మంత్రులు వస్తున్నారని ..నీళ్లు నేలపాలు
‘ప్రతి నీటి బొట్టూ విలువైనదే ... ప్రాణప్రదంగా చూసుకోవాలి ... సద్వినియోగం చేసుకోవాలి’ తెల్లారిన దగ్గర నుంచి రాత్రి వరకూ ఇటు ప్రజాప్రతినిధులు ... అటు అధికారులు చేస్తున్న హితబోధలివీ... గిద్దలూరు పట్టణంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ పట్టణానికి వచ్చారని నీటిని ట్యాంకర్లతో తెచ్చి రోడ్డుపై వెదజల్లిన వైనం చూసినవారు విస్తుపోయారు.
మంత్రి వర్యులు వచ్చిన కార్యక్రమం ఏమిటో తెలుసా ‘సేవ్ వాటర్ – సేవ్ లైఫ్’ కార్యక్రమానికి. ఆయన కారులో రయ్...మన్నప్పుడు దుమ్ము,ధూళి పైకి ఎగరకూడదని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ట్యాంకుల నీటిని ఇలా గాంధీ బొమ్మ సెంటరు నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డుపై విరజిమ్మారు. నీటిని ఇలా వృధా చేస్తున్న సమయంలోనే ఓ వృద్ధుడు నీటి బిందెలను నాలుగు చక్రాల బండిపై పెట్టుకుని నెట్టుకొస్తూ కనిపించగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మంది.
– గిద్దలూరు