గిద్దలూరు తమ్ముళ్ల తన్నులాట
-
ఇరువర్గాలకు చెందిన
-
ఎనిమిది మందికి గాయాలు
గిద్దలూరు : గిద్దలూరు టీడీపీలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు శుక్రవారం మరోసారి బహిర్గతమయ్యాయి. పట్టణంలో తాగునీటి సరఫరా విషయంలో ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానలా మారి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో 17వ వార్డు కౌన్సిలర్ చింతలపూడి రామలక్ష్మితో పాటు మరో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులకు గాయాలయ్యాయి. 17వ వార్డు కౌన్సిలర్ రామలక్ష్మి ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వర్గంలో.. 18వ వార్డు కౌన్సిలర్ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు వర్గంలో ఉన్నారు. వాటర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న బత్తుల లక్ష్మీనారాయణపై నాలుగు రోజుల క్రితం 18వ వార్డు కౌన్సిలర్ సూరేపల్లి గుర్రమ్మ కుమారుడు వెంకట్రావు, అతని కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపరిచారు.
ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. గాయపడిన లక్ష్మీనారాయణ వైద్యశాలలో చికిత్స పొంది తిరిగి శుక్రవారం విధుల్లో చేరాడు. ఉదయం 7 గంటల సమయంలో తాగునీటి ట్యాంకర్ వెంట వెళ్తున్న లక్ష్మీనారాయణను పాములపల్లె గేట్ వద్ద వెంకట్రావు అడ్డుకున్నారు. ట్యాంకర్‌ను తాను చెప్పిన చోట నిలపాలని డిమాండ్ చేశాడు. దీనికి లక్ష్మీనారాయణ తాను అధికారులు చెప్పిన విధంగా చేస్తానని సమాధానమిచ్చాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అక్కడితో ఆగకుండా లక్ష్మీనారాయణ తన బంధువు 17వ వార్డు కౌన్సిలర్‌కు ఫోన్ చేశాడు. వెంకట్రావు కూడా తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఘర్షణలో 18వ వార్డు కౌన్సిలర్ బంధువులైన సూరేపల్లి వెంకట్రావు, కన్న, శ్రీధర్, భూతరాజు విజయలక్ష్మిలకు గాయాలయ్యాయి. శ్రీధర్‌కు వీపుపై కొరికిన గాయాలున్నాయి.
17వ వార్డు కౌన్సిలర్ చింతలపూడి రామలక్ష్మి, బత్తుల బాలరంగమ్మ, ఆదిలక్ష్మి, లక్ష్మీనారాయణలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఎనిమిది మంది స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఒకరిపై ఒకరు కారం చల్లుకుని కొట్టుకున్నారు. తమ నాన్నను చంపుతామని లక్ష్మీనారాయణ బంధువులు ఫోన్‌లో బెదిరిస్తున్నారని, ఫోన్ సంభాషణలు సీడీలో వేసి పోలీసులకు ఇచ్చినట్లు వెంకట్రావు కుమార్తె విజయలక్ష్మి తెలిపారు. మార్కాపురం డీఎస్పీ గిద్దలూరు చేరుకుని లక్ష్మీనారాయణ, వెంకట్రావులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెంకట్రావు వర్గీయులను మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైద్యశాలలో పరామర్శించారు.