కృష్ణా వరద తాకిడికి కూలిన కాంక్రీట్ రిటైనింగ్ వాల్
క్షణాల్లో 42 అడుగులు మునిగిన ఇన్‌టేక్ వెల్
కూలీలు షిఫ్టు మారే సమయంలో ఘటన.. లేదంటే భారీగా ప్రాణనష్టం
వారం రోజులైనా బయటకు పొక్కనీయని అధికారులు
సాక్షి, హైదరబాద్ /పెద్దవూర : సుంకిశాల వద్ద నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నీటమునిగింది. సొరంగంలోకి నీరు రాకుండా రక్షణగా నిర్మించిన కాంక్రీట్ రిటైనింగ్‌వాల్ ఒక్క సారిగా కుప్పకూలడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టు మారే సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన ఈనెల ఒకటో తేదీన ఉదయం 6.30 గంటలకు జరిగినా అధికారులు బయటకు పొక్కనీయలేదు.
కృష్ణానదికి వరద వస్తుందని అంచనా వేయకపోవడంతోనే...
డెడ్ స్టోరేజీలో ఉన్న నాగార్జునసాగర్ జలాశయంలోకి వరద నీరు ఇప్పట్లో రాదనే ఆలోచనతోనే రెండోదశ సొరంగం పూర్తిస్థాయిలో ఓపెన్ చేసి పనులు చేపట్టినట్టు తెలిసింది. ఇంజినీర్ల అంచనాలోపంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. సాగర్ జలాశయానికి లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరు తున్న ఈ సమయంలో సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్ చేయకుండా ఉండాల్సిందని నిపుణులు పేర్కొంటున్నారు.
సొరంగంలోకి నీరు రాకుండా ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్, సొరంగంలో చేప డుతున్న బ్లాస్టింగ్‌కు దెబ్బతినడంతో పగుళ్లు వచ్చి వరద తాకిడికి ఒక్కసారిగా కూలిపోయిందంటు న్నారు. మరోవైపు రెండోదశ టన్నెల్‌లో రక్షణ గోడ వెనుక గేటు అమర్చిన అధికారులు పంప్‌హౌస్ స్లాబ్ పూర్తయిన తర్వాత దాని నుంచి గేటుకు టైబీమ్స్ నిర్మించాల్సి ఉందని, ఆ పనులు పూర్త యిన తర్వాత సొరంగాన్ని ఓపెన్ చేస్తే ఈ ప్రమా దం జరిగేది కాదని మరికొందరు అంటున్నారు.
ఘటనపై గోప్యత ఎందుకు?
ఘటన జరిగి వారంరోజులు గడిచినా విషయం బయటకు పొక్కకుండా అధికారులు ఎందుకు గోప్యత పాటించారనే ప్రశ్న తలెత్తుతోంది. మూడు షిఫ్టుల వారీగా కూలీలచే పనులు చేయించాల్సి ఉన్నా, రెండు షిఫ్టుల్లోనే పనులు చేపడుతున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఒక షిఫ్టు, సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు మరో షిఫ్టు చేయిస్తున్నారు.
షిఫ్టు మారే సమయంలో కూలీలు అంతా బయటకు వెళుతున్న వేళ నీటి ఉధృతికి రక్షణ గోడ కూలిపోయి, గేట్లు అమర్చేందుకు సుమారు 40 అడుగులకుపైగా ఎత్తులో చేపట్టిన నిర్మాణం అంతా కూలిపోయింది. దీంతో మరో షిఫ్టులో పనికి రావాల్సిన కూలీలు ఇది చూస్తూ భయంతో కేకలు వేసినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
పనుల నాణ్యతపై అనుమానాలు
పనులు పూర్తికాకముందే కాంక్రీట్ పిల్లర్లతో కూడిన నిర్మాణం పేకమేడలా కూలిపోయింది. అదే నిర్మాణం పూర్తయి మోటార్లు బిగించిన తర్వాత కూలిపోతే రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. జలాశయ నీటిమట్టం 450 అడుగుల లోతుకు సమాన లోతులో తీసిన బావిచుట్టూ పెద్దరాయి ఉంది. నిర్మాణం చేసే సమయంలో కింది నుంచి పక్కనున్న రాయికి రంధ్రాలు చేసి కడ్డీలతో పిల్లర్లను జాయింట్ చేస్తూ నిర్మిస్తున్నారు. అయినా పనుల్లో నాణ్యత లేకపోవడంతోనే అంత ఎత్తులో ఉన్న నిర్మాణం వరద తాకిడికి కుప్పకూలిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వారమైతే పనులు పూర్తయ్యేవి : ప్రాజెక్టు మేనేజర్
వారం రోజులైతే పనులు పూర్తయ్యేవని ప్రాజెక్టు మేనేజర్ నర్సిరెడ్డి తెలిపారు. జలాశయంలో నాలుగైదు మీటర్ల లోతు నీటిమట్టం తగ్గగానే రక్షణగోడ నిర్మించి పంప్‌హౌస్‌లో చేరిన నీటిని తొలగించే పనులు చేపడతామని చెప్పారు.
విచారణకు కమిటీ ఏర్పాటు
రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జలమండలిస్థాయిలో ఉన్నత ఇంజినీర్లతో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారు. కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీ ప్రాజెక్టు ఉద్దేశం..
నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీలో ఉన్నా జంట నగరాలకు భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు 2022 మే 14వ తేదీన నాటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు శంకుస్థాపన చేశారు.
నగర విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2035 నాటికి 47.71 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065నాటికి 67.71 టీఎంసీలు, సరిగ్గా 50 ఏళ్ల నాటికి 2072లో 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనాతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్‌ను ఎమర్జెన్సీ పంపింగ్ అనే సమస్య లేకుండా నిర్మిస్తున్నారు..
సుంకిశాల పాపం బీఆర్‌ఎస్‌దే: భట్టి విక్రమార్క
‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంసహా కృష్ణా ప్రాజెక్టును వదల్లేదు. మేడిగడ్డ మాదిరే సుంకిశాలను మార్చేసింది. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గురువారం మింట్ కాంపౌండ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది.
జూలై 2023న టన్నెల్ సైడ్‌వాల్ పూర్తి చేసింది. ఇప్పటివరకు కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకం అని అనుకున్నాం. మిగిలినవి బాగా ఉన్నాయని భావించాం. తీరా సుంకిశాలను చూస్తే అన్నీ నాసిరకమైనవేనని అర్థమైంది. వారు గోదావరిని మాత్రమే కాదు కృష్ణాను కూడా వదిలిపెట్టలేదు. సుంకిశాల పాపం పూర్తిగా నాటి బీఆర్‌ఎస్‌దే. సైడ్ వాల్ కూలిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. దోషులు ఎవరో త్వరలోనే తేలుస్తాం’ అని డిప్యూటీ సీఎం అన్నారు.
సుంకిశాల అవసరం లేదని ఆనాడే కేటీఆర్‌కు చెప్పా : గుత్తా
హైదరాబాద్ జంట నగరాలకు నీరిచ్చేందుకు చేపట్టిన 1.5 టీఎంసీ సామర్థ్యం కలిగిన సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదని తాను ఆనాడే అనధికారికంగా కేటీఆర్‌కు చెప్పానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment