మిగులు జలాలపై హక్కు ఏపీదే | Right to surplus waters belongs to AP | Sakshi
Sakshi News home page

మిగులు జలాలపై హక్కు ఏపీదే

Published Wed, Feb 17 2021 4:37 AM | Last Updated on Wed, Feb 17 2021 4:37 AM

Right to surplus waters belongs to AP - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నది మిగులు జలాలపై సంపూర్ణ హక్కులు ఆ బేసిన్‌ (నదీ పరీవాహక ప్రాంతం)లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌వేనని సాగునీటి రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. క్యారీ ఓవర్‌ జలాల విషయంలో కేంద్ర జల్‌శక్తి శాఖకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సెపె్టంబర్‌ 17, 2020న ఇచ్చిన నివేదికలో.. రాష్ట్ర విభజనతో కృష్ణా బేసిన్‌లో దిగువ రాష్ట్రం ఏపీనేనని స్పష్టంచేసిన అంశాన్ని వారు ప్రస్తావించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల గేట్లు ఎత్తేసినప్పుడు వరద జలాలు సముద్రంలో కలుస్తున్న రోజుల్లో.. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నీటిని వినియోగించుకున్నా వాటిని లెక్కలోకి తీసుకోకూడదని ఏపీ చేసిన ప్రతిపాదన సహేతుకమైనదేనని స్పష్టంచేస్తున్నారు. ఈ నీటితో బంజరు భూములను సస్యశ్యామలం చేసే అవకాశం ఇరు రాష్ట్రాలకు ఉంటుందంటూ వారు చెబుతున్నారు. ఈ అంశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.  

ఒక్క సమావేశానికే పరిమితం.. 
కానీ, ఈ కమిటీ ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే.. అదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు, కృష్ణా బోర్డు అధికారులతో సమావేశం నిర్వహించింది. గత 20 ఏళ్లలో దిగువ కృష్ణా బేసిన్‌లో జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ వచ్చిన వరద ప్రవాహాల వివరాలు.. వినియోగించుకున్న నీటి లెక్కలు చెప్పాలని కోరింది. ఇందుకు సంబంధించిన లెక్కలన్నీ ఏపీ ప్రభుత్వం కమిటీకి అందజేసింది. 2020–21 నీటి సంవత్సరం ప్రారంభమయ్యేలోగా నివేదిక ఇస్తామని సాంకేతిక కమిటీ స్పష్టంచేసింది. కానీ, 2020–21 నీటి సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నా నివేదిక ఇవ్వలేదు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఏకంగా 1,266.91 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయి. ఈ వరద రోజుల్లో ఏపీ ప్రభుత్వం 125.27 టీఎంసీలను మళ్లించకుంటే.. ఆ జలాలు కూడా వృథాగా సముద్రంలో కలిసేవే. ఇదే అంశాన్ని ఈనెల 5న జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. వరద సమయంలో ఏ రాష్ట్రం వినియోగించుకున్నా ఆ నీటిని ఆ రాష్ట్ర కోటాలో కలపకూడదని.. దీనిపై తక్షణమే నిర్ణయాన్ని ప్రకటించాలని బోర్డుకు మరోమారు విజ్ఞప్తి చేసింది.

లెక్కలోకి తీసుకోకపోవడమే ఉభయతారకం 
కృష్ణా మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీకే ఉంటుందని కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌)–1 తేలి్చంది. 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది. ఇందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పును ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ప్రస్తుతం కేడబ్ల్యూడీటీ–1 తీర్పే అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగులు జలాలను ఇరు రాష్ట్రాలు ఎంత వాడుకున్నా వాటిని నికర జలాల కింద లెక్కించకూడదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసిందని.. రెండు రాష్ట్రాలకు ఉభయతారకంగా ఉండేలా కృష్ణా బోర్డుకు ప్రతిపాదన చేసిందని వారు ప్రశంసిస్తున్నారు. కానీ.. దీన్ని తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకిస్తుండటాన్ని తప్పుపడుతున్నారు.   

798 టీఎంసీలు కడలిపాలు 
2019–20 నీటి సంవత్సరంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 798.297 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయి. ఈ కాలంలో సుమారు 44 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం వాటిని వినియోగించుకోకపోయుంటే ఆ నీరు కూడా కడలిలో కలిసేది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సముద్రంలో వరద జలాలు కలుస్తున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నీటిని వినియోగించుకున్నా వాటిని వాటా జలాల కింద లెక్కించకూడదని అక్టోబర్‌ 8, 2019న కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలో దిశానిర్దేశం చేయాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖను కృష్ణా బోర్డు కోరింది. ఈ అంశంపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ ఐపీవో సీఈ ఎస్‌హెచ్‌ విజయ్‌ శరణ్‌ నేతృత్వంలో అత్యున్నత సాంకేతిక కమిటీని కేంద్ర జల్‌శక్తి శాఖ ఏర్పాటుచేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement