surplus water
-
Krishna River Water: బరాబర్ ఆ నీళ్లు మావే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో లభ్యత జలాలన్నీ తమవేనని తెలంగాణ స్పష్టం చేసింది. నిర్ణీత వాటాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కోటా వినియోగం పూర్తయిందని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్ల కింద లభ్యతగా ఉన్న నీటిలోంచి ఏపీ 597.07 టీఎంసీలు, తెలంగాణ 200.23 టీఎంసీల మేర వినియోగం చేసిందని, దీనికి తోడు ఏపీ అదనంగా 20.10 టీఎంసీలు, తెలంగాణ 4.58 టీఎంసీల మేర వినియోగం చేసిందని తెలిపింది. మొత్తంగా ఏపీ 617.17 టీఎంసీ. తెలంగాణ 204.81 టీఎంసీల మేర వినియోగం చేశాయని, అయితే నిర్ణీత వాటాలకన్నా ఏపీ 21.45 టీఎంసీల మేర అధిక వినియోగం చేయగా, తెలంగాణ 102 టీఎంసీల మేర తక్కువ వినియోగం చేసిందని వివరించింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో నిర్ణీత మట్టాలకు ఎగువన ఉన్న జలాల్లో మిగిలే 80 టీఎంసీలు మొత్తంగా తెలంగాణకు దక్కుతాయని తెలిపింది. ఈ దృష్ట్యా రెండు రిజర్వాయర్ల నుంచి ఏపీ మరింత నీటిని వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. వాస్తవానికి సాగర్ కుడి కాల్వ కింద తమ తాగునీటి అవసరాలకు 7 టీఎంసీల మేర అవసరాలు ఉన్నాయని, వీటిని తక్షణమే విడుదల చేయాలని కోరింది. బోర్డు దీనిపై తెలంగాణ సమ్మతి కోరగా.. పై విధంగా స్పందించింది. చదవండి: ఈకాలంలోనూ రాజకీయమా.. చచ: కేటీఆర్ ఆగ్రహం కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం -
తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించండి
సాక్షి, అమరావతి: విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)ల అనుమతి తీసుకోకుండా తెలంగాణ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టుల పనులను ముందుగా పరిశీలించాలని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆ పనులను నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ జారీచేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా ఉల్లంఘించి, పనులు చేస్తోందని అనేకమార్లు బోర్డుకు చేసిన ఫిర్యాదులను గుర్తుచేసింది. కొత్తగా ఆయకట్టుకు నీరందించేందుకు తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేసింది. మరోవైపు.. వాటా నీటిని వాడుకుని.. పాత ఆయకట్టుకు సమర్థవంతంగా నీరు అందించడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రాజెక్టుల పనులను పరిశీలించకుండా.. రాయలసీమ ఎత్తిపోతలను తనిఖీ చేస్తామని.. అందుకు నోడల్ అధికారిని ఏర్పాటుచేయాలని తమను కోరడం సబబుకాదని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి. నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలివీ.. ► అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీల నుంచి అనుమతి తీసుకోకుండా.. విభజన చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా నదీ జలాలను వాడుకోవడానికి తెలంగాణ సర్కార్ కొత్తగా పాలమూరు–రంగారెడ్డి (90 టీఎంసీలు), డిండి (30 టీంఎసీలు), భక్తరామదాస (5.5 టీఎంసీలు), తుమ్మిళ్ల ఎత్తిపోతల (5.44), మిషన్ భగీరథ (23.44) చేపట్టింది. అలాగే, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు, నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యాన్ని 22 నుంచి 25.4, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ పనులు చేపట్టింది. ► అనుమతి లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిసెంబర్ 11, 2020న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి తెలంగాణ సర్కార్‌కు లేఖ రాశారు. అయినా పనులను కొనసాగిస్తూనే ఉంది. ► ఈ నేపథ్యంలో.. నిజాలను నిర్ధారించుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటుచేయాలని బోర్డును కోరాం. దాంతో కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ► రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించడానికి వస్తామని.. అందుకు నోడల్ అధికారిని ఏర్పాటుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి ఈనెల 4న కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఎన్జీటీ కూడా రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలని కృష్ణా బోర్డును ఆదేశించలేదు. కానీ, కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ అమలుచేస్తోందా లేదా అన్నది పరిశీలించకుండా.. రాయలసీమ ఎత్తిపోతలను తనిఖీ చేయడం సమంజసం కాదు. -
మిగులు జలాలపై హక్కు ఏపీదే
సాక్షి, అమరావతి: కృష్ణా నది మిగులు జలాలపై సంపూర్ణ హక్కులు ఆ బేసిన్ (నదీ పరీవాహక ప్రాంతం)లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌వేనని సాగునీటి రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. క్యారీ ఓవర్ జలాల విషయంలో కేంద్ర జల్‌శక్తి శాఖకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సెపె్టంబర్ 17, 2020న ఇచ్చిన నివేదికలో.. రాష్ట్ర విభజనతో కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రం ఏపీనేనని స్పష్టంచేసిన అంశాన్ని వారు ప్రస్తావించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల గేట్లు ఎత్తేసినప్పుడు వరద జలాలు సముద్రంలో కలుస్తున్న రోజుల్లో.. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నీటిని వినియోగించుకున్నా వాటిని లెక్కలోకి తీసుకోకూడదని ఏపీ చేసిన ప్రతిపాదన సహేతుకమైనదేనని స్పష్టంచేస్తున్నారు. ఈ నీటితో బంజరు భూములను సస్యశ్యామలం చేసే అవకాశం ఇరు రాష్ట్రాలకు ఉంటుందంటూ వారు చెబుతున్నారు. ఈ అంశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఒక్క సమావేశానికే పరిమితం.. కానీ, ఈ కమిటీ ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే.. అదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు, కృష్ణా బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించింది. గత 20 ఏళ్లలో దిగువ కృష్ణా బేసిన్లో జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ వచ్చిన వరద ప్రవాహాల వివరాలు.. వినియోగించుకున్న నీటి లెక్కలు చెప్పాలని కోరింది. ఇందుకు సంబంధించిన లెక్కలన్నీ ఏపీ ప్రభుత్వం కమిటీకి అందజేసింది. 2020–21 నీటి సంవత్సరం ప్రారంభమయ్యేలోగా నివేదిక ఇస్తామని సాంకేతిక కమిటీ స్పష్టంచేసింది. కానీ, 2020–21 నీటి సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నా నివేదిక ఇవ్వలేదు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఏకంగా 1,266.91 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయి. ఈ వరద రోజుల్లో ఏపీ ప్రభుత్వం 125.27 టీఎంసీలను మళ్లించకుంటే.. ఆ జలాలు కూడా వృథాగా సముద్రంలో కలిసేవే. ఇదే అంశాన్ని ఈనెల 5న జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. వరద సమయంలో ఏ రాష్ట్రం వినియోగించుకున్నా ఆ నీటిని ఆ రాష్ట్ర కోటాలో కలపకూడదని.. దీనిపై తక్షణమే నిర్ణయాన్ని ప్రకటించాలని బోర్డుకు మరోమారు విజ్ఞప్తి చేసింది. లెక్కలోకి తీసుకోకపోవడమే ఉభయతారకం కృష్ణా మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీకే ఉంటుందని కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్)–1 తేలి్చంది. 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది. ఇందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పును ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం కేడబ్ల్యూడీటీ–1 తీర్పే అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగులు జలాలను ఇరు రాష్ట్రాలు ఎంత వాడుకున్నా వాటిని నికర జలాల కింద లెక్కించకూడదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసిందని.. రెండు రాష్ట్రాలకు ఉభయతారకంగా ఉండేలా కృష్ణా బోర్డుకు ప్రతిపాదన చేసిందని వారు ప్రశంసిస్తున్నారు. కానీ.. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తుండటాన్ని తప్పుపడుతున్నారు. 798 టీఎంసీలు కడలిపాలు 2019–20 నీటి సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 798.297 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయి. ఈ కాలంలో సుమారు 44 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం వాటిని వినియోగించుకోకపోయుంటే ఆ నీరు కూడా కడలిలో కలిసేది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సముద్రంలో వరద జలాలు కలుస్తున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నీటిని వినియోగించుకున్నా వాటిని వాటా జలాల కింద లెక్కించకూడదని అక్టోబర్ 8, 2019న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలో దిశానిర్దేశం చేయాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖను కృష్ణా బోర్డు కోరింది. ఈ అంశంపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ ఐపీవో సీఈ ఎస్‌హెచ్ విజయ్ శరణ్ నేతృత్వంలో అత్యున్నత సాంకేతిక కమిటీని కేంద్ర జల్‌శక్తి శాఖ ఏర్పాటుచేసింది. -
మా ‘మిగులు’ మాకే..
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. గతేడాది వాటర్ ఇయర్లో వినియోగించే హక్కు కలిగి ఉండి కూడా వాడుకోని నీటిని ఈ వాటర్ ఇయర్లో తమకే ఇవ్వాలని కృష్ణాబోర్డును కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్ పరిధిలో గడిచిన వాటర్ ఇయర్లో తెలంగాణ 50 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉండగా, ఆ కోటా అలాగే ఉండిపోయింది. ఈ నీటిని జూన్ 1 నుంచి మొదలైన వాటర్ ఇయర్లో తెలంగాణ కోటా కిందే పరిగణించాలని కోరనుంది. ఏటా వాటర్ ఇయర్ జూన్ నుంచి మే చివరి వరకు ఉంటుంది. జూన్ నుంచి కొత్త వాటర్ ఇయర్ ఆరంభమవుతుంది. జూన్ నుంచి ప్రాజెక్టుల్లో ఉండే నీటి లభ్యత, వచ్చిన ప్రవాహాలు, రాష్ట్రాల అవసరాల మేరకు కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తుంది. గతేడాది 34:66 నిష్పత్తిన రెండు రాష్ట్రాలకు నీటిని పంచింది. ఇందులో ఏపీ తన కోటాకు మించి వినియోగించగా, తెలంగాణకు మాత్రం బోర్డు కేటాయించిన లెక్కల మేరకు మరో 50 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నీరంతా సాగర్‌లోనే ఉంది. సాగర్‌లో ప్రస్తుతం 531 అడుగుల పరిధిలో 170 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన లభ్యత మరో 50 టీఎంసీల మేర ఉంది. ఈ వాటా అంతా తెలంగాణదేనని ఇటీవలే బోర్డు స్పష్టంచేసింది. అయితే మే 31తో వాటర్ ఇయర్ ముగియడం, జూన్ నుంచి కొత్త వాటర్ ఇయర్ ఆరంభం కావడంతో కొత్త వాటాలు తెరపైకి వస్తాయి. దానికి అనుగుణంగానే బోర్డు పంపకాలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది గరిష్ట నీటిని వినియోగించుకోలేకపోవడంతో తన వాటాను ఈ ఏడాది కింద దక్కే వాటాలో కలపాలని తెలంగాణ కోరనుంది. ఈ నెల 4న జరిగే బోర్డు భేటీలో ఈ అంశం కీలకం కానుంది. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల జీవోలన్నీ బయటికి తీయండి : కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో నిర్మించిన అన్ని ప్రాజెక్టుల ప్రభుత్వ ఉత్తర్వులను బయటకు తీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. గోదావరి, కృష్ణాలపై చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు లేవనెత్తడంతో సోమవారం ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లతో సీఎం ప్రగతి భవన్లో సమీక్షించారు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ఇచ్చిన జీవోలను, పనులు పూర్తయిన సంవత్సరాలను సమగ్రంగా ఓ నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. -
‘మిగులు’ పంపకాలపై దృష్టి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లో మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీచేసే అంశంపై కృష్ణా బోర్డు దృష్టి పెట్టింది. మిగులు జలాల అంశాన్ని ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉన్నా, అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య తాత్కాలిక ఒప్పందాన్ని కుదిర్చే చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే జూన్‌లో వాటర్ ఇయర్ ఆరంభానికి ముందే బోర్డు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి, ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుగా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి కేంద్ర జల వనరుల శాఖ ఆమోదం మేరకు వచ్చే వాటర్ ఇయర్లో దాన్ని అమలు చేయనుంది. (చదవండి: అక్రమం.. అడ్డుకోండి: సీఎం కేసీఆర్) ఇప్పుడన్నా బోర్డు తేల్చేనా..? బజావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీ, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటిని ప్రాజెక్టుల వారీగా ఇంత అని నిర్ణయించకపోవడంతో ఆయా రాష్ట్రాలు వాటి సరిహద్దుల్లోని ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారమే 34:66 నిష్పత్తిన తెలంగాణ, ఏపీ నీటిని వాడుకుంటున్నాయి. అయితే 2019–20 వాటర్ ఇయర్లో మొత్తం ఇరు రాష్ట్రాల నికర జలాల వాటా 811 టీఎంసీలకు మించి నీరొచ్చింది. మొత్తం గా 910 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు (ఏపీ–637 టీఎంసీలు, తెలంగాణ–273 టీఎంసీలు) వినియోగించుకోగా, మరో 797 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. ప్రాజెక్టులు నిండి, వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని రాష్ట్రాల వినియోగం కింద చూడరాదని, వరద నీటిని వాడుకుంటే దాన్ని రాష్ట్రాల వినియోగ లెక్కల్లో చూపరాదని ఏపీ గతంలో బోర్డు భేటీల్లో కోరింది. వరద ఉన్న 32 రోజుల్లో తాము 132 టీఎంసీల మేర నీటిని వినియోగించుకోగా, తెలంగాణ సైతం 39 టీఎంసీల మేర వాడుకుందని సైతం ప్రస్తావించింది. అయితే ఏపీ ప్రతిపాదనకు తెలంగాణ అంగీకరించలేదు. మిగులు జలాల అంశాన్ని ట్రిబ్యునల్ తేల్చడం ఆలస్యమవుతున్నందున బోర్డు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని కోరింది. (చదవండి: దుమ్ముగూడెం టెండర్లలో భారీ కుంభకోణం) చేసేది లేక బోర్డు దీనిపై అభిప్రాయాలు తీసుకునేందుకు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో కమిటీని నియమించింది. ఇందులో బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను చెప్పనుంది. ఆయా రాష్ట్రాల ఈఎన్సీలు కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కాన్ఫరెన్స్ అనంతరం బోర్డు తన నివేదికను కేంద్రానికి సమర్పించి, వారి ఆమోదం ప్రకారమే నడుచుకోనుంది. గోదావరి జలాల అంశమూ తెరపైకి.. కొత్తగా తెలంగాణ గోదావరి మిగులు జలాల అంశాన్నీ తెరపైకి తెచ్చింది. గోదా వరిలో తెలంగాణకు 954, ఏపీకి 500 టీఎంసీల మేర వాటాలున్నాయి. ఏటా గోదావరి నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నా, మిగులు జలాలపై మాత్రం గతంలో ట్రిబ్యునల్ కానీ, కేంద్రం కానీ తేల్చలేదు. ఈ వాటర్ ఇయర్‌లోనూ గోదావరిలో 3,788 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసింది. ప్రస్తుతం తెలంగాణ వాటా 954 టీఎంసీల మేరకు నీటి వినియోగం చేసేలా ప్రాజెక్టులు పూర్తయినందున, అంతకుమించి నీటిని తీసుకునేలా మిగులు జలాల వాటాను తెరపైకి తెచ్చింది. కనీసంగా 600 టీఎంసీల వాటా దక్కించుకునేలా ప్రణాళిక రచిస్తోంది. దీనిపైనా గోదావరి బోర్డుకు లేఖ రాయాలని, అటు నుంచి వచ్చే అభిప్రాయాల మేరకు కేంద్రం వద్ద పోరాడాలని భావిస్తోంది. -
‘వరద’కు ఇరవై ఆరేళ్లు
సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వృథా గా పోతున్న మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను దిగువ ప్రాంతాలకు తరలించడ మే కాకుండా, అవసరమైన సమయంలో ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోసేందుకూ ఈ కాలువ ఉపయో గపడనుంది. సుమారు 2.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు జవసత్వాలు కల్పిస్తున్న వరద కాలువ రేపటి (జూన్ 30)తో 26వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరిన తర్వాత వచ్చే వరదను వచ్చినట్లు గోదావరిలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఉండేది. అలా గోదావరిలో వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గాను చేపట్టినదే వరద కాలువ నిర్మాణం. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని 2.20 లక్షల ఎకరాల మెట్ట భూములకు నీరందించేందుకు గాను ఈ వరద కాలువకు రూపకల్పన చేశారు. 1993 జూన్ 30న అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ముప్కాల్ మండల కేంద్ర శివారులో దీనికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లలో వరద కాలువ పనులు పూర్తి చేసేలా అగ్రిమెంట్‌తో టెండర్ నిర్వహించి పనులు ప్రారంభించారు. 26 పూర్తి కావొచ్చినా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. తొమ్మిదేళ్లుగా నీటి విడుదల.. 2010లో ట్రయల్ రన్‌తో ప్రారంభమైన వరద కాలువ ద్వారా ఏటా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్న తర్వాత అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. 2010లో 54 టీఎంసీలు, 2011లో 22 టీఎంసీలు, 2012లో 5.5 టీఎంసీల నీటిని, 2013లో 60 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా దిగువ మానేరుకు తరలించారు. 2014లో వరద కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగలేదు. 2015లో ఎస్సారెస్పీ ఎడారిగా మారడంతో నీటి విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. 2016లో 58 టీఎంసీలు, 2017లో 5 టీఎంసీల నీటిని విడుదల చేపట్టారు. 2018లో తాగు నీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా విడుదల చేశారు. రివర్స్ పంపింగ్‌తో.. మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మించిన వరద కాలువ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి ఆధారమైంది. దీంతో వరద కాలువకు ప్రాధాన్యత పెరిగింది. కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి ప్రతి రోజు టీఎంసీ చొప్పున నీటిని రివర్స్ పంపింగ్ చేపట్టడానికి మరో కాలువ కానీ, పైపులైన్ కానీ అవసరం లేకుండా వరద కాలువనే వినియోగించుకునేలా అధికారులు డిజైన్ చేశారు. దీంతో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా నీరు చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటి విడుదల చేపట్టడానికి నిర్మించిన వరద కాలువ ‘పునరుజ్జీవనం’తో దిగువ నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ చేపట్టడానికి ఉపయోగపడుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రానప్పుడు ఎస్సారెస్పీకి పునరుజ్జీవం తెచ్చేందుకు గాను వరద కాలువ కీలకంగా మారింది. వరద కాలువ 102 కిలో మీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి వరద కాలువ 74వ, 36వ, 0 కిలోమీటర్ల వద్ద పంప్ హౌస్‌లు నిర్మిస్తున్నారు. వరద కాలువకు గేట్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. నిర్మాణ స్వరూపం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 1070 అడుగుల వద్ద ఆరు గేట్లతో హెడ్ రెగ్యూలేటర్ నిర్మించారు. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా పెద్దవాగు–2, అలాగే కోరుట్ల వరకు 22 వేల క్యూసెక్కుల సామార్థ్యంతో కాలువ తవ్వారు. పెద్దవాగు నుంచి నీటిని దిగువ మానేరు డ్యాంకు సరఫరా చేయడంతో పాటు మధ్య మధ్యలో జలాశయాలు నిర్మించి వాటికి నీటి సరఫరా చేసి సాగు నీరందించేలా వరద కాలువను నిర్మించారు. 22 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కాలువ నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్‌లో 1,074 అడుగుల నీటి మట్టం ఉన్నంత వరకు వరద కాలువకు నీటి విడుదల చేసేలా హెడ్ రెగ్యూలేటర్లు నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన వరద కాలువను వాస్తవానికి ఏడేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ నిర్మాణాని సుమారు 17 ఏళ్లు పట్టింది. చివరకు 2010 జూలై 31వ తేదీన ప్రాజెక్ట్ నుంచి వరద కాలువకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలుత రెండు గేట్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, ట్రయల్ రన్ చేపట్టారు. ఎస్సారెస్పీ నుంచి 122వ కిలో మీటర్ వరకు నీటి విడుదల చేపట్టి వరద కాలువ కరకట్టల నాణ్యతను పరిశీలించారు. అయితే, ఆ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదలు రావడంతో వరద కాలువ ద్వారా ఆ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగింపు వరకు నిరంతరం నీటి విడుదలను కొనసాగించారు. వివాదాలమయం..! మిగులు జలాల తరలింపు కోసమే ఉద్దేశించి న వరద కాలువ కొన్నిసార్లు వివాదాలకు కేం ద్ర బిందువుగా మారింది. పాలకులు, అధికారుల నిర్ణయాల వల్ల కొన్నిసార్లు పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. వాస్తవానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి ఏటా 20 టీఎంసీల నీటిని అందించాలి. ఈ నీటిని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ ద్వారా విడుదల చేయాల్సి ఉంది. అయితే, కాకతీయ ద్వారా కాకుండా మిగులు జలాల కోసం నిర్మించిన వరద కాలువ ద్వారా తరలించడం పలుసార్లు విమర్శలకు తావిచ్చింది. వరదల సమయంలో మాత్రమే ఈ కాలువను వినియోగించాల్సి ఉండగా, మామూలు రోజుల్లోనూ వరద కాలువ ద్వారానే నీటిని విడుదల చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. అలాగే, కేవలం వరద నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ఈ కాలువను సాగు, తాగునీటి సరఫరా కోసం వినియోగిస్తుండడంతో వరద కాలువ కాస్త వివాదల కాలువగా పేరు గాంచింది. -
మిగులు జలాల సాధనకు పోరాడుదాం
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: ‘ప్రభుత్వ అసమర్థత వల్లే కృష్ణా మిగులు జలాలను కోల్పోయాం. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో కృష్ణా మిగులు జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ తీర్పు అమలైతే భవిష్యత్తులో జిల్లా ఎడారిగా మారుతుంది. మిగులు జలాల సాధనకు పోరాడాల్సిన అవసరం ఉంది’’ అని సీపీఎం శాసనసభా పక్ష నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా మిగులు జలాల వినియోగంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించాలని, లేనిపక్షంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పిల్లర్ పార్క్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జూలకంటి మాట్లాడుతూ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కృష్ణా మిగులు జలాలపై ఆధారపడి కట్టిన ఎనిమిది ప్రాజెక్టులు వృథాగా మారే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు బ్రిజేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పులో నూతనంగా నిర్మాణమవుతున్న ఏ ప్రాజెక్టు కూడా నీటి కేటాయింపు జరగలేదన్నారు. మిగులు జలాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ ఇవ్వడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తీర్పును ప్రభుత్వ గెజిట్‌లో ముద్రించకముందే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు ట్రిబ్యునల్ మరోసారి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవడానికి అనుమతించినందునా భవిష్యత్‌లో కృష్ణా జలాలు మన రాష్ట్రానికి సకాలంలో రావన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం తాగు, సాగునీరు కోనం ఏర్పాటు చేసిన ఎల్ఎల్బీసీ, ఏఎమ్మార్పీ, ఉదయ సముద్రానికి నీటి కేటాయింపు చేయకపోవడం శోచనీయమన్నారు. జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బండా శ్రీశైలం, నాయకులు ముల్కలపల్లి రాములు, హాషం, డబ్బికార్ మల్లేశ్, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కత్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి పద్మ, అవుట సైదులు, కొండేటి శ్రీను, బషీర్, షేర్ల బాలు, చందులాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.