
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో లభ్యత జలాలన్నీ తమవేనని తెలంగాణ స్పష్టం చేసింది. నిర్ణీత వాటాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కోటా వినియోగం పూర్తయిందని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్‌ల కింద లభ్యతగా ఉన్న నీటిలోంచి ఏపీ 597.07 టీఎంసీలు, తెలంగాణ 200.23 టీఎంసీల మేర వినియోగం చేసిందని, దీనికి తోడు ఏపీ అదనంగా 20.10 టీఎంసీలు, తెలంగాణ 4.58 టీఎంసీల మేర వినియోగం చేసిందని తెలిపింది.
మొత్తంగా ఏపీ 617.17 టీఎంసీ. తెలంగాణ 204.81 టీఎంసీల మేర వినియోగం చేశాయని, అయితే నిర్ణీత వాటాలకన్నా ఏపీ 21.45 టీఎంసీల మేర అధిక వినియోగం చేయగా, తెలంగాణ 102 టీఎంసీల మేర తక్కువ వినియోగం చేసిందని వివరించింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో నిర్ణీత మట్టాలకు ఎగువన ఉన్న జలాల్లో మిగిలే 80 టీఎంసీలు మొత్తంగా తెలంగాణకు దక్కుతాయని తెలిపింది. ఈ దృష్ట్యా రెండు రిజర్వాయర్ల నుంచి ఏపీ మరింత నీటిని వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. వాస్తవానికి సాగర్ కుడి కాల్వ కింద తమ తాగునీటి అవసరాలకు 7 టీఎంసీల మేర అవసరాలు ఉన్నాయని, వీటిని తక్షణమే విడుదల చేయాలని కోరింది. బోర్డు దీనిపై తెలంగాణ సమ్మతి కోరగా.. పై విధంగా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment