ఇద్దరు మిలటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం సూడాన్‌లో సామాన్యుల ఆకలి కేకలకు దారితీస్తోంది. అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంతో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు దొరక్క, కటిక నేలపై నిద్రిస్తూ ఎప్పుడే తూటా తమ ప్రాణాల్ని హరిస్తుందో తెలీని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
సూడాన్‌లో ఎందుకీ ఘర్షణలు ?
దశాబ్దాల తరబడి నియంత పాలనలో మగ్గిపోయిన సూడాన్‌లో 2019లో ఆర్మీ తిరుగుబాటు జరిగి ఆనాటి అధ్యక్షుడు, నియంత ఒమర్ అల్– బషీర్‌ని సైన్యం గద్దె దింపడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో రెండేళ్లకే 2021లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కొదమసింహాల్లాంటి ఇద్దరు జనరల్స్ చేతులు కలిపారు. అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
మళ్లీ రెండేళ్లకే అధికార బదలాయింపులో సమస్యలు మిత్రులైన ఆ మిలటరీ జనరల్స్‌ను శత్రువులుగా మార్చింది. వారే సూడాన్ ప్రస్తుత పాలకుడు, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్, ఉపాధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ఎఫ్ చీఫ్ జనరల్ మొహమద్ హమ్దాన్ దగలో (హెమెడ్తీ) . వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం తారస్థాయికి చేరుకుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం గత ఏడాది చివర్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశంలో ఎన్నికలు జరగాలి. కానీ బుర్హాన్ అనుకున్నట్టుగా ఆ పని చేయలేదు.
ఈలోగా అధికారాన్ని తన గుప్పిట్లో తీసుకోవడానికి హెమెడ్తీ పౌర పార్టీల కూటమైన ఫోర్సెస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్ (ఎఫ్‌ఎఫ్‌సీ)తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తనని తాను ఒక రాజనీతిజ్ఞుడిగా చూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బంగారం గనులు, ఇతర వెంచర్ల ద్వారా హెమెడ్తీ, ఎఫ్‌ఎఫ్‌సీలు బాగా సంపద పోగేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బషీర్ అనుచరులు, ఇతర సీనియర్లు, ఆర్మీలో చాలా రోజులుగా పాతుకుపోయి ఉన్న వారిని పక్కకు తప్పించాలని ప్రణాళికలు రచించారు.
ఆర్‌ఎస్‌ఎఫ్‌ను దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరించడం ప్రారంభించారు. ఈలోగా లక్ష మంది బలగం ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్)ను సైన్యంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత సైన్యాధ్యక్షుడుగా ఎవరు ఉంటారన్నది సవాల్‌గా మారాయి. ఈ పరిణామాలన్నీ తన పదవికి ఎసరు పెడతాయని అధ్యక్షుడు బుర్హానా భావించారు. ఫలితంగా ఈ నెల 15న ఇరు వర్గాల మధ్య పోరు మొదలైంది.
అయిదు రోజులుగా నరకం
సూడాన్‌లో వారం రోజులుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. పోరాటమంతా రాజధారి ఖర్టూమ్ పరిసరాల్లో జనావాస ప్రాంతాల్లో జరుగుతోంది. సూడాన్ జనాభా 4.6 కోట్లు అయితే రాజధాని పరిసర ప్రాంతాల్లోనే 1.2 కోట్ల మంది నివసిస్తారు. ఈ ప్రాంతాలన్నీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. వీధుల్లోనే శవాలు పడి ఉన్నా పట్టించుకునే వారే లేరు. విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది.
బేకరీలో బ్రెడ్ కొనుక్కొని తెచ్చుకోవడానికి 3 గంటలు క్యూ లైన్‌లో నిల్చోవాల్సి వస్తోంది. కిలోమీటర్ దూరంలో ఉండే ఆఫీసుకి వెళ్లడం కూడా అందరికీ కష్టమవుతోంది. ఇల్లు కదిలి కాలు బయట పెడితే ప్రాణాలతో బతికి ఉంటారన్న నమ్మకం లేదు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా వీధుల్లో వినిపిస్తున్న కాల్పుల మోతలతో బయటకి అడుగుపెట్టే ధైర్యం చేయడం లేదని 65 ఏళ్ల వయసున్న అబ్బాస్ చెప్పారు. సూడాన్ పాలకులకు ప్రజల ప్రాణాలపై కనీస గౌరవం కూడా లేదని ఆయన మండిపడ్డారు.
‘‘వేలాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో సరుకులు అయిపోతున్నా, మంచినీరు, కరెంట్, మందులు వంటివి లేకపోయినా బయటకు వచ్చే పరిస్థితి లేదు’’అని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ వోల్కర్ టిర్క్ చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు బషీర్ పాలనలో అంతర్యుద్ధంలోనే ప్రజలు గడిపారు. పేదరికం, అణచివేతను ఎదుర్కొంటూ దుర్భర పరిస్థితుల్ని చూశారు. ఇప్పుడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందన్న వారి ఆశలు అడియాసలుగా మారాయి.
ఎవరిది పై చేయి?
బుర్హాన్, హెమెడ్తీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇద్దరికి ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎఫ్‌ను ఒక తిరుగుబాటు సంస్థగా ముద్రవేసిన బుర్హాన్ వెంటనే దానిని రద్దు చేయాలని పట్టు బడుతున్నారు. మరోవైపు హెమెడ్తీ బుర్హాన్‌ను క్రిమినల్‌గా అభివర్ణిస్తున్నారు. బషారీ పాలన నుంచి విముక్తి పొందినా దేశంలో శాంతి స్థాపన జరగకపోవడానికి ఆయనే కారణమని నిందిస్తున్నారు. సూడాన్ ఆర్మీలో 3 లక్షల మంది సైనికులతో వైమానిక బలగం కూడా దాని సొంతం. ఆర్‌ఎస్‌ఎఫ్‌లో లక్ష మంది సైనికులే ఉన్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎఫ్‌కు సూడాన్ పశ్చిమ ప్రాంతంలో గిరిజన తెగల అండదండలు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఇద్దరు బలవంతులు కొట్టుకుంటూ ఉంటే ఎలా స్పందించాలో తెలీక మౌనం వహిస్తోంది. మానవీయ సంక్షోభం రాకుండా చర్యలు తీసుకోవాలని వారికి సలహా ఇవ్వడం మినహా మరేమీ చేయలేకపోతోంది.
సూడాన్ జనాభా: 4.6 కోట్లు
కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో నివసిస్తున్నవారు: 1.2 కోట్లు
మానవీయ సాయం కావాల్సిన వారు: 1.6 కోట్ల
ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు: 1.17 కోట్లు
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment