heavy rally
-
బీజేపీ, టీఎంసీలను ఓడించాలి
కోల్‌కతా: లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సంయుక్తంగా ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. మతతత్వ ప్రభుత్వాలను ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రజలకు జనహిత సర్కారును అందిస్తామని హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధికి, ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నాయి. ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీల మధ్య పోటీ మాత్రమే కాదని, మూడో పక్షంగా తమ కూటమి కూడా బరిలో ఉందని కాంగ్రెస్ నేత ఆధిర్ చౌధురి పేర్కొన్నారు. బీజేపీ, టీఎంసీలను ఓడించి తీరుతామన్నారు. మరోవైపు, ఈ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఎన్నికల తరువాత టీఎంసీ జీరో అవుతుందని ఐఎస్ఎఫ్ చీఫ్ అబ్బాస్ సిద్దిఖీ వ్యాఖ్యానించారు. కూటమిలో సీట్ల పంపకాలను ఉద్దేశిస్తూ.. ఐఎస్ఎఫ్ న్యాయబద్ధ వాటా సాధిస్తుందని కాంగ్రెస్, వామపక్షాలను పరోక్షంగా హెచ్చరించారు. ‘బీజేపీ, టీఎంసీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. మతపరంగా ప్రజలను విడదీయడమే వాటి లక్ష్యం. ప్రజలకు అభివృద్ధిదాయక పాలన మా కూటమే అందివ్వగలదు’ అని రాష్ట్ర సీపీఎం కార్యదర్శి సూర్యకాంత మిశ్రా పేర్కొన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే టీఎంసీ బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏలో చేరేందుకు కూడా వెనుకాడరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఎన్డీఏలో గతంలోనూ టీఎంసీ భాగస్వామిగా ఉందన్న విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు. బీజేపీ, టీఎంసీల మధ్య ప్రస్తుతం జరిగేది ఉత్తుత్తి యుద్ధమేనన్నారు. -
హ్యాండ్సప్.. డోంట్ షూట్!
హ్యూస్టన్: జార్జ్ ఫ్లాయిడ్‌కు సంఘీభావంగా హ్యూస్టన్‌లో జరిగిన ర్యాలీలో సుమారు అరవై వేల మంది పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకానికి బలైన ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగర మేయర్ సిల్వస్టర్ టర్నర్, ఎంపీ షీలా జాక్సన్, లిజ్జీ ఫ్లెచర్, సిల్వియా గార్సియా అల్ గ్రీన్‌లతోపాటు కొంతమంది ర్యాప్ గాయకులు ర్యాలీలో పాల్గొని తమ నివాళులు అర్పించారు. ‘హ్యాండ్స్ అప్.. డోంట్ షూట్’, ‘నో జస్టిస్, నో పీస్’అని నినదిస్తూ ర్యాలీ హ్యూస్టన్ నగరం గుండా సాగింది. డిస్కవరీ గ్రీన్ పార్క్ నుంచి సిటీహాల్ వరకూ ఉన్న మైలు దూరం ఈ ర్యాలీ నడిచింది. అయితే సూర్యాస్తమయం తరువాత ఈ ర్యాలీ కాస్తా ఆందోళనలకు దారితీసిందని, ఖాళీ నీటిబాటిళ్లతో విసరడంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ర్యాలీ ప్రారంభానికి ముందు అందరూ మోకాళ్లపై నిలబడి కాసేపు ప్రార్థనలు చేయగా హ్యూస్టన్ పోలీస్ అధికారులు ఇదే తరహాలో వ్యవహరించడం విశేషం. పోలీస్ అధికారి ఆర్ట్ ఎసివిడో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. జార్జ్ ఫ్లాయిడ్ భార్య రాక్సీ వాషింగ్టన్ మాట్లాడుతూ ఆరేళ్ల తన కుమార్తె గియానా మంచి తండ్రిని కోల్పోయిందన్న విషయాన్ని ప్రపంచం గుర్తించాలని వాపోయింది. వీధుల్లో ప్రశాంతత.. వారం రోజులపాటు అల్లర్లు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన అమెరికన్ నగర వీధుల్లో ఎట్టకేలకు కొంత ప్రశాంతత నెలకొంది. మంగళవారం ప్రదర్శనలు జరిగినా చాలావరకూ అవి శాంతియుతంగా సాగాయి. ఆందోళనలకు సంబంధించి బుధవారంనాటికి మొత్తం 9,000 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. పౌరహక్కుల విచారణ.. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంబంధించి మినసోటా రాష్ట్రం మినియాపోలిస్ పలీస్ విభాగంపై పౌర హక్కుల విచారణ చేపట్టింది. మినసోటా మానవహక్కుల విభాగం కమిషనర్ రెబెకా లూసిరో, గవర్నర్ టిమ్ వాల్ట్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విచారణ ద్వారా పోలీసుల వివక్షాపూరిత చర్యలను గుర్తించి తాత్కాలికంగానైనా పరిష్కార చర్యలను అమల్లోకి తేవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అందరికీ న్యాయం అందించాలన్న అమెరికా సిద్ధాంతం ఎక్కడ? ఎందుకు విఫలమైందో పరిశీలించాల్సిన సమయం వచ్చిందని, జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతం ఇందుకు కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘లారా (బుష్ భార్య)తోపాటు నేను ఫ్లాయిడ్ ఉదంతంపై ఎంతో బాధపడ్డాం. అన్యాయమైన వ్యవహారాలు దేశం ఊపిరి తీసేస్తున్నాయి. అయినాసరే.. ఇప్పటివరకూ మాట్లాడకూడదనే నిర్ణయించాం. ఎందుకంటే ఇది లెక్చర్ ఇచ్చే సమయం కాదు. వినాల్సిన సమయం’అని బుష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా తన వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు. శాంతియుతంగా ఉండాలి: మెలానియా ఫ్లాయిడ్ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా స్పందించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలవారు, పౌరులందరూ సురక్షితంగా ఉండాలంటే శాంతి ఒక్కటే మార్గమని ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని మెలానియా ట్వీట్ చేశారు. ఒక రోజు ముందు మెలానియా ఇంకో ట్వీట్ చేస్తూ.. ఫ్లాయిడ్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ మతం ముసుగులో తనకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో ట్రంప్ మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తి ఏమీ కాదని, ప్రస్తుతం పదేపదే చర్చిలకు వెళ్లడం, బైబిల్ పట్టుకుని పోజులు ఇవ్వడం మత విశ్వాసాలు ఉన్న వారిని తమవైపు ఆకర్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా మీడియా విమర్శిస్తోంది. -
ర్యాలీ కొనసాగేనా!
ముంబై: దేశీ కార్పొరేట్ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే స్థాయి నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారాంతాన ప్రకటించిన నేపథ్యంలో సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్లు లాభపడ్డాయి. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్లు పెరిగాయి. కార్పొరేట్ రంగాన్ని సంభ్రమాశ్చర్యంలో పడేస్తూ శుక్రవారం ఆర్థిక మంత్రి భారీ పన్ను కోతను ప్రకటించారు. దేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి ఒక్కసారిగా 22 శాతానికి తగ్గించారు. సెస్సులతో కలుపుకుని 35 శాతం వరకు ఉన్న పన్ను రేటు ఏకంగా 25.17 శాతానికి దిగొస్తుందన్న వార్తలు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే శుక్రవారం దేశీ ప్రధాన స్టాక్ సూచీలు తారా జువ్వలా దూసుకుపోయాయి. పన్ను భారం తగ్గినందున లాభాలు పెరుగుతాయని భావించిన ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగారు. దీనికి షార్ట్ కవరింగ్ జత అయి లాభాలు మరింత పెరిగిపోయాయి. సూచీలు బలమైన ర్యాలీని నమోదుచేసినందున ఇదే ఉత్సాహం ఈ వారంలో కూడా కొనసాగేందుకు అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్సాహభరిత అంశాలు నెమ్మదించిన దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ భారత్ వైపు చూసే అవకాశం ఉందని విశ్లేషించారు. 11,500 పాయింట్లకు నిఫ్టీ..! ఆటో, రియల్టీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకుని ఈ వారంలో నిఫ్టీ 11,500 పాయింట్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కాపిటల్ఎయిమ్ రీసెర్చ్ హెడ్ రోమేష్ తివారీ అంచనావేశారు. సోమవారం నూతన లాంగ్స్ పెరిగి, షార్ట్ కవరింగ్ కొనసాగి నిఫ్టీ ఈ స్థాయికి చేరుకుంటుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. పన్ను రేటు తగ్గినందున కంపెనీల జూన్–సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ విశ్లేషించారు. లాభాల్లో కనీసం 10–15 శాతం పెరుగుదల ఉంటుందన్నారు. శుక్రవారం మార్కెట్ భారీ ర్యాలీని నమోదుచేసినందున ఈ స్థాయిల వద్ద నిలబడుతుందా లేదా అనే అంశానికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు కీలకంగా మారాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ విశ్లేషించారు. మరోవైపు శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ హోటల్ ట్యారిఫ్‌లపై పన్ను రేట్లను తగ్గించడంతో ఈ రంగ షేర్లలో కొనుగోలుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ సిరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ (ఎఫ్అండ్ఓ) డెరివేటివ్‌ల ముగింపు ఈ వారంలోనే ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు, అమెరికా క్యూ2 జీడీపీ గణాంకాలు వెల్లడి మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌లో రూ.4,193 కోట్లు ఉపసంహరణ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సెప్టెంబర్ 3–20 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,578 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్లో వీరు రూ. 1,384 కోట్లను పెట్టుబడి పెట్టారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.4,193 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్ పన్ను రేట్లు భారీగా తగ్గడంతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. తాజా పరిణామాలతో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్ విశ్లేషించారు. -
దోపిడీని ఆపినందుకే మహాకూటమి
సిల్వస్సా/గాంధీనగర్/ముంబై: దేశాన్ని దోచుకోకుండా ఆపినందుకే ప్రతిపక్షాలన్నీ ఏకమై ‘మహాకూటమి’గా ఏర్పడ్డాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమి దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి అని మండిపడ్డారు. కోల్‌కతాలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సభకు హాజరైన విపక్షనేతలపై పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వస్సాలో శనివారం ప్రధాని మోదీ వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాక సభలో మాట్లాడారు. ‘ప్రజాధనం దోపిడీకి, అవినీతిని అడ్డుకునేందుకు నేను తీసుకున్న చర్యలపై కొందరికి కోపం వచ్చింది. భయంతో వారంతా ఒక్కటయ్యారు’ అని మండిపడ్డారు. ‘మా పార్టీకి ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది. దీంతో రక్షించండంటూ ఆ పార్టీ నేతలు కేకలు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలను చంపేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగకుండా టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. యుద్ధట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభం ప్రైవేట్ రంగంలో దేశంలో ప్రప్రథమంగా గుజరాత్‌లోని హజీరాలో ఎల్ అండ్ టీ కంపెనీ ఏర్పాటు చేసిన కే9 వజ్ర–హొవిట్జర్ యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2017లో కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన రూ.4,500 కోట్ల ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ సంస్థ 42 నెలల్లో 100 కే9 యుద్ధట్యాంకులను అందించాల్సి ఉంది. ఇప్పటికే 10 ట్యాంకులను సైన్యానికి అందించింది. వీటి తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం ఆ సంస్థ దక్షిణ కొరియా హన్వ్హా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, 50 టన్నుల బరువుండే కే9 ట్యాంకు 47 కేజీల బరువైన బాంబును 43 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలపైకి పేల్చగలదు. మాతృమూర్తితో ప్రధాని ప్రధాని మోదీ శనివారం ఉదయం తన తల్లి హిరాబా(90)ను కలుసుకున్నారు. రైసన్ గ్రామంలో సోదరుడు పంకజ్ ఇంట్లో ఉంటున్న మాతృమూర్తితోపాటు ఇతర కుటుంబసభ్యులతో మోదీ ముచ్చటించారు. సినిమా మాదిరిగా దేశమూ మారుతోంది భారతీయ సినిమా ఇతివృత్తం కాలానుగుణంగా మారుతోందని మోదీ అన్నారు. ముంబైలో ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా’ ప్రారంభించిన అనంతరం పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరైన సభనుద్దేశించి మాట్లాడారు. ‘సినిమాలు, సమాజం పరస్పర ప్రతిబింబాలు. గతంలో పేదరికం, అసహాయతనే ఎక్కువగా చూపేవారు. నేడు సమస్యలతోపాటు వాటికి పరిష్కారాలనూ చూపుతున్నారు. లక్షల్లో సమస్యలుంటే కోట్లాది పరిష్కారాలు చూపుతున్నారు’ అని అన్నారు. ఈ మ్యూజియంలో రెండో ప్రపంచ యుద్ధంలో మన వీరుల త్యాగాలను కళ్లకు కట్టే 30 గంటల నిడివి గల డిజిటైజ్డ్ ఫుటేజీ ఉందని వెల్లడించారు. -
విపక్షాల సమరశంఖం
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు విపక్షాలు కలసికట్టుగా సమరశంఖం పూరించాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాడాలని ప్రతినబూనాయి. మోదీ ప్రభుత్వ విధానాలు, పనితీరుపై ముప్పేట దాడి చేశాయి. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, హస్తినలో ప్రభుత్వం మారాల్సిందేనని ముక్తకంఠంతో నినదించాయి. ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో శనివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమైంది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ సహా 20 ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విభేదాల్ని పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఎన్నికలు ముగిసిన తరువాతే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించారు. ర్యాలీకి టీఎంసీ కార్యకర్తలు లక్షల్లో వచ్చారు. కోల్‌కతా విపక్ష సభ సక్సెస్‌కావడంతో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఢిల్లీ, ఏపీ రాజధాని అమరావతిలోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వ గడువు తీరింది: మమతా మోదీ ప్రభుత్వంపై ఈ ర్యాలీకి అధ్యక్షత వహించిన మమత నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు రావాలంటే ఢిల్లీలో ప్రభుత్వం మారాలని ఉద్ఘాటించారు. సమష్టి నాయకత్వం గురించి తరచూ మాట్లాడే మోదీ, అమిత్ షాలు బీజేపీ సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, గడ్కరీ, రాజ్‌నాథ్ తదితరులకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలు సీబీఐ, ఆర్బీఐ, ఇతర విచారణ సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. మొండి బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయని, రఫేల్ లాంటి కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు. ఏకమవకుంటే అణచివేత తప్పదు: ఖర్గే కాంగ్రెస్ తరఫున హాజరైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే.. సోనియా పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. సోనియా, రాహుల్ గాంధీలు ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ‘మోదీ తాను తినకపోయినా తన కార్పొరేట్ స్నేహితులు అంబానీలు, అదానీలకు లబ్ధి చేకూరుస్తున్నారు. నోట్లరద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. గమ్యస్థానం చాలా దూరం ఉంది. దారి క్లిష్టంగా ఉంది. కానీ మనం అక్కడికి చేరాలి. మన మనసులు కలిసినా కలవకపోయినా, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ముందుకుసాగాలి’ అని ఓ హిందీ వాక్యంతో ఖర్గే ప్రసంగాన్ని ముగించారు. ఎలాగైనా బీజేపీని ఓడించాలి: కేజ్రీవాల్ కేంద్రంలో ప్రమాదకర బీజేపీని ఎలాగైనా ఓడించాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీ ప్రభుత్వాన్ని మార్చాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ ఒక్క సీటు(వారణాసి)నైనా ఎలా గెలుచుకోవాలో బీజేపీకి అర్థం కావడం లేదని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఓ వైపు అవినీతి గురించి మాట్లాడుతూనే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాల్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మోసగించిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. అది అవకాశవాదుల ర్యాలీ: బీజేపీ సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష ర్యాలీ.. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న అవకాశవాదుల సమావేశమని బీజేపీ అభివర్ణించింది. లోక్‌సభ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ద్వేషంతో ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి ఇష్టపడని నేతలు ఒక చోట చేరారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ ప్రశ్నించారు. ‘వారు మాట్లాడుతున్న కొత్త ఫ్రంట్ రెండోదా? మూడోదా? తెలియదు. ఈ పార్టీల్లో ఒకరినొకరు తిరస్కరించిన వారున్నారు. యూపీలో కాంగ్రెస్‌ను వద్దనుకున్న ఎస్పీ–బీఎస్పీ ఈ ర్యాలీలో పాల్గొనడం వారి అవకాశవాదాన్ని సూచిస్తోంది’ అని అన్నారు. హాజరైన పార్టీలు, నాయకులు.. తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్, కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఎన్సీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, టీడీపీ, ఆప్, లోక్తాంత్రిక్ జనతాదళ్, జీజేఎం, ఏఐడీయూఎఫ్, జోరం నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ మిజోరం, జేఎంఎం, పటీదార్ ఆందోళన్ సమితి, శత్రుఘ్న సిన్హా(బీజేపీ), జిగ్నేశ్ మేవానీ(దళిత ఎమ్మెల్యే), అరుణాచల్ మాజీ సీఎం గెగాంగ్ అపాంగ్(ఇటీవలే బీజేపీ నుంచి బయటికి వచ్చారు). ఈవీఎం ట్యాంపరింగ్‌పై నలుగురితో కమిటీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల పనితీరు, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడంపై సూచనలు చేసేందుకు నలుగురు విపక్ష నాయకులతో కమిటీ ఏర్పాటైంది. దీనిలో అభిషేక్ సింఘ్వీ(కాంగ్రెస్), అఖిలేశ్(ఎస్పీ), సతీశ్ మిశ్రా(బీఎస్పీ), కేజ్రీవాల్(ఆప్) ఉన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయబోయే ఈ కమిటీ ఎన్నికల సంస్కరణలపై ఈసీకి నివేదిక సమర్పిస్తుందని మమతా చెప్పారు. ఎన్నికలకు వ్యవధి తక్కువ ఉందని, సంస్కరణల్ని ఈసీ వెంటనే చేపట్టాలని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఉన్నపళంగా మళ్లీ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని తాము కోరడం లేదని, కానీ ఓట్ల లెక్కింపునకు వీవీప్యాట్ పద్దతిని విస్తృతం చేయాలని సింఘ్వీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు దెబ్బేనా? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలను ఒకతాటిపైకి తేవడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ప్రయత్నం సఫలమైంది. ఇదే స్ఫూర్తితో మహాకూటమి ఏర్పాటు యత్నాలు మరింత ముమ్మరమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే.. ప్రధాన విపక్షం కాంగ్రెస్ పాత్ర పెద్దగా లేకుండానే ప్రాంతీయ పార్టీలు కోల్‌కతాలో ఒకే వేదికపైకి వచ్చి ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. ఇలా ప్రాంతీయ పార్టీలు తమంతట తాము ఏకమవడం కాంగ్రెస్ బలం తగ్గిపోయిందనే సంకేతాన్నిస్తోంది. ఈ కోణంలో చూస్తే లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని మరింత తగ్గించే అవకాశాలున్నాయి. ప్రాంతీయ పార్టీలకు చుక్కాని లేదని, వాటికి ఓ దిశానిర్దేశం లేదని ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తున్నాయి. కానీ ఇటీవలి కాలంలో చిన్నా చితకా పార్టీలు కూడా ఎన్నికల తరువాత ఒప్పందం కుదుర్చోవడానికి గట్టిగానే బేరమాడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు లేకుండా తామెన్ని సీట్లు గెలుస్తామోనని లెక్కలేసుకుంటున్నాయి. కోల్‌కతా ర్యాలీతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రెండు ఫ్రంట్లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో కాగా, మరొకటి కాంగ్రెస్ రహిత ఫెడరల్ ఫ్రంట్(వేర్వేరు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కలసి ఏర్పాటుచేయబోయేది) అని భావిస్తున్నారు. ఇక కోల్‌కతా ర్యాలీ విషయానికి వస్తే..ఇతర నాయకులు 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడగా, ఆతిథ్యమిచ్చిన మమతా బెనర్జీ మాత్రం బెంగాలీలో సుమారు అరగంట సేపు ప్రసంగించారు. దీనిని బట్టి రాబోయే మహాకూటమి ర్యాలీల్లో స్థానిక పార్టీనే ఎక్కువ ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగితే ఆప్, చెన్నైలో డీఎంకే ప్రభావం ఎక్కువ ఉండొచ్చు. శనివారం కోల్‌కతాలో జరిగిన విపక్ష ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు ర్యాలీకి వచ్చిన ముఖ్యనేతలకు భోజనం వడ్డిస్తున్న మమతా బెనర్జీ -
కుంభమేళాలో కిన్నెర అఖాడా
ప్రయాగ్‌రాజ్: కుంభమేళా సందర్భంగా ట్రాన్స్జెండర్లతో కూడిన కిన్నెర అఖాడా సభ్యులు మంగళవారం పవిత్ర స్నానాలు ఆచరించి చరిత్ర సృష్టించారు. జునా అఖాడా సభ్యులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చిన కిన్నెర అఖాడా సభ్యులు త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఈ సందర్భంగా ‘హరహర మహాదేవ్’ అంటూ నినాదాలు మిన్నంటాయి. కార్యక్రమానికి హాజరైన వారంతా కిన్నెర అఖాడా సభ్యులను ఆసక్తిగా తిలకించారు. కాగా, కుంభమేళాకు ట్రాన్స్జెండర్లను అనుమతించడం ఇదే ప్రథమం. సంప్రదాయ వాదుల నుంచి వారికి గట్టి ప్రతిఘటన కూడా ఎదురైందని అఖాడా వర్గాలు తెలిపాయి. ‘ప్రాచీన భారతంలో ట్రాన్స్జెండర్లకు ఎలాంటి గౌరవం దక్కిందో మన మత గ్రంథాలు చెబుతున్నాయి. అప్పట్లో మాదిరిగా సమాజం మమ్మల్ని అంగీకరించేందుకే ఈ ప్రయత్నం. రానున్న తరాల వారు మా మాదిరిగా వివక్షకు గురి కాకుండా చూసేందుకే ఇక్కడికి వచ్చాం’ అని కిన్నెర అఖాడా అధిపతి లక్ష్మి నారాయణ్ త్రిపాఠీ(40) తెలిపారు. ‘ట్రాన్స్జెండర్లు బిచ్చగాళ్లుగానే ఉండాలని మీ రెందుకు భావిస్తున్నారు? ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సంస్థలు ఇష్టపడటం లేదు’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె పలు హిందీ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. మందిరం కోసం 33 వేల దీపాలు అయోధ్యలో రామాలయం నిర్మించాలంటూ కుంభమేళా సందర్భంగా సాధువులు రోజుకు 33వేల దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం కోసం ఈ నెలలో 11 లక్షల దీపాలను వెలిగించనున్నట్లు వారు తెలిపారు. కాగా, కుంభ్‌నగరిలో టాయిలెట్లు పనిచేయకపోవడంతో కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజు తరలివచ్చిన సుమారు కోట్ల మందిలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. -
మందిర నిర్మాణం మరవొద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ దిశగానే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పలు సంఘ్ పరివార్ సంస్థల ప్రతినిధులు సహా వేలాది మంది పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీహెచ్‌పీ నిర్వహించిన ఈ సభలో వేలాదిమంది రామభక్తులు, హిందూవాదులు పాల్గొన్నారు. కాషాయ రంగు టోపీలు ధరించి సభకు వచ్చిన వారంతా ‘మాకు శాంపుల్ వద్దు. టెంపుల్ కావాలి. రామరాజ్యం మళ్లీ తెస్తాం. మందిరం నిర్మిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టాలంటే చట్టం తీసుకురావడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మసభలో ప్రసంగిస్తున్న సాధ్వీ రితంభర అప్పటివరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని భయ్యాజీ తెలి పారు. సభలో ఆయన మాట్లాడుతూ ‘అయోధ్యలో రాముడి గుడి కడతామని ఈ రోజు అధికారంలో ఉన్నవారు గతంలో మాట ఇచ్చారు. మందిర నిర్మాణం డిమాండ్‌ను నెరవేర్చాలి. ఆలయాన్ని కట్టాలని మేం అడుక్కోవడం లేదు. మా భావాలను వ్యక్తపరుస్తున్నాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ‘న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయిన దేశం అభివృద్ధి పథంలో నడవదు. సుప్రీంకోర్టు ప్రజల మనోభావాలు/అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం ఏ మతంతోనూ గొడవ పడాలనుకోవడం లేదు’ అని భయ్యాజీ పేర్కొన్నారు. ‘మోదీని వదిలిపెట్టం’ హరిద్వార్‌కు చెందిన స్వామి హంసదేవాచార్య మాట్లాడుతూ రామ మందిరాన్ని కట్టకపోతే ప్రధాని మోదీని తాము వదిలిపెట్టబోమని అన్నారు. హామీ మోదీ నెరవేర్చాల్సిందేనని కోరారు. వీహెచ్‌పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోగ్జే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గౌరవించాలనీ, ప్రజలే సుప్రీం తప్ప కోర్టు కాదని అన్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ అయోధ్యలో రామమందిర నిర్మాణం డిమాండ్‌కు మద్దతు తెలపాలన్నారు. వీహెచ్‌పీ సభ నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామ్ లీలా మైదానంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రామ్‌లీలా మైదానంలోకి ప్రవేశిస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు -
అళగిరి బల ప్రదర్శన
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే బహిష్కృత నాయకుడు అళగిరి బుధవారం తన మద్దతుదారులు, అభిమానులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. అళగిరి బల ప్రదర్శనగా పేర్కొంటున్న ఈ యాత్ర చెన్నైలో వాలాజా రోడ్ జంక్షన్ నుంచి మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వరకు 1.5 కి.మీ. దూరం సాగింది. నలుపు రంగు చొక్కా, ధోవతి ధరించిన అళగిరి ఓపెన్ టాప్ వ్యానులో నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తుండగా, కరుణానిధి చిత్ర పటాల్ని చేతబట్టి, నల్ల చొక్కాలు, నెత్తిన పసుపు వర్ణం టోపీ ధరించి మద్దతుదారులు ర్యాలీలో ముందుకు సాగారు. అళగిరి కుమారుడు దురాయ్ దయానిధి, కూతురు కాయల్విజి, సన్నిహితులు మదురై మాజీ డిప్యూటీ మేయర్ పీఎం మణ్నన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. డీఎంకే పార్టీ నుంచి ప్రముఖ నాయకులెవరూ ర్యాలీలో పాల్గొనలేదు. యాత్ర ముగిశాక అళగిరి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ యాత్ర వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తన తండ్రికి నివాళులర్పించేందుకే ర్యాలీ చేపట్టినట్లు అళగిరి తెలిపారు. ధైర్యముంటే, యాత్రలో పాల్గొని తనకు మద్దతుతెలిపిన నాయకులు, కార్యకర్తలందరిపై వేటువేయాలని డీఎంకేకు సవాలు విసిరారు. -
బీజేపీ హఠావో.. దేశ్ బచావో
కోల్‌కతా: బీజేపీ హఠావో.. దేశ్ బచావో అంటూ బీజేపీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. దేశంలో ఉగ్రవాదం, హింస, ద్వేషపూరిత వాతావరాణాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి దేశాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు. తృణమూల్ పార్టీ అమరవీరుల వార్షిక దినోత్సవం సందర్భంగా శనివారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. మిడ్నాపూర్‌లో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో టెంట్ కూలి 90 మంది ప్రజలు గాయపడ్డ ఘటనపై ఆమె స్పందిస్తూ.. టెంట్ సరిగ్గా నిర్మించడం రాని వారు దేశాన్ని ఎలా నిర్మిస్తారంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకం చేసి బెంగాల్ వేదికగా జనవరిలో మెగా ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఈ ర్యాలీ నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తామని ఆమె ప్రకటించారు. బెంగాల్లో తృణమూల్‌ను కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం చేతులు కలిపాయన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు చందన్ మిత్రా, సీపీఐ(ఎమ్) మాజీ ఎంపీ మోయినుల్ హసన్ తృణమూల్‌లో చేరారు. -
నవాజ్ షరీఫ్ అరెస్ట్
లాహోర్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్వదేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియమ్ అరెస్టయ్యారు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌కు పదేళ్లు, మరియమ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం రాత్రి లాహోర్ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఎదురుచూస్తున్న షరీఫ్ తల్లిని కలుసుకునేందుకు వారికి అనుమతిచ్చారు. తర్వాత ఇద్దరినీ ప్రత్యేక హెలికాప్టర్లో ఇస్లామాబాద్‌కు తరలించారు. అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటుచేసిన సీహాలా రెస్ట్ హౌజ్‌కు తీసుకెళ్లారు. లాహోర్‌లో ఉత్కంఠ.. పాక్‌కు రాగానే షరీఫ్‌ను అరెస్ట్ చేస్తామని అధికారులు ప్రకటించడంతో లాహోర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 300 మంది షరీఫ్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్ వెళ్లే అన్ని దారులను మూసివేశారు. విమానాశ్రయానికి రాకపోకలపై ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్ అమల్లో ఉన్నా షరీఫ్ సోదరుడు షాబాజ్ తన అనుచరులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలో షరీఫ్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. లాహోర్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. లండన్ నుంచి పాకిస్తాన్‌కు బయల్దేరిన షరీఫ్, మరియమ్‌లు మూడు గంటలు ఆలస్యంగా లాహోర్ చేరుకున్నారు. లండన్ నుంచి అబుదాబికి నిర్ణీత సమయంలోనే చేరుకున్నా అక్కడి నుంచి లాహోర్ రావాల్సిన విమానం ఆలస్యంగా బయల్దేరింది. ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టడం మంచి నిర్ణయమేనా? అని అబుదాబి విమానాశ్రయంలో విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించగా..దేశంలోని పరిస్థితుల గురించి తనకు తెలుసని అన్నారు. దేశ తలరాత మార్చేందుకే తాను తిరిగొస్తున్నట్లు చెప్పారు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకే.. అంతకుముందు, నవాజ్ షరీఫ్ తన దేశ పౌరులనుద్దేశించి ప్రసంగించిన వీడియోను మరియమ్ ట్వీట్ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశ భవిష్యత్తును మార్చడానికి తనకు మద్దతుగా నిలవాలని షరీఫ్ కోరారు. ‘అసలు ఇందులో కేసు లేదు, తీర్పు లేదు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఆటలు ఆడుతున్నారు. నాకు వ్యతిరేకంగా కేసులే లేవు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకున్నాను కాబట్టే.. ఫిక్సింగ్‌కు పాల్పడి రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచడానికి పనామా పత్రాల కేసును తెరపైకి తెచ్చారు. నేనేం చేయాలో అదే చేశాను. నాకు పదేళ్ల శిక్ష పడిందని తెలుసు. పాక్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే జైలుకు తరలిస్తారని తెలుసు. నేను చేస్తున్నదంతా మీకోసమేనన్న సంగతిని గ్రహించండి’ అని అన్నారు. పంజాబ్ ప్రావిన్సులో తన అనుచరులపై కొనసాగుతున్న అణచివేత..ప్రభుత్వానికి తానంటే ఉన్న భయాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. అందుకే లాహోర్ విమానాశ్రయానికి వేలాది మంది మంది మద్దతుదారులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో తన తల్లి వెంటిలేటర్‌పై ఉన్న చిత్రాలను కూడా మరియమ్ పోస్ట్ చేశారు. -
ఢిల్లీలో ఆప్ భారీ ర్యాలీ
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఏడురోజులుగా దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలిపి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించడం లక్ష్యంగా ఆప్ ఈ ర్యాలీని తలపెట్టినప్పటికీ, పోలీసులు అడ్డుకోవడంతో మోదీ ఇంటికి చాలా దూరంలోనే ర్యాలీ ఆగిపోయింది. ఢిల్లీలోని మండీహౌస్ ప్రాంతం నుంచి ఆప్ ఈ ర్యాలీని ప్రారంభించగా, అక్కడకు ఎక్కువ మంది కార్యకర్తలు రాకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీకి అనుమతించేది లేదని ప్రకటించిన పోలీసులు.. మండీహౌస్‌కు దగ్గర్లోని ఐదు ఢిల్లీ మెట్రోరైల్ స్టేషన్లను మధ్యాహ్నమే మూసివేశారు. ఆ ప్రాంతానికి చేరుకునే బస్సులను కూడా నిలిపివేశారు. ప్రధాని మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌లు ర్యాలీని అడ్డుకోవాలని పోలీసుల ద్వారా ఎంత ప్రయత్నించినప్పటికీ 45 వేల మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు కూడా పాల్గొన్న ఈ ర్యాలీ సాయంత్రం 4.45 గంటలకు మండీహౌస్ వద్ద ప్రారంభమై ఆరు గంటల సమయంలో పార్లమెంట్ స్ట్రీట్ వద్దనే ఆగిపోయింది. ర్యాలీ సమయంలో ఏచూరి మాట్లాడుతూ ‘బీజేపీ పాలనలో దేశంలో సమాఖ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో ఉంది. ఇందుకు నిరసనగానే ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం’ అని చెప్పారు. మేం సమ్మె చేయడం లేదు: అధికారులు ఐఏఎస్ అధికారులు సమ్మె చేస్తున్నారంటూ ఆప్ చెబుతుండటాన్ని ఢిల్లీ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. అనవసరంగా ఆప్ నేతలు తమను లక్ష్యంగా చేసుకుని బా«ధ్యులుగా చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు కలసి ఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఢిల్లీ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తమకు భద్రత లేని సమావేశాలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారులపై కేజ్రీవాల్ వెనక్కు తగ్గారు. అధికారులంతా తమ కుటుంబంలో భాగమేనన్న ఆయన.. మంత్రులతో సమావేశాల్లో పాల్గొనే సమయంలో వారికి పూర్తి భద్రత ఉంటుందని హామీనిచ్చారు. ఆప్ ప్రభుత్వాన్ని బాయ్‌కాట్ చేయడం మానేసి పనుల్లో నిమగ్నం కావాలని విజ్ఞప్తి చేశారు. నా స్థానంలో ఎలా వెళ్తారు.. నీతి ఆయోగ్ పరిపాలక మండలి సమావేశానికి తన స్థానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వెళ్లేందుకు తాను అనుమతినివ్వలేదని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్‌కు బదులుగా బైజల్ నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యారని వచ్చిన వార్తలపై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి స్థానంలో ఎల్జీ భేటీకి వెళ్లారు?’ అని ప్రశ్నించారు. అయితే బైజల్ సమావేశానికి రానేలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. -
నేడు రాజధానిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం చేపట్టనున్న భారీ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమయింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమయిందని ఈ సందర్భంగా చాటనుంది. దీంతోపాటు త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల కార్యక్షేత్రంలోకి ముందుగానే దూకాలనుకుంటున్న రాహుల్..అందుకు అవసరమైన కొత్త ఏఐసీసీ కూర్పులో తలమునకలై ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకల నుంచి పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్నారని అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. రాజధాని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి రానున్నారనీ, వీరంతా ఆదివారం ఉదయం నుంచి ఇక్కడికి చేరుకుంటారని అన్నారు. లక్షమందికి పైగా ర్యాలీకి తరలివస్తారని ఆయన అంచనా వేశారు. -
రైతుదీక్షకు తరలిన జనం
* నియోజకవర్గాల నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన నేతలు * వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా ప్రజల సంఘీభావం సాక్షి, విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు కృష్ణా జిల్లా జనం పోటెత్తారు. రాష్ట్రంలో రైతులను, డ్వాక్రా మహిళలను వంచిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా జగన్మోహన్రెడ్డి తణుకులో చేపట్టిన రెండు రోజుల రైతు దీక్ష ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. ఈ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు 16 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాటి నుంచి తప్పుకొనేందుకు దొడ్డిదారులు వెదుకుతోంది. ఈ నేపథ్యంలో రైతులు, డ్వాక్రా మహిళలకు మద్దతుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండురోజుల రైతు దీక్ష పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు రైతులు, మహిళలతోపాటు వివిధ వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. అనుమతి లేదని ఆర్టీసీ అధికారులు బస్సులు కేటాయించకపోయినా అనేక మంది స్వచ్ఛందంగా వాహనాలు సమకూర్చుకుని తణుకు వెళ్లి జగన్మోహన్రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు ఆదివారం ఉదయం భారీ ర్యాలీగా ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. జిల్లా ముఖ్యనేతలు కొందరు శనివారం నుంచే దీక్షలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకాప్రతాప్ అప్పారావు, జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర నేత సామినేని ఉదయభాను దీక్షలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వారు ధ్వజమెత్తారు. జిల్లా నుంచి ర్యాలీగా.. గుడివాడ నియోజకవర్గం నుంచి పార్టీ ఉత్తర కృష్ణా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పామర్రు, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, మేకా ప్రతాప్‌అప్పారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు తణుకు వెళ్లారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ నేతృత్వంలో ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తణుకు తరలివెళ్లారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో వివిధ నియోజకవర్గాల నుంచి ర్యాలీలుగా దీక్షకు తరలివెళ్లారు. దీక్షలో జిల్లా నేతలు... పార్టీ దక్షిణ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసుపార్థసారథి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పేర్ని నాని (మచిలీపట్నం), జోగి రమేష్ (మైలవరం), ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.గౌతంరెడ్డి, మొండితోక జగన్మోహన్రావు (నందిగామ) సింహాద్రి రమేష్‌బాబు (అవనిగడ్డ), ఉప్పాల రాంప్రసాద్ (పెడన), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), దుట్టా రామచంద్రరావు(గన్నవరం)లతో పాటు జెడ్పీలో పార్టీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, నాయకులు ఉప్పాల రాము, కాజ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పదవి పోయినా లెక్కచేయను
- కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు - మంత్రి నాయిని సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మంత్రి పదవి పోయిన పర్వాలేదు, కానీ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం 8వ వార్షికోత్సవం సందర్భంగా సంఘం డైరీ, క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. చంద్రబాబు లా అండ్ ఆర్డర్‌ను గవర్నర్‌కు ఇప్పించి, హైదరాబాద్ నగరాన్ని వారి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడే పరిశ్రమల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రైవేటు ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు. వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సామా వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, మహిళా అధ్యక్షురాలు మమతారెడ్డి , కనీస వేతన బోర్డు చైర్మన్ సదానందం గౌడ్, ఉపాధ్యక్షుడు అనిల్, పురుషోత్తం, శరత్ చందర్, గణేష్ పాల్గొన్నారు.సభకు ముందు సుందరయ్య పార్కు నుంచి వీఎస్టీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. -
సమైక్య జోరు
సాక్షి,కడప : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కడప నగరంలో నాగార్జున మోడల్‌స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి కోటిరెడ్డి కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో సమైక్య నినాదాలతో హోరెత్తించారు. కలెక్టరేట్లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఒంటిమిట్ట మండల ఉపాధ్యాయులు దీక్షల్లో కూర్చొన్నారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ సర్పంచ్ రమణయ్య నేతృత్వంలో 12మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో విజయ్‌కుమార్ సర్కిల్లో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ నేత, దొమ్మరనంద్యాల మాజీ సర్పంచ్ బుసిరెడ్డి ఆధ్వర్యంలో 15మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కుండా రామయ్య సంఘీభావం తెలిపారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ కార్యకర్తలు ఖాజావలీ నేతృత్వంలో 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు. బద్వేలు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నారాయణ స్కూల్ విద్యార్థులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో జేఏసీ ఛెర్మైన్ ఓబులేసు ఆధ్వర్యంలో పాతబస్టాండు వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. రాయచోటిలో న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. మైదుకూరులో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు.