అంగన్‌వాడీల సమ్మె విరమణ
విరమణ తాత్కాలికమే..: అంగన్‌వాడీలు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలంటూ 13 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందితో ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారని.. దాంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు రాష్ట్ర అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు రోజా, భారతి, సాయిబాబా తెలిపారు. శనివారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌తో చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘మా డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించారు. గౌరవ వేతనాన్ని రూ. 800 పెంచుతున్నట్లు ప్రకటించారు. మేం దానికి అంగీకరించకుండా.. కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశాం. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో... వేతనం పెంపు, ఇతర డిమాండ్లపై నిర్ణయం తీసుకునేవారు లేరని, అందువల్ల ఆందోళన విరమించాలని అధికారులు సూచించారు. మా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వారి సూచనల మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమించి, సోమవారం నుంచి విధుల్లో చేరుతున్నాం. అధికారులు ఇచ్చిన హామీని అమలు చేయని పక్షంలో.. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఆందోళనకు దిగుతాం’’ అని పేర్కొన్నారు.
సరైన సమయంలో నిర్ణయం: అంగన్‌వాడీల సమస్యలను కూలంకషంగా పరిశీలించి, ఆ ఫైల్‌ను సర్క్యులేషన్‌కు పెట్టామని, సరైన సమయంలో నిర్ణయాలు ఉంటాయని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహాని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం నుంచి తెరవాలని సూచించారు.
సమయం పడుతుందన్నారు: జూలకంటి
అంగన్‌వాడీల ఆందోళన నేపథ్యంలో.. గవర్నర్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి, మాట్లాడామని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేనందున సమస్యల పరిష్కారానికి సమ యం పడుతుందని వారు స్పష్టం చేశారని.. ఇది ఆందోళనకు సమయం కాదని, సమ్మె విరమించాలని అధికారులు సూచించారని చెప్పారు. వారి హామీ మేరకు అం గన్‌వాడీలు తాత్కాలికంగా సమ్మె విరమించారన్నారు.