water wastage
-
ది అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీ.. తక్కువ ఖర్చుతో నీరు పునర్వినియోగం
నీటి కొరత పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా నీటి పునర్వినియోగం అవసరం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. వ్యర్థజలాలను శుద్ధిచేసి, పునర్వినియోగానికి అనువుగా మార్చే పద్ధతులు కొన్ని అందుబాటులోకి వచ్చినా, అవి ఖర్చుతో కూడుకున్నవి కావడంతో పెద్దపెద్ద పరిశ్రమలు మాత్రమే వాటిని భరించగలుగుతున్నాయి. ఇప్పుడు ఎంత చిన్న పరిశ్రమ అయినా సులువుగా భరించగలిగేలా, తక్కువ ఖర్చుతో వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని అందిస్తోంది ‘టడాక్స్’ (ది అడ్వాన్స్డ్ ఆక్సిడేషన్ టెక్నాలజీ). ఈ పద్ధతిని న్యూఢిల్లీకి చెందిన ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. కేవలం యూవీ–ఫొటో కాటాలిసిస్ సాంకేతికత ఉపయోగించి మునిసిపల్, మురుగునీరు, కలుషిత పారిశ్రామిక నీటి ప్రవాహాలను శుద్ధి చేసి, పునర్వినియోగానికి తగిన విధంగా మంచినీటిని అందిస్తుంది. అంతేకాదు, ఈ అధునాతన సాంకేతికత పారిశ్రామిక మురుగునీటి శుద్ధికి జరిగే మూలధన వ్యయాన్ని 25 నుంచి 30 శాతం, నిర్వాహణ వ్యయాన్ని 30 నుంచి 40 శాతం వరకు తగ్గిస్తుంది. ఎలా పనిచేస్తుంది? టడాక్స్ మూడు దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో యూవీ ఫొటో క్యాటాలిసిన్ పద్ధతి ఉపయోగించి కాంతిని రసాయనికశక్తిగా మారుస్తుంది. రెండో దశలో అధునాతన ఆక్సీకరణ ప్రక్రియ ఉంటుంది. ఇది ఆక్సీకరణ క్షీణత, కాలుష్య కారకాల ఖనిజీకరణ చేసి, బయో–డీగ్రేడబిలిటీని మెరుగుపరుస్తుంది, పొరల బయో ఫౌలింగ్ను నివారిస్తుంది. దీంతో నీటిలోని ఘన మలినాలను పీల్చుకుని వడగొట్టే ఆర్ఓ (రివర్స్ అస్మాసిస్)ల జీవితకాలం, సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మల్టిఫుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్లు, మెకానికల్ ఆవిరి రీకంప్రెషన్లపై భారాన్ని పెంచి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), వ్యాధికారకాలు, నిరంతర జీవ కాలుష్య కారకాలు, సూక్ష్మ కాలుష్య కారకాలను తగ్గిస్తుంది. తృతీయ దశలో నాణ్యత స్థాయిని గుర్తించి, పునర్వినియోగానికి అనువైన పరిశుభ్రమైన నీటిని అందిస్తుంది. త్వరలోనే అమలు.. టడాక్స్ను ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వ శాఖ ‘నమామి గంగే’ కార్యక్రమం కింద కొన్ని ఎంపిక చేసిన పరిశ్రమల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఇది 2021 ఏప్రిల్‌లోనే ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లు, టెక్నాలజీ అండ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఒప్పందం ద్వారా వాణిజ్యీకరణకు సిద్ధమైంది. త్వరలోనే ఇది పూర్తి స్థాయి కార్యాచరణలోకి రావచ్చు. ∙దీపిక కొండి -
Hyderabad: నిత్యం 150 మిలియన్ గ్యాలన్ల నీరు నేలపాలు
సాక్షి, హైదరాబాద్: వందల కిలో మీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల్లో నిత్యం 150 మిలియన్ గ్యాలన్ల విలువైన తాగునీరు వృథా అవుతుండడం తీరని వ్యథ మిగులుస్తోంది. నిత్యం కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశ, జంట జలాశయాలు, సింగూరు, మంజీరా జలాశయాల నుంచి 593 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించి శుద్ధి చేసి నగరంలోని 12 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. ఇందులో సుమారు 25 శాతం వృథా అవుతోంది. పురాతన పైపులైన్లకు తరచూ ఏర్పడుతోన్న లీకేజీలు, అక్రమ నల్లాలు, నీటి చౌర్యం ఇందుకు ప్రధాన కారణం. కాగా ఈ నీటితో శివారు ప్రాంతాల్లో 35 లక్షల మంది దాహార్తిని తీర్చే అవకాశం ఉందని తాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీటివృథాను అరికట్టేందుకు నగరంలో 400కు పైగా ఉన్న స్టోరేజి రిజర్వాయర్ల పరిధిలో సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. వృథాపై పబ్లిక్ నజర్.. తాగునీటి వృథాను అరికట్టే కృషిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టనున్న మొబైల్యాప్ దోహదం చేస్తుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు ఈ మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా పైపులైన్ల లీకేజీలు, రిజర్వాయర్ల వద్ద నీటివృథా, అక్రమ నల్లాల ద్వారా జరుగుతోన్న నీటిచౌర్యంపై నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కలి్పంచనున్నారు. అంతేకాదు నీటివృథాపై అప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఫోటో తీసి అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈ సమాచారం క్షణాల్లో ఉన్నతాధికారులతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయడం ద్వారా నీటివృథాకు చెక్‌పెట్టవచ్చని తెలిపారు. అక్రమ నల్లాలపై సమాచారం అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. కాగా ఔటర్‌పరిధిలోని 190 గ్రామాలు, నగరపాలక సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు తాగునీటిని సరఫరా చేసేందుకు జలమండలి ఓఆర్ఆర్ తాగునీటి పథకం ఫేజ్–1,ఫేజ్–2 పథకాలను పూర్తిచేసిన విషయం విదితమే. ఈ పథకం కింద సుమారు ఐదువేల కిలోమీటర్లకు పైగా తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సుమారు 200కు పైగా నూతనంగా తాగునీటి స్టోరేజి రిజర్వాయర్లను నిరి్మంచిన విషయం విదితమే. ప్రస్తుతం జలమండలి ప్రతీ వ్యక్తికి ప్రధాన నగరంలో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 150 లీటర్ల తాగునీటిని అందిస్తుండగా..శివారు ప్రాంతాల్లో సుమారు వంద లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. -
‘వరద’కు ఇరవై ఆరేళ్లు
సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వృథా గా పోతున్న మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను దిగువ ప్రాంతాలకు తరలించడ మే కాకుండా, అవసరమైన సమయంలో ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోసేందుకూ ఈ కాలువ ఉపయో గపడనుంది. సుమారు 2.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు జవసత్వాలు కల్పిస్తున్న వరద కాలువ రేపటి (జూన్ 30)తో 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరిన తర్వాత వచ్చే వరదను వచ్చినట్లు గోదావరిలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఉండేది. అలా గోదావరిలో వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గాను చేపట్టినదే వరద కాలువ నిర్మాణం. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని 2.20 లక్షల ఎకరాల మెట్ట భూములకు నీరందించేందుకు గాను ఈ వరద కాలువకు రూపకల్పన చేశారు. 1993 జూన్ 30న అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ముప్కాల్ మండల కేంద్ర శివారులో దీనికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లలో వరద కాలువ పనులు పూర్తి చేసేలా అగ్రిమెంట్‌తో టెండర్ నిర్వహించి పనులు ప్రారంభించారు. 26 పూర్తి కావొచ్చినా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. తొమ్మిదేళ్లుగా నీటి విడుదల.. 2010లో ట్రయల్ రన్‌తో ప్రారంభమైన వరద కాలువ ద్వారా ఏటా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్న తర్వాత అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. 2010లో 54 టీఎంసీలు, 2011లో 22 టీఎంసీలు, 2012లో 5.5 టీఎంసీల నీటిని, 2013లో 60 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా దిగువ మానేరుకు తరలించారు. 2014లో వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగలేదు. 2015లో ఎస్సారెస్పీ ఎడారిగా మారడంతో నీటి విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. 2016లో 58 టీఎంసీలు, 2017లో 5 టీఎంసీల నీటిని విడుదల చేపట్టారు. 2018లో తాగు నీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా విడుదల చేశారు. రివర్స్ పంపింగ్‌తో.. మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి ఆధారమైంది. దీంతో వరద కాలువకు ప్రాధాన్యత పెరిగింది. కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి ప్రతి రోజు టీఎంసీ చొప్పున నీటిని రివర్స్ పంపింగ్ చేపట్టడానికి మరో కాలువ కానీ, పైపులైన్ కానీ అవసరం లేకుండా వరద కాలువనే వినియోగించుకునేలా అధికారులు డిజైన్ చేశారు. దీంతో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా నీరు చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటి విడుదల చేపట్టడానికి నిర్మించిన వరద కాలువ ‘పునరుజ్జీవనం’తో దిగువ నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ చేపట్టడానికి ఉపయోగపడుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రానప్పుడు ఎస్సారెస్పీకి పునరుజ్జీవం తెచ్చేందుకు గాను వరద కాలువ కీలకంగా మారింది. వరద కాలువ 102 కిలో మీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి వరద కాలువ 74వ, 36వ, 0 కిలోమీటర్ల వద్ద పంప్ హౌస్‌లు నిర్మిస్తున్నారు. వరద కాలువకు గేట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. నిర్మాణ స్వరూపం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 1070 అడుగుల వద్ద ఆరు గేట్లతో హెడ్ రెగ్యూలేటర్ నిర్మించారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా పెద్దవాగు–2, అలాగే కోరుట్ల వరకు 22 వేల క్యూసెక్కుల సామార్థ్యంతో కాలువ తవ్వారు. పెద్దవాగు నుంచి నీటిని దిగువ మానేరు డ్యాంకు సరఫరా చేయడంతో పాటు మధ్య మధ్యలో జలాశయాలు నిర్మించి వాటికి నీటి సరఫరా చేసి సాగు నీరందించేలా వరద కాలువను నిర్మించారు. 22 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కాలువ నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్‌లో 1,074 అడుగుల నీటి మట్టం ఉన్నంత వరకు వరద కాలువకు నీటి విడుదల చేసేలా హెడ్ రెగ్యూలేటర్లు నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన వరద కాలువను వాస్తవానికి ఏడేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ నిర్మాణాని సుమారు 17 ఏళ్లు పట్టింది. చివరకు 2010 జూలై 31వ తేదీన ప్రాజెక్ట్ నుంచి వరద కాలువకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలుత రెండు గేట్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, ట్రయల్ రన్ చేపట్టారు. ఎస్సారెస్పీ నుంచి 122వ కిలో మీటర్ వరకు నీటి విడుదల చేపట్టి వరద కాలువ కరకట్టల నాణ్యతను పరిశీలించారు. అయితే, ఆ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదలు రావడంతో వరద కాలువ ద్వారా ఆ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగింపు వరకు నిరంతరం నీటి విడుదలను కొనసాగించారు. వివాదాలమయం..! మిగులు జలాల తరలింపు కోసమే ఉద్దేశించి న వరద కాలువ కొన్నిసార్లు వివాదాలకు కేం ద్ర బిందువుగా మారింది. పాలకులు, అధికారుల నిర్ణయాల వల్ల కొన్నిసార్లు పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. వాస్తవానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి ఏటా 20 టీఎంసీల నీటిని అందించాలి. ఈ నీటిని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ ద్వారా విడుదల చేయాల్సి ఉంది. అయితే, కాకతీయ ద్వారా కాకుండా మిగులు జలాల కోసం నిర్మించిన వరద కాలువ ద్వారా తరలించడం పలుసార్లు విమర్శలకు తావిచ్చింది. వరదల సమయంలో మాత్రమే ఈ కాలువను వినియోగించాల్సి ఉండగా, మామూలు రోజుల్లోనూ వరద కాలువ ద్వారానే నీటిని విడుదల చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. అలాగే, కేవలం వరద నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ఈ కాలువను సాగు, తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తుండడంతో వరద కాలువ కాస్త వివాదల కాలువగా పేరు గాంచింది. -
పారుతున్నది కాలువ కాదు... సాగర్ నీరు
సాక్షి, తోకపల్లె (పెద్దారవీడు): మండలంలో తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి దేవాలయం పక్కనే ఉన్న సాగర్ ఎయిర్‌వాల్ లీకుతో నీరంతా వృథాగా పోతుంది. ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకం ద్వారా త్రిపురాంతకం మండలం దుపాడు చెరువు నుంచి తోకపల్లె, గొబ్బూరు, దేవరాజుగట్టు మీదుగా పెద్దసైజు నీటి పైపుల ద్వారా మార్కాపురం పట్టణానికి నీరు సరఫరా చేస్తున్నారు. అమరావతి– అనంతపురం జాతీయ రహదారిలోని తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి వద్ద పైపు ఎయిర్ వాల్ లీక్ కావడంతో పొలాల మీదుగా సాగర్ నీరంతా వృథాగా తీగలేరు కాలువలోకి వెళ్తున్నాయి. వేసవి కోసం పొదుపుగా నీటిని వాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎయిర్‌వాల్ లీకేజితో నీరంతా రోజూ కొన్ని వేల లీటర్ల నీరు నేలపావుతోంది. ఎయిర్‌వాల్ లీకేజి గురించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వదిలిన సమయంలో తీగలేరులోకి తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు మాత్రం మరమ్మతులు చేయలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అసలే వేసవి కాలంలో ప్రజలు, పశువులు తాగునీటితో అల్లాడిపోతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘మిషన్’ చెరువుకు బుంగ
ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని మిషన్ కాకతీయ ఊర చెరువుకు బుంగపడడంతో నీరంతా వృథాగా పోతుంది. దీంతో ఆయకట్టు రైతులు గురువారం చెరువుపై ఆందోళనకు దిగారు. చెరువుకు బుంగపడడం ఇది మూడోసారి. చెరువు మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించకపోవడంతోనే తరచూ బుంగలు పడుతున్నాయని రైతులు అన్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ కక్కుర్తితో చెరువు ఖాళీ అయ్యేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. రైతు సమాఖ్యసంఘాల గ్రామ అధ్యక్షుడు అంబాల అయిలయ్య, నగేశ్, రాజమౌళి, సంపత్, రాజయ్య, మల్లేశ్, రమేశ్, రాజు, మహిమెుద్దీన్, కర్రె భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి వస్తున్నారంటూ నీరు వృధా
ప్రజలు తాగు నీరు లేక అల్లాడుతుంటే.. మంత్రి పర్యటన పేరిట అధికారులు ఐదు ట్యాంకర్ల నీరు నేలపాలు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మునిసిపాలిటీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పురపాలక మంత్రి నారాయణ శుక్రవారం గిద్దలూరులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మంత్రి పర్యటించే సమయంలో రోడ్డు పై దుమ్ము పైకి లేవకుండా ఉండాలని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మునిసిపల్ సిబ్బంది ఏకంగా ఐదు ట్యాంకర్ల నీరు రోడ్డు మీద పోశారు. సిబ్బంది చర్యల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్త చేశారు. ప్రజలకు తాగు నీరు లేక ఇబ్బంది పడుతుంటే ఇదేం పని అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
మంత్రులు వస్తున్నారని ..నీళ్లు నేలపాలు
‘ప్రతి నీటి బొట్టూ విలువైనదే ... ప్రాణప్రదంగా చూసుకోవాలి ... సద్వినియోగం చేసుకోవాలి’ తెల్లారిన దగ్గర నుంచి రాత్రి వరకూ ఇటు ప్రజాప్రతినిధులు ... అటు అధికారులు చేస్తున్న హితబోధలివీ... గిద్దలూరు పట్టణంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ పట్టణానికి వచ్చారని నీటిని ట్యాంకర్లతో తెచ్చి రోడ్డుపై వెదజల్లిన వైనం చూసినవారు విస్తుపోయారు. మంత్రి వర్యులు వచ్చిన కార్యక్రమం ఏమిటో తెలుసా ‘సేవ్ వాటర్ – సేవ్ లైఫ్’ కార్యక్రమానికి. ఆయన కారులో రయ్...మన్నప్పుడు దుమ్ము,ధూళి పైకి ఎగరకూడదని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ట్యాంకుల నీటిని ఇలా గాంధీ బొమ్మ సెంటరు నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డుపై విరజిమ్మారు. నీటిని ఇలా వృధా చేస్తున్న సమయంలోనే ఓ వృద్ధుడు నీటి బిందెలను నాలుగు చక్రాల బండిపై పెట్టుకుని నెట్టుకొస్తూ కనిపించగా ‘సాక్షి’ కెమెరా క్లిక్మంది. – గిద్దలూరు