ఇప్పటివరకు శ్రీశైలం జలాశయానికి 1,139 టీఎంసీల వరదనీరు
రెండు నెలల్లో 858 టీఎంసీల నీరు గేట్ల ద్వారా కిందకు విడుదల
పదిరోజుల్లోనే డెడ్‌స్టోరేజీ నుంచి పూర్తినిల్వ సామర్థ్యానికి చేరుకున్న వైనం
ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన అధికారులు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్‌లో కృష్ణానదిలో రికార్డుస్థాయిలో వరద పోటెత్తింది. గడిచిన 50 రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన తుంగభద్ర, కృష్ణానదిలో పెరిగిన నీటి ప్రవాహంతో కేవ లం పదిరోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ఇప్పటివరకు 1,139 టీఎంసీల నీ రు శ్రీశైలం జలాశయానికి చేరింది.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేయడంతో గత 50 రోజుల్లో 558 టీఎంసీల నీరు దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. గత రెండేళ్లలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి కూడా చేరుకోలేదు. ఈ సారి కృష్ణానదిలో భారీ స్థాయిలో వచ్చి న వరదలకు జూలై చివరకల్లా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకుంది.
పది రోజుల్లోనే నిండిన ప్రాజెక్టు
కృష్ణమ్మ పరవళ్లతో ఈసారి కేవలం పదిరోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ నుంచి ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేసే వరకు చేరింది. జూలై నెల ప్రారంభంలో నీరు లేక వెలవెలబోయిన ప్రాజెక్టు చివరికల్లా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు జూలై 20 నాటికి కేవలం 35.629 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.
గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు జలాశయంలో నీటినిల్వ 812.30 అడుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే తుంగభద్ర నదితో పాటు కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరగడంతో అనూహ్యంగా పదిరోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. తొమ్మిది రోజుల్లోనే 179 టీఎంసీల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరింది. దీంతో జూలై 30న అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు.
ఆగస్టు, సెపె్టంబర్‌లోనూ నిత్యం 1.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం కొనసాగడంతో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా నీటిని కిందకు వదిలారు. ఆగస్టు నెలలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సుమారు 20 రోజుల పాటు ప్రాజెక్టు పదిగేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.
పవర్‌హౌస్‌లో 17 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి
శ్రీశైలం ఎడమ గట్టున ఉన్న తెలంగాణ భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి నిత్యం 37 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా రోజుకు 17 నుంచి 18 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి మొత్తం 152.74 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు కాగా, ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గత జూలై 16 నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగా, నిత్యం 35 వేల క్యూసెక్కులకు పైగా నీటితో గరిష్ట స్థాయిలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment