నారాయణపూర్ డ్యామ్
9 గేట్లు ఎత్తి దిగువకు 37,260 క్యూసెక్కుల నీటి విడుదల
నాలుగైదు రోజుల్లో శ్రీశైలానికి వరదనీరు చేరే అవకాశం
ఆల్మట్టిలోకి నిలకడగా వరద ప్రవాహం
తుంగభద్రలో పెరిగిన వరద
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది వరద ఉధృతికి కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్‌లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆ రాష్ట్ర అధికారులు బుధవారం డ్యామ్ గేట్లు 9 ఎత్తి దిగువకు 37,260 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తూ వస్తోంది. జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ ఇప్పటికే 7.66 టీఎంసీలు ఉన్న నేపథ్యంలో..ఒక్క రోజులోనే ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ఆ తర్వాత జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటికి విడుదల చేస్తారు.
ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద చేరే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయ, ఉపనదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 92,836 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 65 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
ఆ జలాలు నారాయణపూర్ డ్యామ్‌లోకి చేరుతున్నాయి. కృష్ణా ప్రధానపాయలో వరద మరో నాలుగైదు రోజులు ఇదే రీతిలో కొనసాగే అవకాశముందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 49,522 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 39.72 మీటర్లకు చేరుకుంది.
సాగర్ కుడి కాలువకు నీటి విడుదల
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ 4.5 టీఎంసీలు.. తెలంగాణకు 5.414 టీఎంసీల నీటిని కేటాయిస్తూ మంగళవారం కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాగర్‌లో నీటిమట్టం కనీస స్థాయికి దిగువన ఉన్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 5.705 టీఎంసీలను విడుదల చేయాలని ఆదేశించింది.
దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా ఏపీ 15,800, ఎడమ కేంద్రం ద్వారా తెలంగాణ 6,357 వెరసి 22,157 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో నీటినిల్వ 33.24 టీఎంసీలకు తగ్గింది. సాగర్‌లోకి 21,481 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 122.69 టీఎంసీలకు చేరుకుంది. తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు బుధవారం 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
వరద గోదావరి
భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 21 అడుగులకు చేరే అవకాశం
భద్రాచలం అర్బన్: గోదావరి నిండుకుండను తలపిస్తోంది. భద్రాచలం వద్ద ఈ నెల 13వ తేదీ నుంచి 13 అడుగుల మేర నీటిమట్టం నిలకడగా ఉంది. రెండు,మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతుండడంతో మంగళవారం రాత్రి 14.5 అడుగులకు చేరింది.
ఆపై అంతకంతకూ పెరుగుతూ బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా 18.1 అడుగులకు చేరుకుంది. కాగా, బుధవారం రాత్రి మరో మూడు అడుగుల మేర పెరిగి 21 అడుగులకు చేరే అవకాశముందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు నదిలోకి దిగొద్దని హెచ్చరిస్తున్నారు.
‘తాలిపేరు’కు పోటెత్తుతున్న వరద
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండ లంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిలాల్లో కురు స్తున్న భారీ వర్షాలతో బుధవారం ఉదయం ప్రాజెక్టు 25 గేట్లలో 12 గేట్లు అడుగు మేర ఎత్తి 16,698 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
అయినా వరద ఉధృతి ఆగ లేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు 22 గేట్లు అడుగు మేర ఎత్తి ద్వారా 63 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి వరద మరింతగా పెరగగా, 20 గేట్లను రెండేసి అడుగుల మేర, మిగతా ఐదు గేట్లను పూర్తిగా ఎత్తి 70,750 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment