వరద కాలువ హెడ్ రెగ్యూలేటర్
సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వృథా గా పోతున్న మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను దిగువ ప్రాంతాలకు తరలించడ మే కాకుండా, అవసరమైన సమయంలో ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోసేందుకూ ఈ కాలువ ఉపయో గపడనుంది.
సుమారు 2.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు జవసత్వాలు కల్పిస్తున్న వరద కాలువ రేపటి (జూన్ 30)తో 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరిన తర్వాత వచ్చే వరదను వచ్చినట్లు గోదావరిలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఉండేది. అలా గోదావరిలో వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గాను చేపట్టినదే వరద కాలువ నిర్మాణం.
ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని 2.20 లక్షల ఎకరాల మెట్ట భూములకు నీరందించేందుకు గాను ఈ వరద కాలువకు రూపకల్పన చేశారు. 1993 జూన్ 30న అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ముప్కాల్ మండల కేంద్ర శివారులో దీనికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లలో వరద కాలువ పనులు పూర్తి చేసేలా అగ్రిమెంట్‌తో టెండర్ నిర్వహించి పనులు ప్రారంభించారు. 26 పూర్తి కావొచ్చినా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి.
తొమ్మిదేళ్లుగా నీటి విడుదల..
2010లో ట్రయల్ రన్‌తో ప్రారంభమైన వరద కాలువ ద్వారా ఏటా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్న తర్వాత అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. 2010లో 54 టీఎంసీలు, 2011లో 22 టీఎంసీలు, 2012లో 5.5 టీఎంసీల నీటిని, 2013లో 60 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా దిగువ మానేరుకు తరలించారు.
2014లో వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగలేదు. 2015లో ఎస్సారెస్పీ ఎడారిగా మారడంతో నీటి విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. 2016లో 58 టీఎంసీలు, 2017లో 5 టీఎంసీల నీటిని విడుదల చేపట్టారు. 2018లో తాగు నీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా విడుదల చేశారు.
రివర్స్ పంపింగ్‌తో..
మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి ఆధారమైంది. దీంతో వరద కాలువకు ప్రాధాన్యత పెరిగింది. కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి ప్రతి రోజు టీఎంసీ చొప్పున నీటిని రివర్స్ పంపింగ్ చేపట్టడానికి మరో కాలువ కానీ, పైపులైన్ కానీ అవసరం లేకుండా వరద కాలువనే వినియోగించుకునేలా అధికారులు డిజైన్ చేశారు. దీంతో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా నీరు చేరుతుంది.
ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటి విడుదల చేపట్టడానికి నిర్మించిన వరద కాలువ ‘పునరుజ్జీవనం’తో దిగువ నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ చేపట్టడానికి ఉపయోగపడుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రానప్పుడు ఎస్సారెస్పీకి పునరుజ్జీవం తెచ్చేందుకు గాను వరద కాలువ కీలకంగా మారింది. వరద కాలువ 102 కిలో మీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి వరద కాలువ 74వ, 36వ, 0 కిలోమీటర్ల వద్ద పంప్ హౌస్‌లు నిర్మిస్తున్నారు. వరద కాలువకు గేట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి.
నిర్మాణ స్వరూపం..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 1070 అడుగుల వద్ద ఆరు గేట్లతో హెడ్ రెగ్యూలేటర్ నిర్మించారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా పెద్దవాగు–2, అలాగే కోరుట్ల వరకు 22 వేల క్యూసెక్కుల సామార్థ్యంతో కాలువ తవ్వారు. పెద్దవాగు నుంచి నీటిని దిగువ మానేరు డ్యాంకు సరఫరా చేయడంతో పాటు మధ్య మధ్యలో జలాశయాలు నిర్మించి వాటికి నీటి సరఫరా చేసి సాగు నీరందించేలా వరద కాలువను నిర్మించారు. 22 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కాలువ నిర్మాణం జరిగింది.
ప్రాజెక్ట్‌లో 1,074 అడుగుల నీటి మట్టం ఉన్నంత వరకు వరద కాలువకు నీటి విడుదల చేసేలా హెడ్ రెగ్యూలేటర్లు నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన వరద కాలువను వాస్తవానికి ఏడేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ నిర్మాణాని సుమారు 17 ఏళ్లు పట్టింది. చివరకు 2010 జూలై 31వ తేదీన ప్రాజెక్ట్ నుంచి వరద కాలువకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలుత రెండు గేట్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, ట్రయల్ రన్ చేపట్టారు.
ఎస్సారెస్పీ నుంచి 122వ కిలో మీటర్ వరకు నీటి విడుదల చేపట్టి వరద కాలువ కరకట్టల నాణ్యతను పరిశీలించారు. అయితే, ఆ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదలు రావడంతో వరద కాలువ ద్వారా ఆ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగింపు వరకు నిరంతరం నీటి విడుదలను కొనసాగించారు.
వివాదాలమయం..!
మిగులు జలాల తరలింపు కోసమే ఉద్దేశించి న వరద కాలువ కొన్నిసార్లు వివాదాలకు కేం ద్ర బిందువుగా మారింది. పాలకులు, అధికారుల నిర్ణయాల వల్ల కొన్నిసార్లు పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. వాస్తవానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి ఏటా 20 టీఎంసీల నీటిని అందించాలి. ఈ నీటిని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ ద్వారా విడుదల చేయాల్సి ఉంది.
అయితే, కాకతీయ ద్వారా కాకుండా మిగులు జలాల కోసం నిర్మించిన వరద కాలువ ద్వారా తరలించడం పలుసార్లు విమర్శలకు తావిచ్చింది. వరదల సమయంలో మాత్రమే ఈ కాలువను వినియోగించాల్సి ఉండగా, మామూలు రోజుల్లోనూ వరద కాలువ ద్వారానే నీటిని విడుదల చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. అలాగే, కేవలం వరద నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ఈ కాలువను సాగు, తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తుండడంతో వరద కాలువ కాస్త వివాదల కాలువగా పేరు గాంచింది.
Comments
Please login to add a commentAdd a comment