ఇస్లామాబాద్ : 26/11 ముంబై దాడులకు పాల్పడింది పాకిస్థానేనని అంగీకరిస్తూ ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో షరీఫ్ మాట మార్చారు. ముంబై దాడులపై తన వ్యాఖ్యలను మీడియా పూర్తిగా వక్రీకరించి.. తప్పుగా ప్రచురించిందని ఆయన చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయని నవాజ్ షరీఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంగీకరించిన సంగతి తెలిసిందే. రాజ్యేతర శక్తులైన ఉగ్రవాద మూకలను సరిహద్దులు దాటించి.. ముంబైలో ప్రజల్ని చంపేందుకు ఉసిగొల్పారని తన పరోక్షంగా పాక్ ప్రభుత్వం ప్రమేయముందని పేర్కొన్నారు. ముంబై దాడుల నేపథ్యంలో పాక్ తనకు తానే ఏకాకి అయిందని ఆయన అన్నారు.
‘నవాజ్ షరీఫ్ ప్రకటనను భారత మీడియా పూర్తిగా తప్పుగా వ్యాఖ్యానిస్తూ ప్రచురించింది. దురదృష్టవశాత్తు పాకిస్థాన్‌లోని ఓ సెక్షన్ మీడియా, సోషల్ మీడియా కూడా భారత మీడియా చేసిన దురుద్దేశపూరిత ప్రచారాన్ని నమ్మి.. అదే నిజమైనట్టు ప్రచారం చేశారు. ఆయన ప్రకటనలోని నిజానిజాలు పట్టించుకోలేదు’ అని షరీఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పాక్ జాతీయ భద్రత విషయంలో దేశ అత్యున్నత రాజకీయ పార్టీ అయిన పీఎంఎల్‌ఎన్‌కుగానీ, ఆ పార్టీ అధినేత షరీఫ్‌కుగానీ ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పుకొచ్చారు.
6/11 ముంబై పేలుళ్లు తమ దేశం పనేనని ఇటీవల డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజ్ షరీఫ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ముంబైలో మారణహోమం నిర్వహించింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని ఆయన తొలిసారి అంగీకరించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి పాకిస్థానేనని పరోక్షంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment