
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్‌తో పాటు
మరో ఇద్దరి తొలగింపు
యూనిఫామ్ సర్వీసు మినహా ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గించాలని నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముగ్గురు కీలక సైనాధికారులకు ఉద్వాసన పలికారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ చార్లెస్ సీక్యూ బ్రౌన్(ఛార్లెస్ క్వింటన్ బ్రౌన్) జూనియర్‌పై హఠాత్తుగా వేటువేశారు. ఎయిర్‌ఫోర్స్ జనరల్ అయిన బ్రౌన్ గత 16 నెలలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అత్యంత కీలకమైన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ పదవిని అధిరోహించిన రెండో నల్లజాతి అధికారిని ఉన్నట్టుండి పదవి నుంచి తొలగించడం అమెరికా సైనిక వర్గాల్లో సంచలనాత్మకంగా మారింది.
‘‘అమెరికాకు 40 ఏళ్లకుపైగా సేవలందిస్తున్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్ జూనియర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన ఒక గొప్ప అధికారి. సైన్యాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించిన నాయకుడు. బ్రౌన్‌తోపాటు ఆయన కుటుంబం భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’అని సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పోస్టు చేశారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ నూతన చైర్మన్‌గా రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డాన్ రజిన్ కెయిన్‌ను నామినేట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని పోలీసులు హత్య చేసినప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు.
వర్ణవివక్ష పూర్తిగా అంతం కావాలని డిమాండ్ చేశారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’పేరిట జరిగిన ఉద్యమానికి చార్లెస్ సీక్యూ బ్రౌన్ జూనియర్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. నల్లజాతి ప్రజల పట్ల ఆయన సానుభూతి చూపుతుంటారు. అమెరికా సైన్యంలో బ్రౌన్ వ్యతిరేకులు చాలామందే తయారయ్యారు. సైనిక వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని, అవసరం లేదని సిబ్బందిని ఇంటికి సాగనంపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే బ్రౌన్‌కు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరో ఇద్దరు సీనియర్ సైనిధికారులను పదవి నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్ వెల్లడించారు. నావల్ ఆపరేషన్స్ చీఫ్ అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టీ, స్టాఫ్ ఆఫ్ ద ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ జనరల్ జిమ్ స్లైఫ్‌ను పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
5,400 మంది ప్రొబేషనరీ
సిబ్బందికి ఉద్వాసనే సైన్యంలో పనిచేస్తున్న 5,400 మంది ప్రొబేషనరీ వర్కర్స్‌కు ఉద్వాసన పలకబోతున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. వచ్చేవారం నుంచే వారిని తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టంచేసింది. నూతన నియామకాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఏడాది కంటే తక్కువ కాలం పని చేసినవారిని తొలగించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. ఇలాంటి వారికి సివిల్ సర్వీసు ప్రొటెక్షన్ ఉండదు. సైన్యంలో యూనిఫామ్ సర్వీసు మినహా ఇతర విభాగాల్లో 5 నుంచి 8 శాతం సిబ్బందిని తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు యూఎస్ ఫారెస్టు సర్వీసు నుంచి దాదాపు 2 వేల మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించింది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసులో పనిచేస్తున్న 7 వేల మందిపై త్వరలో వేటు వేయబోతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల తొలగింపుపై రక్షణ మంత్రి హెగ్సెత్ గతవారం సోషల్ మీడియాలో నర్మగర్భమైన పోస్టు చేశారు. ‘‘శరీరం నుంచి అనవసరమైన కొవ్వును తొలగించుకుంటే కండరాలు బలపతాయి’’అని పేర్కొన్నారు. సైన్యంలో కొన్ని కార్యక్రమాలకు కత్తెర వేసి 50 బిలియన్ డాలర్లు ఆదా చేయాలని ఆదేశించారు. ఈ సొమ్మును అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యతల జాబితాలో ఉన్న కార్యక్రమాలకు మళ్లించాలని పేర్కొన్నారు. 50 బిలియన్ డాలర్లు అంటే అమెరికా సైనిక బడ్జెట్‌లో 8 శాతం.
Comments
Please login to add a commentAdd a comment