military officers
-
Sudan crisis: ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు
ఇద్దరు మిలటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం సూడాన్‌లో సామాన్యుల ఆకలి కేకలకు దారితీస్తోంది. అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంతో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు దొరక్క, కటిక నేలపై నిద్రిస్తూ ఎప్పుడే తూటా తమ ప్రాణాల్ని హరిస్తుందో తెలీని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సూడాన్‌లో ఎందుకీ ఘర్షణలు ? దశాబ్దాల తరబడి నియంత పాలనలో మగ్గిపోయిన సూడాన్‌లో 2019లో ఆర్మీ తిరుగుబాటు జరిగి ఆనాటి అధ్యక్షుడు, నియంత ఒమర్ అల్– బషీర్‌ని సైన్యం గద్దె దింపడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో రెండేళ్లకే 2021లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కొదమసింహాల్లాంటి ఇద్దరు జనరల్స్ చేతులు కలిపారు. అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ రెండేళ్లకే అధికార బదలాయింపులో సమస్యలు మిత్రులైన ఆ మిలటరీ జనరల్స్‌ను శత్రువులుగా మార్చింది. వారే సూడాన్ ప్రస్తుత పాలకుడు, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్, ఉపాధ్యక్షుడు, ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమద్ హమ్దాన్ దగలో (హెమెడ్తీ) . వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం తారస్థాయికి చేరుకుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం గత ఏడాది చివర్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశంలో ఎన్నికలు జరగాలి. కానీ బుర్హాన్ అనుకున్నట్టుగా ఆ పని చేయలేదు. ఈలోగా అధికారాన్ని తన గుప్పిట్లో తీసుకోవడానికి హెమెడ్తీ పౌర పార్టీల కూటమైన ఫోర్సెస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్ (ఎఫ్ఎఫ్సీ)తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తనని తాను ఒక రాజనీతిజ్ఞుడిగా చూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బంగారం గనులు, ఇతర వెంచర్ల ద్వారా హెమెడ్తీ, ఎఫ్ఎఫ్సీలు బాగా సంపద పోగేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బషీర్ అనుచరులు, ఇతర సీనియర్లు, ఆర్మీలో చాలా రోజులుగా పాతుకుపోయి ఉన్న వారిని పక్కకు తప్పించాలని ప్రణాళికలు రచించారు. ఆర్ఎస్ఎఫ్ను దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరించడం ప్రారంభించారు. ఈలోగా లక్ష మంది బలగం ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్)ను సైన్యంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత సైన్యాధ్యక్షుడుగా ఎవరు ఉంటారన్నది సవాల్‌గా మారాయి. ఈ పరిణామాలన్నీ తన పదవికి ఎసరు పెడతాయని అధ్యక్షుడు బుర్హానా భావించారు. ఫలితంగా ఈ నెల 15న ఇరు వర్గాల మధ్య పోరు మొదలైంది. అయిదు రోజులుగా నరకం సూడాన్‌లో వారం రోజులుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. పోరాటమంతా రాజధారి ఖర్టూమ్ పరిసరాల్లో జనావాస ప్రాంతాల్లో జరుగుతోంది. సూడాన్ జనాభా 4.6 కోట్లు అయితే రాజధాని పరిసర ప్రాంతాల్లోనే 1.2 కోట్ల మంది నివసిస్తారు. ఈ ప్రాంతాలన్నీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. వీధుల్లోనే శవాలు పడి ఉన్నా పట్టించుకునే వారే లేరు. విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది. బేకరీలో బ్రెడ్ కొనుక్కొని తెచ్చుకోవడానికి 3 గంటలు క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. కిలోమీటర్ దూరంలో ఉండే ఆఫీసుకి వెళ్లడం కూడా అందరికీ కష్టమవుతోంది. ఇల్లు కదిలి కాలు బయట పెడితే ప్రాణాలతో బతికి ఉంటారన్న నమ్మకం లేదు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా వీధుల్లో వినిపిస్తున్న కాల్పుల మోతలతో బయటకి అడుగుపెట్టే ధైర్యం చేయడం లేదని 65 ఏళ్ల వయసున్న అబ్బాస్ చెప్పారు. సూడాన్ పాలకులకు ప్రజల ప్రాణాలపై కనీస గౌరవం కూడా లేదని ఆయన మండిపడ్డారు. ‘‘వేలాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో సరుకులు అయిపోతున్నా, మంచినీరు, కరెంట్, మందులు వంటివి లేకపోయినా బయటకు వచ్చే పరిస్థితి లేదు’’అని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ వోల్కర్ టిర్క్ చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు బషీర్ పాలనలో అంతర్యుద్ధంలోనే ప్రజలు గడిపారు. పేదరికం, అణచివేతను ఎదుర్కొంటూ దుర్భర పరిస్థితుల్ని చూశారు. ఇప్పుడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందన్న వారి ఆశలు అడియాసలుగా మారాయి. ఎవరిది పై చేయి? బుర్హాన్, హెమెడ్తీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇద్దరికి ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. ఆర్ఎస్ఎఫ్ను ఒక తిరుగుబాటు సంస్థగా ముద్రవేసిన బుర్హాన్ వెంటనే దానిని రద్దు చేయాలని పట్టు బడుతున్నారు. మరోవైపు హెమెడ్తీ బుర్హాన్‌ను క్రిమినల్‌గా అభివర్ణిస్తున్నారు. బషారీ పాలన నుంచి విముక్తి పొందినా దేశంలో శాంతి స్థాపన జరగకపోవడానికి ఆయనే కారణమని నిందిస్తున్నారు. సూడాన్ ఆర్మీలో 3 లక్షల మంది సైనికులతో వైమానిక బలగం కూడా దాని సొంతం. ఆర్ఎస్ఎఫ్లో లక్ష మంది సైనికులే ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎఫ్కు సూడాన్ పశ్చిమ ప్రాంతంలో గిరిజన తెగల అండదండలు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఇద్దరు బలవంతులు కొట్టుకుంటూ ఉంటే ఎలా స్పందించాలో తెలీక మౌనం వహిస్తోంది. మానవీయ సంక్షోభం రాకుండా చర్యలు తీసుకోవాలని వారికి సలహా ఇవ్వడం మినహా మరేమీ చేయలేకపోతోంది. సూడాన్ జనాభా: 4.6 కోట్లు కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో నివసిస్తున్నవారు: 1.2 కోట్లు మానవీయ సాయం కావాల్సిన వారు: 1.6 కోట్ల ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు: 1.17 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంటోన్మెంట్ రోడ్లను తెరిపించండి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మిలిటరీ అధికారులు మూసివేసిన అలహాబాద్ గేట్ రోడ్, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్లను వెంటనే తెరిపించాలని కోరుతూ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం లేఖ రాశారు. కోవిడ్ కారణం చూపుతూ రోడ్లను మూసివేయడంతో ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా కేసులు తగ్గాయని, అయినా మళ్లీ రోడ్లను మూసివేయడం అత్యంత బాధాకరమన్నారు. రోడ్లను ఇష్టారీతిన మూసివేయకుండా మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై గతంలోనూ కేంద్రానికి లేఖలు రాసినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. స్థానిక కంటోన్మెంట్ బోర్డును సంప్రదించకుండానే లోకల్ మిలటరీ అథారిటీ రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ చట్టంలోని సెక్షన్–258కి ఇది విరుద్ధమని తెలిపారు. గతంలో ఈ అంశాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకురావడంతో కంటోన్మెంట్ బోర్డుతో సంబంధం లేకుండా రోడ్లను మూసివేయవద్దని ఇచ్చిన ఆదేశాలను సైతం స్థానిక మిలిటరీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. స్థానిక మిలిటరీ అథారిటీ పరిధిలో ఉన్న రోడ్లపైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే అంశంపై గతంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, అందులో సూచనప్రాయంగా అంగీకరించారని పేర్కొన్నారు. -
మహిళా సైనికాధికారుల కమిషన్ గడువు మరో నెల పెంపు
న్యూఢిల్లీ: మహిళా సైనికాధికారులకు ప్రత్యేకంగా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు తీర్పు మరో నెల రోజుల గడువునిచ్చింది. గత తీర్పులో ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో నిర్ణయం తుది దశలో ఉందనీ, కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే మిగిలి ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాల్లోని ప్రతి విషయాన్నీ తు.చ.తప్పకుండా పాటిస్తామని కేంద్రం పేర్కొంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. లింగ వివక్షను నిర్మూలించేందుకు మహిళాసైనికాధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 17న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల లోపు పర్మనెంట్ కమిషన్ ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. -
పాక్ కాల్పుల్లో ఆర్మీ అధికారుల మృత్యువాత
శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దుకు అవతలి వైపు నుంచి పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత్ సైనికాధికారులు మృతి చెందారు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి(ఎల్వోసీ) శుక్రవారం పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారులు(జేసీవోలు) ఇద్దరు నేలకొరిగారని సైన్యం తెలిపింది. పాక్ దుశ్చర్యను భారత్ బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయని పేర్కొంది. -
ఆయనకు ట్రంప్ సెల్యూట్: సమర్ధించిన వైట్‌హౌస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక భేటీలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉత్తర కొరియా ప్రతినిధులను ట్రంప్‌కి కిమ్ పరిచయం చేస్తుండగా.. ట్రంప్ అందరికి కరచలనం చేస్తూ వచ్చారు. చివర్లో మిలటరీ త్రీ స్టార్ జనరల్ నో క్వాంగ్ చోల్ వద్దకు రాగానే ట్రంప్ అతనికి కరచలనం చేయబోగా.. చోల్ మాత్రం ట్రంప్‌కు సెల్యూట్ చేశాడు. దీంతో ట్రంప్ అతనికి తిరిగి సెల్యూట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. వెంటనే ఈ వీడియో వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి మరో దేశ మిలటరీ అధికారికి సెల్యూట్ చేయడంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సౌదీ రాజును కలసినప్పుడు తీవ్ర వ్యాఖ్యాలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఏం చెబుతారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అమెరికా నేవీ రిటైర్డ్ అధికారి జేమ్స్ స్టావిరిస్ స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాల మిలటరీకి సెల్యూట్ చేయడం తాను చూడలేదన్నారు. దీనిని పొరపాటు చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్ మాత్రం ట్రంప్ చర్యను సమర్ధించింది. ఒక దేశ మిలటరీ అధికారి సెల్యూట్ చేసినప్పుడు తిరిగి సెల్యూట్ చేయడం కనీస మర్యాద అని ట్రంప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
1700 మంది పైగా ఆర్మీ ఆఫీసర్లపై వేటు
ఆంకారా: తిరుగుబాటుకు విఫలయత్నం చేసిన సైనిక అధికారులపై టర్కీ ప్రభుత్వం కొరగా ఝుళిపించింది. 1700 మంది పైగా ఆర్మీ అధికారులను విధుల నుంచి తొలగించింది. డజన్ల సంఖ్యలో మీడియా సంస్థలను మూయించేసింది. జూలై 15, 16 తిరుగుబాటుతో సంబంధం ఉన్న సైనికాధికారులను సామూహికంగా తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో 87 మంది ఆర్మీ జనరల్స్, 30 మంది వైమానిక దళ జనరల్స్, 32 మంది అడ్మిరల్స్ తో పాటు నావికాదళం అధికారులు ఉన్నారు. వీరిలో చాలా మంది తిరుబాటు సందర్భంగా అరెస్టై జైల్లో ఉన్నారు. 45 న్యూస్ పేపర్లు, 60 టీవీ చానళ్లు, 23 రేడియో స్టేషన్లు, మూడు న్యూస్ ఏజెన్సీలు, 15 మేగజీన్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు అధికారిక వార్తా సంస్థ తెలిపింది. అయితే వీటి పేర్లు వెల్లడించలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రభుత్వం రంగ ఉద్యోగులతో కలిసి సైన్యంలోని ఒక వర్గం చేసిన తిరుగుబాటును టర్కీ ప్రజలు తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. -
1 నుంచి కంటోన్మెంట్ రోడ్లు బంద్
-స్థానిక సైనికాధికారుల నిర్ణయం -ఏడాది వాయిదాకు కేటీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: జూన్ 1 నుంచి హైదరాబాద్ కంటోన్మెంట్ రోడ్లను మూసివేయాలని సైనికాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో నిత్యం పదిలక్షల మంది ప్రయాణికుల రాకపోకలపై ప్రత్యక్ష ప్రభావం పడబోతుంది. ఆర్మీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్ష ణమే ఆర్మీ అధికారులతో సమావేశమై ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేసుకునే వరకు కంటోన్మెంట్ రోడ్ల మూసివేతను వాయిదా వేసుకోవాలని, ప్రత్యమ్నాయ రోడ్లకు కావల్సిన ఆర్మీ భూముల సేకరణకు సహకరించే విధంగా ఒప్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డితో బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థాయిలో స్వయం గా తనే రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో మాట్లాడుతానన్నారు. గవర్నర్ నరసింహన్ కూడా ఈ అంశంపై ఢిల్లీలోని సైనికాధికారులతో చర్చించారని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యమ్నాయ రోడ్లు ఏర్పాటు చేసుకునే వరకు ఏడాది సమయం పడుతుందని, అప్పటి వరకు కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై పునరాలోచించాలని ఆర్మీ అధికారులకు కోరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సైనికాధికారుల మధ్య జరిగే సాధారణ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. రోడ్ల మూసివేతపై ఎలాంటి నిర్ణ యం తీసుకున్నా హైదరాబాద్‌లోని ఆర్మీతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీల మధ్య ప్రజల సౌకర్యార్థం పరస్పర సమన్వయం అవసరమన్నారు. నిత్యం లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం చూపే ఈ సమస్యను ఆర్మీ అధికారులు అషామాషీగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. -
అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్రివిద దళాల సైనికాధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం రక్షణ శాఖ వార్ రూమ్‌లో ఈ భేటీ జరిగింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితుల్లో మోడీ సైన్యాధికారులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే దేశానికి రక్షణ అవసరమని మోడీ అన్నారు. దౌత్య, రక్షణ విషయాల్లో కొత్త ఆలోచనా విధానం అవసరమని చెప్పారు. ఆకాశం, భూమి, జలాలపై నియంత్రణ కంటే అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక సైనిక దళాల ప్రధానాధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, త్రివిద దళాల అధిపతులు పాల్గొన్నారు. -
సైనికాధికారులతో మోడీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత సైనికాధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం రక్షణ శాఖ వార్ రూమ్‌లో ఈ భేటీ జరిగింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితుల్లో మోడీ సైన్యాధికారులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక సైనిక దళాల ప్రధానాధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. త్రివిద దళాధిపతులు దేశ రక్షణకు సంబంధించి మోడీకి నివేదిక సమర్పించనున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సు ష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, త్రివిద దళాల అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహ, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ కే ధోవన్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ పాల్గొన్నారు.