సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన మాజీ సైనికోద్యోగికి సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్ ద్వారా వల వేశారు. కొన్ని బహుమతులతో పాటు టర్కీ ట్రిప్ గెలుచుకున్నారంటూ ఎర వేశారు. వివిధ రకాల పేర్లు చెప్పి రూ.లక్షలు కాజేశారు. ఈ వ్యవహారంలో డీమానిటైజేషన్, జీఎస్టీలనూ సదరు క్రిమినల్స్ ‘వాడేశారు’. తర్వాత అదే ముఠాకు చెందిన మరో బృందం రంగంలోకి దిగి పోగొట్టుకున్న డబ్బు తిరిగి ఇప్పిస్తామంటూ మరికొంత కాజేసింది. మొత్తమ్మీద నాలుగేళ్లల్లో రూ.1.16 కోట్లు కోల్పోయిన బాధితుడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. స్నేహితులు భరోసా ఇవ్వడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసి ఓ నిందితుడిని ఢిల్లీలో అరెస్టు చేశారు.
ట్రిప్పు నుంచి నగదు అంటూ...
సికింద్రాబాద్‌లోని లోతుకుంట ప్రాంతానికి చెందిన విఠల్ మోహన్‌రావు మాజీ సైనికోద్యోగి. ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసి ఈయన హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నంలోనూ అనేక రైల్వే కాంట్రాక్టులు చేస్తున్నారు. అతడికి 2014లో షాప్ చెర్రీస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో ఓ ఈ–మెయిల్ వచ్చింది. మీరు కొన్ని బహుమతులతో పాటు టర్కీ వెళ్లి వచ్చేందుకు ట్రిప్ గెలుచుకున్నారంటూ అందులో ఉంది. అవి క్లైమ్ చేసుకోవడానికి పూర్తి వివరాలను పంపాల్సిందిగా ఆ సంస్థ కోరింది. దీంతో అతడు వివరాలు పంపారు. ఓ వ్యక్తి కాల్ చేసి ట్రిప్‌తో పాటు బహుమతుల్ని క్లెయిమ్ చేసుకోవడానికి రూ.2.4 లక్షలు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు. కొన్ని రోజులకు రూ.25 వేలు విలువ చేసే బహుమతుల్ని విఠల్ చిరునామాకు పంపిన సైబర్ నేరగాళ్లు ఆయనకు నమ్మకం కలిగించారు. మరోసారి ఫోన్ చేసిన రాహిల్ టర్కీ ట్రిప్‌కు బదులు లక్షల నగదు బహుమతిగా ఇస్తామంటూ పలుమార్లు లక్షల రూపాయలను తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు.
బెంగళూరుకు ఫైల్ వచ్చిందంటూ...
విఠల్‌ను మరోసారి సంప్రదించిన సైబర్ నేరగాళ్లు బహుమతి మొత్తం రూ.1.2 కోట్లకు పెరగడంతో పాటు క్లైమ్‌కు సంబంధించిన ఫైల్ బెంగళూరులోని ఆర్బీఐ కార్యాలయానికి చేరిందంటూ చెప్పారు. నగదు మీ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ కావాలంటే వివిధ చార్జీలు చెల్లించాలంటూ తాము షాప్ చెర్రీస్ అధిపతులమంటూ ఎస్‌ఎం సవ్వాల్, ఆర్‌ఎన్ కంహార్‌గా చెప్పుకున్న ఇద్దరు లక్షల రూపాయలు గుంజారు. 2014–16 వరకు ఎనిమిది సంస్థల పేరుతో సంభాషించిన 18 మంది రూ.87 లక్షల్ని తమ బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.
‘ఇండియా టుడే’ అంటూ మరో టీమ్...
తాము ‘ఇంటియా టుడే’ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని, మిమ్మల్ని మోసం చేసిన సంస్థ నుంచి మీకు రావాల్సిన రూ.87 లక్షలను ఇప్పిస్తామంటూ అందుకు మరో రూ.29 లక్షలు చెల్లించాలంటూ వాటిని ఖాతాలో వేయించుకున్నారు. సైబర్ నేరగాళ్లకు రూ.1.16 కోట్లు చెల్లించిన విఠల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు వినియోగించిన 37 బ్యాంకు ఖాతాలతో పాటు వారు వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేశారు.
కాల్ సెంటర్ నుంచి ఫోన్లు...
ఢిల్లీకి చెందిన సుమిత్ మాలిక్, ప్రదీప్ ప్రసాద్‌తో పాటు పలువురి ఖాతాల్లోకి డబ్బు వెళ్లినట్లు గుర్తించారు. ఢిల్లీలో ప్రదీప్ ప్రసాద్ ఒక కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి అమాయకులకు ఫోన్లు చేసి చీటింగ్ చేస్తున్నట్లు తేల్చారు. ఇందులో సుమిత్ మాలిక్‌తో పాటు అతడి సోదరి జ్యోతి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో అభిషేక్, అడి, రాఘవ్, చందర్, పంకజ్ తదితరులు ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రత్యేక బృందం సుమిత్ ఖాతాను ఆధారంగా తీసుకొని అదుపులోకి తీసుకొని విచారించారు. సుమిత్‌ను అదుపులోకి తీసుకున్న విషయాన్ని అతడి కుటుంబ సభ్యులు ప్రదీప్ ప్రసాద్‌కు సమాచారం ఇవ్వడంతో అతడు ఢిల్లీ వదిలి పరారయ్యాడు. కీలక నిందితుడు ప్రదీప్ ప్రసాద్ పరారవడంతో సుమిత్ మాలిక్‌ను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment