అనుమతుల్లేని ప్రాజెక్టులే ఎజెండా | Krishna Board ready to end water disputes | Sakshi
Sakshi News home page

అనుమతుల్లేని ప్రాజెక్టులే ఎజెండా

Published Wed, May 10 2023 3:57 AM | Last Updated on Wed, May 10 2023 3:57 AM

Krishna Board ready to end water disputes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదిపై రెండు రాష్ట్రాలు అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించి.. జల వివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. అనుమతి లేని ప్రాజెక్టులే ప్రధాన అజెండాగా హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ అధ్యక్షతన 17వ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలతోపాటు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు, బడ్జెట్, 2023–24 నీటి సంవత్సరంలో నీటి పంపిణీతో సహా 21 అంశాలతో ఎజెండాను ఖరారు చేసింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఒకటి, రెండో, మూడో దశల ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువ కింద ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆయకట్టుకు నీటిని అందిస్తోంది.

తాగునీటి పథకం ద్వారా కాకుండా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువ కింద ఆయకట్టుకు నీటిని అందించడానికి నాగార్జునసాగర్‌ జలవిస్తరణ ప్రాంతంలో రూ.1,450 కోట్లతో సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టడంపై గతేడాది నవంబర్‌ 3న కృష్ణా బోర్డు దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. 

పాలమూరు–రంగారెడ్డి, సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌పై...  
సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌తోపాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డును కోరింది. నీటి కేటాయింపులు లేని నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వలేమని డీపీఆర్‌ను ఇటీవల తెలంగాణ సర్కార్‌కు సీడబ్ల్యూసీ తిప్పిపంపింది. ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డితోపాటు సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ ప్రాజెక్టు పనులను నిలిపేసేలా తెలంగాణను ఆదేశించాలని బోర్డు సమావేశంలో ఏపీ ప్రభుత్వం డిమాండ్‌ చేయనుంది.

కృష్ణా ట్రిబ్యునల్‌–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్‌(రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) కుడి కాలువను చేపట్టడంపై తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ట్రిబ్యునల్‌ తీర్పు నోటిఫై అయ్యాకే పనులు చేపడతామని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్‌ ఆధునీకరణ కోసం మరోసారి కోరేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. 

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలయ్యేనా?: 
బోర్డును పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్నెల్లలోగా దాన్ని అమలు చేయాలని పేర్కొంది. మరో ఆర్నెల్లు గడువు పొడిగించినా నోటిఫికేషన్‌ అమలుపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ నేపథ్యంలో గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై రెండు రాష్ట్రాలను  ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 66 శాతం(512 టీఎంసీలు) ఏపీ, 34 శాతం(299  టీఎంసీలు) తెలంగాణ వాడుకునేలా 2015, జూన్‌ 19న తాత్కాలిక ఒప్పందం కుదిరింది.

2022–23 వరకూ అదే విధానం ప్రకారం బోర్డు నీటిని పంపిణీ చేస్తోంది. కానీ.. సగ భాగం వాటా కావాలని తెలంగాణ సర్కారు మరోసారి డిమాండ్‌ చేసిన నేపథ్యంలో నీటి పంపిణీపై కూడా సమావేశంలో బోర్డు చర్చించనుంది.2023–24 నీటి సంవత్సరంలో నీటి కేటాయింపులు, విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై త్రిసభ్య కమిటీ క్రమం  తప్పకుండా సమావేశమవడంపైనా చర్చించనున్నారు. 

హిందీలో కార్యకలాపాలా..?
కేంద్రంతో బోర్డు ఉత్తర ప్రత్యుత్తరాలు, కార్యకలాపాలు హిందీ భాషలోనే జరగాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ క్రమం తప్పకుండా కోరుతూ వస్తోంది. కానీ.. రెండు రాష్ట్రాల అధికారులకూ హిందీ భాషలో ప్రావీణ్యం లేని నేపథ్యంలో, కేంద్ర జల్‌ శక్తి శాఖ ఉత్తర్వుల అమలుపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల్‌ శక్తి శాఖ అనుమతి లేకుండా బోర్డులో పనిచేస్తున్న సిబ్బందికి మూలవేతనంలో 25 శాతం ప్రోత్సాహకంగా ఇచ్చిన నిధులను రికవరీ చేయాలని కేంద్రం ఆదేశించడంపై కూడా చర్చించి, చర్యలు చేపట్టనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement