పశ్చిమ కనుమల్లో వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో పెరిగిన వరద
మరో రెండు రోజుల్లో ఆల్మట్టి గేట్లు ఎత్తివేత ఖాయం
తుంగభద్రకి సైతం పెరిగిన వరద ప్రవాహం
ఎగువన వర్షాలతో కృష్ణా పరీవాహకంలో ఆశాజనక పరిస్థితులు
సాగర్ నుంచి 5 టీఎంసీలను కోరిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఆశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 84,645 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 81.44 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ఆపరేషన్ ప్రొటోకాల్ ప్రకారం వరద ముప్పును నివారించేందుకు నిల్వలు గరిష్ట స్థాయికి చేరకముందే గేట్లను ఎత్తి వరదను దిగువన విడుదల చేస్తారు.
గతేడాది జూలై 27న నిల్వ 93.28 టీఎంసీలకు చేరిన వెంటనే ఆల్మట్టి డ్యామ్ గేట్లను పైకి ఎత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిల్వలు 105 టీఎంసీలకు చేరే లోపే గేట్లను ఎత్తే అవకాశముంది. వర్షాలు, వరదలు కొనసాగితే మరో రెండు రోజుల్లోగా ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను దిగువన విడుదల చేసే అవకాశముంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ డ్మామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.06 టీఎంసీల నిల్వలున్నాయి.
ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తిన ఒకటి రెండు రోజుల్లోనే నారాయణపూర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను విడుదల చేయనున్నారు. దీంతో తెలంగాణ భూభాగంలోని జూరాల జలాశయానికి వరద చేరుకోనుండగా, వెంటనే గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీళ్లను విడుదల చేయనున్నారు. జూరాల జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.72 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నెల 15 లేదా 16వ తేదీలోగా శ్రీశైలం జలాశయానికి వరదనీరు చేరుకోవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తుంగభద్రకు పెరిగిన వరద ప్రవాహం
కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్‌లోనూ వర్షాలు కురుస్తుడడంతో తుంగభద్రలో వరద ప్రవాహం మరింత పెరిగింది. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం బుధవారం ఉదయం 35వేల క్యూసెక్కులకు పెరిగి సాయంత్రానికి 27,544 క్యూసెక్కులకు తగ్గింది.
జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 100.86టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.17 టీఎంసీల నిల్వలున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే మరో వారం రోజుల్లో తుంగభద్ర గేట్లను ఎత్తే అవకాశముంది. అప్పుడు తుంగభద్ర జలాలు కూడా సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి.
సాగర్ నుంచి 5 టీఎంసీల విడుదలకు అనుమతించండి: ఏపీ విజ్ఞప్తి
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వ ద్వారా 5 టీఎంసీల నీళ్లను విడుదల చేసేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా నదియాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 15 నుంచి రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు నీళ్లను కుడి ప్రధాన కాల్వ రెగ్యులేటర్ ద్వారా విడుదల చేసుకుంటామని, పర్యవేక్షణ కోసం కృష్ణా బోర్డు సిబ్బందిని పంపించాలని కోరింది.
నీటి విడుదలకు అనుమతివ్వాలని సీఆర్‌పీఎఫ్ బలగాలను సైతం కోరాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఈ నెల 8న కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చే వేసవి నిల్వ ట్యాంకుల్లో నీటిమట్టం పడిపోయిందని, అందుకే నీటి విడుదల చేసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment