సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక రోగులకు సమయానికి వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డెంగీ, మలేరియా సోకి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. జ్వరాల నియంత్రణకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, మొబైల్ వైద్య కేంద్రాలను నిర్వహించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు అదనంగా పోస్టులు భర్తీచేయాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పారిశుధ్యం సరిగా లేదని, వార్డులు, ఆస్పత్రి పరిసరాలు దుర్గంధం కొడుతున్నాయన్నారు.