గిద్దలూరులో తెలుగు తమ్ముళ్ల గుర్రు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరి గిద్దలూరు సీటు దక్కించుకున్న అన్నా రాంబాబుకు తెలుగు తమ్ముళ్ల నుంచి వ్యతిరేకత ఏర్పడుతోంది. చేరిన రోజే ఆయనకు సీటు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ల పాటు జెండాలు మోసిన తమను కాదని, నామినేషన్లకు ఒక రోజు ముందు వచ్చిన రాంబాబుకు గిద్దలూరు సీటును కేటాయించడంపై గుర్రుమంటున్నారు.
టీడీపీకి ఓటు వేసే గ్రామ స్థాయి ఓటర్లు కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలుగుదేశం ఓటర్లకు కనీసం రేషను కార్డు కూడా ఇప్పించని రాంబాబుకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారు. గతంలో తమకు ఏమీ చేయలేదని, కాంగ్రెసు పార్టీకి చెందిన వారికే ప్రభుత్వ లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చినా ఓటు ఎలా వేస్తామంటున్నారు.
- ఇదిలా ఉంటే అన్నా రాంబాబు తెలుగుదేశం నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి వారితో ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు, గ్రామ స్థాయి ఓటర్లకు మద్యం సరఫరా చేసి, ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గిద్దలూరులో మద్యం ఏరులై పారుతున్నట్లు సమాచారం.
- ఈ నేపథ్యంలో తెలుగుదేశం సీటు ఆశించిన సాయికల్పనా రెడ్డి, తనకు సీటు దక్కకపోవడంతో, తన పుట్టిల్లు కర్నూలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె కూడా అన్నా రాంబాబుకు సహకరించేందుకు సుముఖంగా లేరన్నట్లు సమాచారం. ఎన్నికల తరువాత గాని ఆమె గిద్దలూరు చేరుకునే అవకాశం లేదు.
- ఇక ద్వితీయ శ్రేణి నాయకులు మహానంది యాదవ్, దేవ ప్రభాకర్ లాంటి వారు కూడా అన్నా రాంబాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.
- అయితే అన్నా రాంబాబు ఆ పార్టీలోని అన్ని వర్గాల నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నా, ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.
- తెలుగుదేశంకు చెందిన నాయకుడు ఒకరు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీ జెండాలు మోస్తున్నామని, తమను కాదని, ఒక్క రోజు ముందు వచ్చిన కాంగ్రెసు నాయకులకు పార్టీ టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
- తెలుగుదేశం నాయకులకు టికెట్ ఇస్తే, వారు గెలిచిన తరువాత, వారికి సహచరులుగా ఉన్న తమ లాంటి వారు ఎదగడానికి ఏదో ఒక అవకాశం వస్తుందని ఆశించామని అన్నారు. అయితే కొత్త వ్యక్తికి ఇవ్వడం వల్ల, ఆ అభ్యర్థి , తన సహచరులు ఎదగడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. ఇన్నాళ్లు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని అంటున్నారు.
- ఇలాంటి నాయకులు అనేక మంది అన్నా రాంబాబు టీడీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకు మరో రెండువారాల సమయం ఉండగా, అన్నా రాంబాబు వీరిని ఏవిధంగా సంతృప్తి పరచనున్నారో వేచి చూడాల్సి ఉంది.