సాక్షి, అమరావతి: విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)ల అనుమతి తీసుకోకుండా తెలంగాణ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టుల పనులను ముందుగా పరిశీలించాలని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆ పనులను నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ జారీచేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా ఉల్లంఘించి, పనులు చేస్తోందని అనేకమార్లు బోర్డుకు చేసిన ఫిర్యాదులను గుర్తుచేసింది. కొత్తగా ఆయకట్టుకు నీరందించేందుకు తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని స్పష్టంచేసింది. మరోవైపు.. వాటా నీటిని వాడుకుని.. పాత ఆయకట్టుకు సమర్థవంతంగా నీరు అందించడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రాజెక్టుల పనులను పరిశీలించకుండా.. రాయలసీమ ఎత్తిపోతలను తనిఖీ చేస్తామని.. అందుకు నోడల్ అధికారిని ఏర్పాటుచేయాలని తమను కోరడం సబబుకాదని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఏపీ ఇంజనీర్–ఇన్–చీఫ్ సి. నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలివీ..
► అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీల నుంచి అనుమతి తీసుకోకుండా.. విభజన చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా నదీ జలాలను వాడుకోవడానికి తెలంగాణ సర్కార్ కొత్తగా పాలమూరు–రంగారెడ్డి (90 టీఎంసీలు), డిండి (30 టీంఎసీలు), భక్తరామదాస (5.5 టీఎంసీలు), తుమ్మిళ్ల ఎత్తిపోతల (5.44), మిషన్ భగీరథ (23.44) చేపట్టింది. అలాగే, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు, నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యాన్ని 22 నుంచి 25.4, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ పనులు చేపట్టింది.
► అనుమతి లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిసెంబర్ 11, 2020న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి తెలంగాణ సర్కార్‌కు లేఖ రాశారు. అయినా పనులను కొనసాగిస్తూనే ఉంది.
► ఈ నేపథ్యంలో.. నిజాలను నిర్ధారించుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటుచేయాలని బోర్డును కోరాం. దాంతో కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీ ఏర్పాటైంది.
► రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించడానికి వస్తామని.. అందుకు నోడల్ అధికారిని ఏర్పాటుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి ఈనెల 4న కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఎన్జీటీ కూడా రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలని కృష్ణా బోర్డును ఆదేశించలేదు. కానీ, కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ అమలుచేస్తోందా లేదా అన్నది పరిశీలించకుండా.. రాయలసీమ ఎత్తిపోతలను తనిఖీ చేయడం సమంజసం కాదు.
తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించండి
Published Tue, Mar 16 2021 3:55 AM | Last Updated on Tue, Mar 16 2021 3:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment