సాక్షి, హైదరాబాద్: వందల కిలో మీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల్లో నిత్యం 150 మిలియన్ గ్యాలన్ల విలువైన తాగునీరు వృథా అవుతుండడం తీరని వ్యథ మిగులుస్తోంది. నిత్యం కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశ, జంట జలాశయాలు, సింగూరు, మంజీరా జలాశయాల నుంచి 593 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించి శుద్ధి చేసి నగరంలోని 12 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. ఇందులో సుమారు 25 శాతం వృథా అవుతోంది.
పురాతన పైపులైన్లకు తరచూ ఏర్పడుతోన్న లీకేజీలు, అక్రమ నల్లాలు, నీటి చౌర్యం ఇందుకు ప్రధాన కారణం. కాగా ఈ నీటితో శివారు ప్రాంతాల్లో 35 లక్షల మంది దాహార్తిని తీర్చే అవకాశం ఉందని తాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీటివృథాను అరికట్టేందుకు నగరంలో 400కు పైగా ఉన్న స్టోరేజి రిజర్వాయర్ల పరిధిలో సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.
వృథాపై పబ్లిక్ నజర్..
తాగునీటి వృథాను అరికట్టే కృషిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టనున్న మొబైల్‌యాప్ దోహదం చేస్తుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు ఈ మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా పైపులైన్ల లీకేజీలు, రిజర్వాయర్ల వద్ద నీటివృథా, అక్రమ నల్లాల ద్వారా జరుగుతోన్న నీటిచౌర్యంపై నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కలి్పంచనున్నారు. అంతేకాదు నీటివృథాపై అప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఫోటో తీసి అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈ సమాచారం క్షణాల్లో ఉన్నతాధికారులతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయడం ద్వారా నీటివృథాకు చెక్‌పెట్టవచ్చని తెలిపారు.
అక్రమ నల్లాలపై సమాచారం అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. కాగా ఔటర్‌పరిధిలోని 190 గ్రామాలు, నగరపాలక సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు తాగునీటిని సరఫరా చేసేందుకు జలమండలి ఓఆర్‌ఆర్ తాగునీటి పథకం ఫేజ్–1,ఫేజ్–2 పథకాలను పూర్తిచేసిన విషయం విదితమే. ఈ పథకం కింద సుమారు ఐదువేల కిలోమీటర్లకు పైగా తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సుమారు 200కు పైగా నూతనంగా తాగునీటి స్టోరేజి రిజర్వాయర్లను నిరి్మంచిన విషయం విదితమే. ప్రస్తుతం జలమండలి ప్రతీ వ్యక్తికి ప్రధాన నగరంలో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 150 లీటర్ల తాగునీటిని అందిస్తుండగా..శివారు ప్రాంతాల్లో సుమారు వంద లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment