నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: ‘ప్రభుత్వ అసమర్థత వల్లే కృష్ణా మిగులు జలాలను కోల్పోయాం. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో కృష్ణా మిగులు జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ తీర్పు అమలైతే భవిష్యత్తులో జిల్లా ఎడారిగా మారుతుంది. మిగులు జలాల సాధనకు పోరాడాల్సిన అవసరం ఉంది’’ అని సీపీఎం శాసనసభా పక్ష నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా మిగులు జలాల వినియోగంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించాలని, లేనిపక్షంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పిల్లర్ పార్క్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈసందర్భంగా జూలకంటి మాట్లాడుతూ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కృష్ణా మిగులు జలాలపై ఆధారపడి కట్టిన ఎనిమిది ప్రాజెక్టులు వృథాగా మారే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు బ్రిజేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పులో నూతనంగా నిర్మాణమవుతున్న ఏ ప్రాజెక్టు కూడా నీటి కేటాయింపు జరగలేదన్నారు. మిగులు జలాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ ఇవ్వడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తీర్పును ప్రభుత్వ గెజిట్‌లో ముద్రించకముందే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు ట్రిబ్యునల్ మరోసారి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవడానికి అనుమతించినందునా భవిష్యత్‌లో కృష్ణా జలాలు మన రాష్ట్రానికి సకాలంలో రావన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం తాగు, సాగునీరు కోనం ఏర్పాటు చేసిన ఎల్‌ఎల్‌బీసీ, ఏఎమ్మార్పీ, ఉదయ సముద్రానికి నీటి కేటాయింపు చేయకపోవడం శోచనీయమన్నారు. జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బండా శ్రీశైలం, నాయకులు ముల్కలపల్లి రాములు, హాషం, డబ్బికార్ మల్లేశ్, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కత్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి పద్మ, అవుట సైదులు, కొండేటి శ్రీను, బషీర్, షేర్ల బాలు, చందులాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మిగులు జలాల సాధనకు పోరాడుదాం
Published Sat, Dec 7 2013 1:16 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement