julakanti raga reddy
-
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, కార్పొరేట్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉచిత చికిత్స అందించాలని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్, టి.జ్యోతి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు మంగళవారం వారు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతో పాటు, బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలని, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణైతే కుటుంబసభ్యులందరికీ పరీక్షలు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు కోరారు. పరీక్షల నిర్వహణలో, బాధితులకు వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా సీపీఎం నాయకులు ఆరోపించారు. కరోనా విభాగాన్ని ఏర్పాటు చేయండి: జూలకంటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సీపీ ఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వెంటనే కరోనా వైద్య కేంద్రాన్ని ప్రారం భించి, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని, ఆక్సిజన్, వెంటిలేటర్స్, ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఇప్పటికే వైరస్ సోకి క్వారంటైన్లో ఉన్నారని, పట్టణంలోని వ్యాపారులు స్వీయ లాక్డౌన్ విధించుకున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ఈటల రాజేందర్‌కు జూలకంటి వినతిపత్రం సమర్పించారు. -
పింఛన్ కేంద్రాలు పెంచండి: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: సకాలంలో పింఛన్ అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై మానవతా దృక్పథంతో స్పందించి పింఛన్ కేంద్రాలను పెంచాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పింఛన్ కేంద్రాలు దూరంగా ఉండటంతో లబ్ధిదారులు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అక్కడకు వెళ్లాక సిబ్బంది వివిధ కారణాలతో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. పింఛన్ సెంటర్లలో మంచినీటి సౌకర్యం కల్పించటంతో పాటు సకాలంలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కేజీబీవీలలో పనిచేస్తున్న ఉద్యోగులంతా మహిళలేనని, వీరికి చెల్లిస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నా వీరిమధ్య వేతనాల్లో ఏమాత్రం పోలిక లేదన్నారు. సెలవుల మంజూరీలోనూ వివక్ష కొనసాగుతోందని, ఉన్నతాధికారులకు ఈ సమస్యలను ఎన్నిసార్లు వివరించినా పరిష్కారం కావడం లేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారని, ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. వారికి హెల్త్ కార్డులివ్వాలని, ప్రసూతి సెలవులు వర్తింప చేయాలని జూలకంటి తన లేఖలో సీఎంను కోరారు. -
సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: గత మూడేళ్లుగా నాగార్జునసాగర్ నుంచి నీరందక ఆయకట్టు భూములు బీడుగా మారాయని, ఈ రబీ సీజన్లోనైనా ఆయకట్టుకు నీరివ్వాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు నీరు వస్తోందని, అయితే, సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే వరకు శ్రీశైలం నుంచి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నెల రోజులుగా దిగువకు నీటిని విడుదల చేయడం లేదని, శ్రీశైలం ఎగువ ప్రాజెక్టులకే నీరిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇపుడు సాగర్ పూర్తి స్థాయిలో నిండిన తర్వాతే మిగులు జలాలను పోతిరెడ్డిపాడు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టులకు వదలాలని కోరారు. నాగార్జున సాగర్‌పై నల్లగొండ, ఖమ్మం హైదరాబాద్ తాగునీటికోసం కూడా ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ, కేంద్రం, కృష్ణా వాటర్ బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని జూలకంటి కోరారు. -
ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం మద్యం వ్యాపారంతో జనాల్ని బలి తీసుకుంటోందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడిపేందుకు పూర్తిగా మద్యం ఆదాయంపైనే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి రాకముందు మద్యం మహమ్మారిపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది బంగారు తెలంగాణా.. మద్యం తెలంగాణా అని ప్రశ్నించారు. బార్లు, పబ్బుల పనివేళలను పొడిగించడం, వైన్సులకు సిట్టింగు రూములను పెంచడం వంటివి చూస్తుంటే ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఎంతగా ఆధారపడిందో తెలుస్తోందని విమర్శించారు. -
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక రోగులకు సమయానికి వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డెంగీ, మలేరియా సోకి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. జ్వరాల నియంత్రణకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, మొబైల్ వైద్య కేంద్రాలను నిర్వహించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు అదనంగా పోస్టులు భర్తీచేయాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పారిశుధ్యం సరిగా లేదని, వార్డులు, ఆస్పత్రి పరిసరాలు దుర్గంధం కొడుతున్నాయన్నారు. -
దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న పాలకులు
•ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి •ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు శివదాసన్ •ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం తగదు : ఎమ్మెల్యే జూలకంటి కోదాడటౌన్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లౌకిక శక్తులపై ఆర్ఎస్ఎస్ భావజాలం రుద్దడానికి ప్రయత్నిస్తుందని, దేశానికి పెనుముప్పుగా మారిన మతోన్మాదాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు శివదాసన్ పిలుపునిచ్చారు. కోదాడలో జరుగుతున్న తొలి తెలంగాణ రాష్ర్ట మహాసభల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ‘ఆట-పాట’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలుగుతుందన్నారు. సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యం చేయటానికి హందీలో వచ్చిన పీకే సినిమాపై కొందరు దాడి చేయడం మతోన్మాదమేనని ఆరోపించారు. తమిళనాడులో పెరుమాళ మురుగన్, బంగ్లాదేశ్‌లో తస్లీమా నస్రీన్, శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దాడుల్లో కూడా మతోన్మాద భావజాలం ఉందని, ఇది భారతదేశానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వినాయకుడి విగ్రహం పెడతామనడం తగదని, దీని వల్ల అనవసర సమస్యలు వస్తాయన్నారు. విద్యారంగంలో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని విద్యార్థులు మూకుమ్మడిగా వ్యతిరేకించాలని, సమసమాజ స్థాపనకు నడుంబిగించాలని కోరారు. విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అందెసత్యం, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్, రాష్ట్ర కార్యదర్శి సాంబశివ, జిల్లా అధ్యక్షుడు మల్లం మహేశ్, నాయకులు కోట రమేష్, నర్సింహారావు, కోట్ల అశోక్‌రెడ్డి, సీపీఎం నాయకులు ముల్కలపల్లి రాములు, జుట్టుకొండ బసవయ్య, కుక్కడపు ప్రసాద్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల సమ్మె విరమణ
విరమణ తాత్కాలికమే..: అంగన్వాడీలు సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలంటూ 13 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ సిబ్బందితో ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారని.. దాంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు రోజా, భారతి, సాయిబాబా తెలిపారు. శనివారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌తో చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘మా డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించారు. గౌరవ వేతనాన్ని రూ. 800 పెంచుతున్నట్లు ప్రకటించారు. మేం దానికి అంగీకరించకుండా.. కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశాం. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో... వేతనం పెంపు, ఇతర డిమాండ్లపై నిర్ణయం తీసుకునేవారు లేరని, అందువల్ల ఆందోళన విరమించాలని అధికారులు సూచించారు. మా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వారి సూచనల మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమించి, సోమవారం నుంచి విధుల్లో చేరుతున్నాం. అధికారులు ఇచ్చిన హామీని అమలు చేయని పక్షంలో.. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఆందోళనకు దిగుతాం’’ అని పేర్కొన్నారు. సరైన సమయంలో నిర్ణయం: అంగన్వాడీల సమస్యలను కూలంకషంగా పరిశీలించి, ఆ ఫైల్‌ను సర్క్యులేషన్‌కు పెట్టామని, సరైన సమయంలో నిర్ణయాలు ఉంటాయని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహాని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను సోమవారం నుంచి తెరవాలని సూచించారు. సమయం పడుతుందన్నారు: జూలకంటి అంగన్వాడీల ఆందోళన నేపథ్యంలో.. గవర్నర్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి, మాట్లాడామని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేనందున సమస్యల పరిష్కారానికి సమ యం పడుతుందని వారు స్పష్టం చేశారని.. ఇది ఆందోళనకు సమయం కాదని, సమ్మె విరమించాలని అధికారులు సూచించారని చెప్పారు. వారి హామీ మేరకు అం గన్వాడీలు తాత్కాలికంగా సమ్మె విరమించారన్నారు. -
మిగులు జలాల సాధనకు పోరాడుదాం
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: ‘ప్రభుత్వ అసమర్థత వల్లే కృష్ణా మిగులు జలాలను కోల్పోయాం. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో కృష్ణా మిగులు జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ తీర్పు అమలైతే భవిష్యత్తులో జిల్లా ఎడారిగా మారుతుంది. మిగులు జలాల సాధనకు పోరాడాల్సిన అవసరం ఉంది’’ అని సీపీఎం శాసనసభా పక్ష నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా మిగులు జలాల వినియోగంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించాలని, లేనిపక్షంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పిల్లర్ పార్క్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జూలకంటి మాట్లాడుతూ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కృష్ణా మిగులు జలాలపై ఆధారపడి కట్టిన ఎనిమిది ప్రాజెక్టులు వృథాగా మారే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు బ్రిజేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పులో నూతనంగా నిర్మాణమవుతున్న ఏ ప్రాజెక్టు కూడా నీటి కేటాయింపు జరగలేదన్నారు. మిగులు జలాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ ఇవ్వడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తీర్పును ప్రభుత్వ గెజిట్‌లో ముద్రించకముందే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు ట్రిబ్యునల్ మరోసారి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవడానికి అనుమతించినందునా భవిష్యత్‌లో కృష్ణా జలాలు మన రాష్ట్రానికి సకాలంలో రావన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం తాగు, సాగునీరు కోనం ఏర్పాటు చేసిన ఎల్ఎల్బీసీ, ఏఎమ్మార్పీ, ఉదయ సముద్రానికి నీటి కేటాయింపు చేయకపోవడం శోచనీయమన్నారు. జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బండా శ్రీశైలం, నాయకులు ముల్కలపల్లి రాములు, హాషం, డబ్బికార్ మల్లేశ్, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కత్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి పద్మ, అవుట సైదులు, కొండేటి శ్రీను, బషీర్, షేర్ల బాలు, చందులాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.