
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మిలిటరీ అధికారులు మూసివేసిన అలహాబాద్ గేట్ రోడ్, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్లను వెంటనే తెరిపించాలని కోరుతూ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం లేఖ రాశారు. కోవిడ్ కారణం చూపుతూ రోడ్లను మూసివేయడంతో ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా కేసులు తగ్గాయని, అయినా మళ్లీ రోడ్లను మూసివేయడం అత్యంత బాధాకరమన్నారు.
రోడ్లను ఇష్టారీతిన మూసివేయకుండా మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై గతంలోనూ కేంద్రానికి లేఖలు రాసినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. స్థానిక కంటోన్మెంట్ బోర్డును సంప్రదించకుండానే లోకల్ మిలటరీ అథారిటీ రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ చట్టంలోని సెక్షన్–258కి ఇది విరుద్ధమని తెలిపారు. గతంలో ఈ అంశాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకురావడంతో కంటోన్మెంట్ బోర్డుతో సంబంధం లేకుండా రోడ్లను మూసివేయవద్దని ఇచ్చిన ఆదేశాలను సైతం స్థానిక మిలిటరీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. స్థానిక మిలిటరీ అథారిటీ పరిధిలో ఉన్న రోడ్లపైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే అంశంపై గతంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, అందులో సూచనప్రాయంగా అంగీకరించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment