సాక్షి, హైదరాబాద్: గత మూడేళ్లుగా నాగార్జునసాగర్ నుంచి నీరందక ఆయకట్టు భూములు బీడుగా మారాయని, ఈ రబీ సీజన్‌లోనైనా ఆయకట్టుకు నీరివ్వాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు నీరు వస్తోందని, అయితే, సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే వరకు శ్రీశైలం నుంచి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నెల రోజులుగా దిగువకు నీటిని విడుదల చేయడం లేదని, శ్రీశైలం ఎగువ ప్రాజెక్టులకే నీరిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇపుడు సాగర్ పూర్తి స్థాయిలో నిండిన తర్వాతే మిగులు జలాలను పోతిరెడ్డిపాడు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టులకు వదలాలని కోరారు. నాగార్జున సాగర్‌పై నల్లగొండ, ఖమ్మం హైదరాబాద్ తాగునీటికోసం కూడా ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ, కేంద్రం, కృష్ణా వాటర్ బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని జూలకంటి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment