తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు స్టైల్లోనే ప్రవర్తిస్తున్నారా? జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రాంతీయ పార్టీ తరహాలో నడిపే ప్రయత్నం చేస్తున్నారా?. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును గమనిస్తే ఈ అనుమానాలు రాకపోవు.
‘‘నేను మారా.. మీరూ మారాలి.. మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు నా వద్ద ఉన్నాయి’’. ‘‘ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించా..నా ప్రొగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించుకున్నా..దానిని అందరికి అందచేస్తా..’’, ‘‘హైదరాబాద్‌లో ఉంటున్న నాకు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. నాకు అన్నీ తెలుసు. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వంలో తప్పులు ఏమీ జరగలేదు..పొరపాట్లు జరిగాయని ఎవరైనా భావిస్తే నా దృష్టికి తీసుకు వస్తే సరిదిద్దుకునేందుకు వెనుకాడను. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పని చేశా.. మంత్రులు కూడా అలాగే పని చేశారు.. రేషన్ డీలర్లు, అంగన్వాడీల ఎంపిక జోలికి వెళితే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయి.. వచ్చే పంచాయతీ ఎన్నికలలో అన్ని చోట్ల గెలవాలి. అవి కీలకం. పదవుల గురించి తొందరపడవద్దు..అన్నీ జరుగుతాయి.." అని రేవంత్ అన్నట్లు వార్తా పత్రికలలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అంతేకాక..
‘‘మొదటి సారి గెలవడం ఓకే .. రెండో సారి గెలవడమే గొప్ప.., సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్ లు వస్తాయి..’’ అని కూడా అన్నారంటూ కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ ప్రసంగం అంతా పరిశీలించిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని నడుపుతున్న స్టైల్‌లోనే, అందులోను చంద్రబాబు నాయుడు సరళిలోనే రేవంత్(Revanth) వ్యవహార శైలి ఉన్నట్లు కనిపిస్తుంది. 1995లో తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసేవరకు తన వర్గ ప్రయోజనాల కోసం, ఆధిపత్యం కోసం పనిచేసిన చంద్రబాబు సీఎం అయ్యాక మొత్తం సీన్ మార్చేశారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి మొదట్లో కొన్ని ట్రిక్స్ అమలు చేసినా, వారిపై పట్టు వచ్చాక స్టైల్ మార్చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలకు ఆయన టైమ్ లోనే ప్రాధాన్యత వచ్చింది. మీడియాను తన గుప్పెట్లో పెట్టుకుని లీకులు ఇప్పించే వారు. అవసరమైతే ఆయనే ఆయా మీడియా సంస్థలలోని కాస్త కీలకమైన జర్నలిస్టులకు కూడా ఫోన్ చేసి మాట్లాడేవారు.
.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరు కలిసినా, 'అలా అన్నారు..ఇలా అన్నారు.."అంటూ పూర్తిగా పాజిటివ్ యాంగిల్ లోనే కవరేజీ వచ్చేలా చేసుకునే వారు. కేబినెట్ సమావేశాలలో సైతం అదే ధోరణి. తాను మారానని, మీరూ మారాలని చెబుతుండే వారు. కాకపోతే ఆయన ఏమి మారారో, తాము ఎక్కడ మారాలో అర్థ అయ్యేది కాదు. తాను అవినీతి లేకుండా పనిచేస్తున్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు. కానీ పార్టీలోని ఇతర నేతలకు వాస్తవాలు తెలుసు. అయినా ఎవరికి వారు తమ అవసరాల రీత్యా ఆయన వద్ద మాత్రం తలూపి వచ్చేవారు. అక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ అక్రమం చేసినా బయట పడకుండా జరగాలన్నది చంద్రబాబు సిద్దాంతం అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, మంత్రులు కూడా పనిచేయాలని, అందరి జాతకాలు తనవద్ద ఉన్నాయని చెప్పేవారు.
మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తద్వారా తాను ఒక్కడినే కష్టపడుతున్నానన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించే వారు. అదే ప్రకారం ప్రచారం చేయించుకునేవారు. విశేషం ఏమిటంటే గత టరమ్ లో మొదటి ర్యాంకు వచ్చిందని ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరికి ఆ తర్వాత టిక్కెట్లు ఇవ్వలేదు. అది వేరే సంగతి.
రేవంత్ వ్యాఖ్యలు చదివితే అచ్చం తన గురువు దారిలోనే ఉన్నట్లు కనబడుతుంది. కాంగ్రెస్ హై కమాండ్ బలహీనంగా ఉండడం రేవంత్ కు కలిసి వచ్చిన పాయింట్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మంత్రుల, ఎమ్మెల్యేల జాతకాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో మినహాయించి మిగిలిన సీఎంలకు అంత స్వేచ్చ ఉండేది కాదు. పైగా వర్గపోరు ఉండేది. వైఎస్ కు కూడా వర్గాల తలనొప్పి ఉన్నా, అందరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేసేవారు. రేవంత్ కూడా ఇప్పటికైతే వర్గపోరు లేకుండా పాలన సాగిస్తున్నారు. కాని అవకాశం వస్తే ఆయనపై అధిష్టానంపై ఫిర్యాదు చేయడానికి పలువురు సిద్దంగానే ఉంటారు. ఇంతకీ రేవంత్ ఏమి మారారో ఎవరికి తెలియదు.
నిజానికి పీసీసీ(PCC) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న తీరుకు చాలా తేడా ఉందన్నది పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది. రుణమాఫీ విషయంలో కొంతవరకు సఫలమైనా, బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కొన్ని వాగ్దానాలను నెరవేర్చినప్పటికి ఆరు గ్యారంటీలలో కీలకమైన హామీల సంగతి ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలకు రూ.2500 చొప్పున ఇచ్చే స్కీమ్ గురించి ప్రజలు అడిగితే జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలలో ఆశించిన రీతిలో రియల్ ఎస్టేట్ సాగడం లేదు.హైడ్రా కూల్చివేతలు, మూసి హడావుడి వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాటు విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా, వాటిపై నిర్దిష్ట కార్యాచరణ అంతంతమాత్రంగానే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసినా, దాని వల్ల ఎంత ఫలితం వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో..
తన ప్రభుత్వంలో తప్పులే జరగలేదని, ఏవైనా జరిగితే అవి పొరపాట్లేనని రేవంత్ అంటే పైకి అవునవును అని చెప్పవచ్చు. కాని కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విషయాన్ని మరీ తెగేదాక లాగడం చాలామంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. సినిమా పరిశ్రమను నష్టపరిచేలా గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించలేదు. కాని ఇప్పుడు రేవంత్ వారిపైకి దూకుడుగా వెళ్లారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదని అంటున్నారు. భాష విషయంలో కూడా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన తీరులోనే ఉండడం కొంతమందికి రుచించడం లేదు. సాధారణ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురవుతోందని, దానిని గుర్తించి సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు.
చంద్రబాబు మాదిరి 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే నమ్మడం కష్టమే నని ఒక నేత అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు సి.ఎమ్.లు ఉదయం పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి విధానపరమైన నిర్ణయాలు చేసి,ఫైళ్లు ఏమైనా ఉంటే చూసి ఇంటికి వెళ్లిపోయేవారు. అక్కడనుంచి ఏవైనా అత్యవసర పనులకు అటెండ్ అయ్యేవారు.ప్రజలను, పార్టీ వారిని కలిసేవారు. చంద్రబాబు వచ్చాక ఈ ధోరణి మార్చుకున్నారు. పని ఉన్నా, లేకపోయినా ఆఫీస్ లో గడపడం అలవాటు చేసుకున్నారు.
ఎన్.టి.ఆర్. తెల్లవారు జామున అధికారులతో భేటీ అవుతుండేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారు తెల్లవారేసరికల్లా ప్రజలను గడవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి సాయంత్రం వరకు ఉండేవారు. కేసీఆర్ ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ లోనే ఉండేవారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. నిజానికి ఏ సీఎం అన్ని గంటలు పనిచేయవలసిన అవసరం ఉండదు. అంత పని కూడా ఉండదు.
చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా ఇతర పార్టీల నేతలతో అంతరంగికంగా సంబంధాలు పెట్టుకున్నారన్నది కొందరి భావనగా ఉంది. ముఖ్యంగా బీజేపీ ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని భావిస్తున్నారు. అందువల్లే ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటివారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగిడారని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్డీయే, ఐఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని ఒక కాంగ్రెస్ నేత చమత్కరించారు. అంతేకాదు. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పాత సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని, చంద్రబాబు, రేవంత్ లు రాజకీయంగా సహకరించుకుంటున్నారని ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఏది ఏమైనా రేవంత్ లో నిజంగా ప్రజలకు ,పార్టీకి ఉపయోగపడేలా మార్పు వస్తే మంచిదే. కాని ఆయన కూడా అధికార దర్పంతో ఉంటే అందరికి నష్టం అనే అభిప్రాయం నెలకొంది.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment