద్రాల్లోని మీసేవ కేంద్రాలకు, బ్యాంకులకు, పోస్టాఫీసులకు మాత్రమే ఇచ్చారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఉండటం వలన అక్రమాలు జరగవని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తగిన సిబ్బంది లేకపోవడం వలన ఆధార్‌ ఎన్‌రోలింగ్‌ బాధ్యలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. కొన్ని బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది వారి ఐడీలను రూ.5వేల నుంచి రూ.10వేల వరకు విక్రయించుకున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వారి ఐడీ ప్రకారం సదరు ఉద్యోగికి చెందిన వేలిముద్రలు తీసుకుని బయట సీఎస్సీ కేంద్రాల్లో ఆధార్‌ కార్డుల్లో వయస్సు, ఇతర సమాచారాన్ని మార్చేస్తున్నారని సమాచారం. ఇలాంటి కేంద్రాలు గిద్దలూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం సమీపంలోని సీఎస్సీ కేంద్రంలో రూ.4వేలు తీసుకుని ఆధార్‌కార్డులో వయస్సు మార్చి ఇస్తున్నారు.

ఆశకు పోతే అనర్ధం జరిగింది..
కొమరోలు మండలానికి చెందిన ఓ వ్యక్తికి 55 ఏళ్లు ఉండగా పింఛను ఇప్పిస్తామని ఓ నాయకుడు ఆధార్‌కార్డు తీసుకెళ్లి వయస్సు 65గా మార్పించారు. ఏడాది పాటు పింఛను రాలేదు. ఆయన అనారోగ్యంతో మృతిచెందాడు. వయస్సు ఎక్కువ వేయడం వలన చంద్రన్న బీమాకు అనర్హుడయ్యాడు. దీంతో ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. అదేవిధంగా గిద్దలూరు మండలంలోని ముండ్లపాడుకు చెందిన 9వ తరగతి విద్యార్థినికి వివాహం చేసిన కుటుంబ సభ్యులు పెళ్లి కానుక కోసం ఆధార్‌కార్డులో వయస్సు పెంచారు. బాల్య వివాహం చేసుకున్నారంటూ ఫిర్యాదు అందడంతో సదరు అధికారులతో గొడవలు పడి కేసులు పెట్టకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

కొత్త కేంద్రాలకు గ్రహణం..
పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకు సరిపడినన్ని మీ సేవ కేంద్రాలు లేకపోవడం వలన ప్రైవేటు వ్యక్తులు వివిధ ఏజెన్సీల పేర్లతో రహస్యంగా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 

 గిద్దలూరు పట్టణంలో 10 మీసేవ కేంద్రాలు ఉండాల్సి ఉన్నా కేవలం ఒక్కటే నడుస్తోంది. దర్శి నియోజకవర్గ కేంద్రంలో 8 కేంద్రాలు ఉండాల్సి ఉన్నా ఒక్కటే ఉంది. దీనిపై పలువురు ప్రజా ప్రతినిధులు కోర్టుకు వెళ్లినా కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు చొరవ చూపడం లేదు. ఫలితంగా అక్రమార్కులు బినామీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆధార్‌ ఎన్‌రోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు, జనాభా ఆధారంగా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement