నవాజ్‌ షరీఫ్‌ అరెస్ట్‌ | Pakistan's former PM Nawaz Sharif, daughter Maryam arrested in Lahore | Sakshi
Sakshi News home page

నవాజ్‌ షరీఫ్‌ అరెస్ట్‌

Published Sat, Jul 14 2018 3:44 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Pakistan's former PM Nawaz Sharif, daughter Maryam arrested in Lahore - Sakshi

లాహోర్‌ విమానాశ్రయంలో షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు

లాహోర్‌: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్వదేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కూతురు మరియమ్‌ అరెస్టయ్యారు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌కు పదేళ్లు, మరియమ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం రాత్రి లాహోర్‌ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఎదురుచూస్తున్న షరీఫ్‌ తల్లిని కలుసుకునేందుకు వారికి అనుమతిచ్చారు. తర్వాత ఇద్దరినీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇస్లామాబాద్‌కు తరలించారు. అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటుచేసిన సీహాలా రెస్ట్‌ హౌజ్‌కు తీసుకెళ్లారు.  

లాహోర్‌లో ఉత్కంఠ..
 పాక్‌కు రాగానే షరీఫ్‌ను అరెస్ట్‌ చేస్తామని అధికారులు ప్రకటించడంతో లాహోర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 300 మంది షరీఫ్‌ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్‌ వెళ్లే అన్ని దారులను మూసివేశారు. విమానాశ్రయానికి రాకపోకలపై ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్‌ అమల్లో ఉన్నా షరీఫ్‌ సోదరుడు షాబాజ్‌ తన అనుచరులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలో షరీఫ్‌ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు.

లాహోర్‌లో మొబైల్, ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. లండన్‌ నుంచి పాకిస్తాన్‌కు బయల్దేరిన షరీఫ్, మరియమ్‌లు మూడు గంటలు ఆలస్యంగా లాహోర్‌ చేరుకున్నారు. లండన్‌ నుంచి అబుదాబికి నిర్ణీత సమయంలోనే చేరుకున్నా అక్కడి నుంచి లాహోర్‌ రావాల్సిన విమానం ఆలస్యంగా బయల్దేరింది. ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టడం మంచి నిర్ణయమేనా? అని అబుదాబి విమానాశ్రయంలో విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించగా..దేశంలోని పరిస్థితుల గురించి తనకు తెలుసని అన్నారు. దేశ తలరాత మార్చేందుకే తాను తిరిగొస్తున్నట్లు చెప్పారు.

గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకే..
అంతకుముందు, నవాజ్‌ షరీఫ్‌ తన దేశ పౌరులనుద్దేశించి ప్రసంగించిన వీడియోను మరియమ్‌ ట్వీట్‌ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశ భవిష్యత్తును మార్చడానికి తనకు మద్దతుగా నిలవాలని షరీఫ్‌ కోరారు. ‘అసలు ఇందులో కేసు లేదు, తీర్పు లేదు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఆటలు ఆడుతున్నారు. నాకు వ్యతిరేకంగా కేసులే లేవు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకున్నాను కాబట్టే.. ఫిక్సింగ్‌కు పాల్పడి రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచడానికి పనామా పత్రాల కేసును తెరపైకి తెచ్చారు.

నేనేం చేయాలో అదే చేశాను. నాకు పదేళ్ల శిక్ష పడిందని తెలుసు. పాక్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే జైలుకు తరలిస్తారని తెలుసు. నేను చేస్తున్నదంతా మీకోసమేనన్న సంగతిని గ్రహించండి’ అని అన్నారు. పంజాబ్‌ ప్రావిన్సులో తన అనుచరులపై కొనసాగుతున్న అణచివేత..ప్రభుత్వానికి తానంటే ఉన్న భయాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. అందుకే లాహోర్‌ విమానాశ్రయానికి వేలాది మంది మంది మద్దతుదారులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో తన తల్లి వెంటిలేటర్‌పై ఉన్న చిత్రాలను కూడా మరియమ్‌ పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement