1700 మంది పైగా ఆర్మీ ఆఫీసర్లపై వేటు
ఆంకారా: తిరుగుబాటుకు విఫలయత్నం చేసిన సైనిక అధికారులపై టర్కీ ప్రభుత్వం కొరగా ఝుళిపించింది. 1700 మంది పైగా ఆర్మీ అధికారులను విధుల నుంచి తొలగించింది. డజన్ల సంఖ్యలో మీడియా సంస్థలను మూయించేసింది. జూలై 15, 16 తిరుగుబాటుతో సంబంధం ఉన్న సైనికాధికారులను సామూహికంగా తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో 87 మంది ఆర్మీ జనరల్స్, 30 మంది వైమానిక దళ జనరల్స్, 32 మంది అడ్మిరల్స్ తో పాటు నావికాదళం అధికారులు ఉన్నారు. వీరిలో చాలా మంది తిరుబాటు సందర్భంగా అరెస్టై జైల్లో ఉన్నారు.
45 న్యూస్ పేపర్లు, 60 టీవీ చానళ్లు, 23 రేడియో స్టేషన్లు, మూడు న్యూస్ ఏజెన్సీలు, 15 మేగజీన్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు అధికారిక వార్తా సంస్థ తెలిపింది. అయితే వీటి పేర్లు వెల్లడించలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రభుత్వం రంగ ఉద్యోగులతో కలిసి సైన్యంలోని ఒక వర్గం చేసిన తిరుగుబాటును టర్కీ ప్రజలు తిప్పికొట్టిన సంగతి తెలిసిందే.