ఐక్యతా వేదికపై నుంచి అభివాదం చేస్తున్న శతృఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా, స్టాలిన్, అఖిలేశ్, కుమారస్వామి, చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ, మమతా బెనర్జీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, శరద్ యాదవ్ తదితరులు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు విపక్షాలు కలసికట్టుగా సమరశంఖం పూరించాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాడాలని ప్రతినబూనాయి. మోదీ ప్రభుత్వ విధానాలు, పనితీరుపై ముప్పేట దాడి చేశాయి. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, హస్తినలో ప్రభుత్వం మారాల్సిందేనని ముక్తకంఠంతో నినదించాయి. ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో శనివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమైంది.
ప్రధాన విపక్షం కాంగ్రెస్ సహా 20 ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విభేదాల్ని పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఎన్నికలు ముగిసిన తరువాతే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించారు. ర్యాలీకి టీఎంసీ కార్యకర్తలు లక్షల్లో వచ్చారు. కోల్‌కతా విపక్ష సభ సక్సెస్‌కావడంతో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఢిల్లీ, ఏపీ రాజధాని అమరావతిలోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.
మోదీ ప్రభుత్వ గడువు తీరింది: మమతా
మోదీ ప్రభుత్వంపై ఈ ర్యాలీకి అధ్యక్షత వహించిన మమత నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు రావాలంటే ఢిల్లీలో ప్రభుత్వం మారాలని ఉద్ఘాటించారు. సమష్టి నాయకత్వం గురించి తరచూ మాట్లాడే మోదీ, అమిత్ షాలు బీజేపీ సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, గడ్కరీ, రాజ్‌నాథ్ తదితరులకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలు సీబీఐ, ఆర్‌బీఐ, ఇతర విచారణ సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. మొండి బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయని, రఫేల్ లాంటి కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు.
ఏకమవకుంటే అణచివేత తప్పదు: ఖర్గే
కాంగ్రెస్ తరఫున హాజరైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే.. సోనియా పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. సోనియా, రాహుల్ గాంధీలు ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ‘మోదీ తాను తినకపోయినా తన కార్పొరేట్ స్నేహితులు అంబానీలు, అదానీలకు లబ్ధి చేకూరుస్తున్నారు. నోట్లరద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. గమ్యస్థానం చాలా దూరం ఉంది. దారి క్లిష్టంగా ఉంది. కానీ మనం అక్కడికి చేరాలి. మన మనసులు కలిసినా కలవకపోయినా, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ముందుకుసాగాలి’ అని ఓ హిందీ వాక్యంతో ఖర్గే ప్రసంగాన్ని ముగించారు.
ఎలాగైనా బీజేపీని ఓడించాలి: కేజ్రీవాల్
కేంద్రంలో ప్రమాదకర బీజేపీని ఎలాగైనా ఓడించాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీ ప్రభుత్వాన్ని మార్చాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ ఒక్క సీటు(వారణాసి)నైనా ఎలా గెలుచుకోవాలో బీజేపీకి అర్థం కావడం లేదని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఓ వైపు అవినీతి గురించి మాట్లాడుతూనే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాల్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మోసగించిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
అది అవకాశవాదుల ర్యాలీ: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష ర్యాలీ.. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న అవకాశవాదుల సమావేశమని బీజేపీ అభివర్ణించింది. లోక్‌సభ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ద్వేషంతో ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి ఇష్టపడని నేతలు ఒక చోట చేరారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ ప్రశ్నించారు. ‘వారు మాట్లాడుతున్న కొత్త ఫ్రంట్ రెండోదా? మూడోదా? తెలియదు. ఈ పార్టీల్లో ఒకరినొకరు తిరస్కరించిన వారున్నారు. యూపీలో కాంగ్రెస్‌ను వద్దనుకున్న ఎస్పీ–బీఎస్పీ ఈ ర్యాలీలో పాల్గొనడం వారి అవకాశవాదాన్ని సూచిస్తోంది’ అని అన్నారు.
హాజరైన పార్టీలు, నాయకులు..
తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్, కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఎన్సీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, టీడీపీ, ఆప్, లోక్‌తాంత్రిక్ జనతాదళ్, జీజేఎం, ఏఐడీయూఎఫ్, జోరం నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ మిజోరం, జేఎంఎం, పటీదార్ ఆందోళన్ సమితి, శత్రుఘ్న సిన్హా(బీజేపీ), జిగ్నేశ్ మేవానీ(దళిత ఎమ్మెల్యే), అరుణాచల్ మాజీ సీఎం గెగాంగ్ అపాంగ్(ఇటీవలే బీజేపీ నుంచి బయటికి వచ్చారు).
ఈవీఎం ట్యాంపరింగ్‌పై నలుగురితో కమిటీ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల పనితీరు, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడంపై సూచనలు చేసేందుకు నలుగురు విపక్ష నాయకులతో కమిటీ ఏర్పాటైంది. దీనిలో అభిషేక్ సింఘ్వీ(కాంగ్రెస్), అఖిలేశ్(ఎస్పీ), సతీశ్ మిశ్రా(బీఎస్పీ), కేజ్రీవాల్(ఆప్) ఉన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయబోయే ఈ కమిటీ ఎన్నికల సంస్కరణలపై ఈసీకి నివేదిక సమర్పిస్తుందని మమతా చెప్పారు. ఎన్నికలకు వ్యవధి తక్కువ ఉందని, సంస్కరణల్ని ఈసీ వెంటనే చేపట్టాలని ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఉన్నపళంగా మళ్లీ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని తాము కోరడం లేదని, కానీ ఓట్ల లెక్కింపునకు వీవీప్యాట్ పద్దతిని విస్తృతం చేయాలని సింఘ్వీ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్‌కు దెబ్బేనా?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలను ఒకతాటిపైకి తేవడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ప్రయత్నం సఫలమైంది. ఇదే స్ఫూర్తితో మహాకూటమి ఏర్పాటు యత్నాలు మరింత ముమ్మరమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే.. ప్రధాన విపక్షం కాంగ్రెస్ పాత్ర పెద్దగా లేకుండానే ప్రాంతీయ పార్టీలు కోల్‌కతాలో ఒకే వేదికపైకి వచ్చి ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. ఇలా ప్రాంతీయ పార్టీలు తమంతట తాము ఏకమవడం కాంగ్రెస్ బలం తగ్గిపోయిందనే సంకేతాన్నిస్తోంది.
ఈ కోణంలో చూస్తే లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని మరింత తగ్గించే అవకాశాలున్నాయి. ప్రాంతీయ పార్టీలకు చుక్కాని లేదని, వాటికి ఓ దిశానిర్దేశం లేదని ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తున్నాయి. కానీ ఇటీవలి కాలంలో చిన్నా చితకా పార్టీలు కూడా ఎన్నికల తరువాత ఒప్పందం కుదుర్చోవడానికి గట్టిగానే బేరమాడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు లేకుండా తామెన్ని సీట్లు గెలుస్తామోనని లెక్కలేసుకుంటున్నాయి. కోల్‌కతా ర్యాలీతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రెండు ఫ్రంట్‌లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అందులో ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో కాగా, మరొకటి కాంగ్రెస్ రహిత ఫెడరల్ ఫ్రంట్(వేర్వేరు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కలసి ఏర్పాటుచేయబోయేది) అని భావిస్తున్నారు. ఇక కోల్‌కతా ర్యాలీ విషయానికి వస్తే..ఇతర నాయకులు 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడగా, ఆతిథ్యమిచ్చిన మమతా బెనర్జీ మాత్రం బెంగాలీలో సుమారు అరగంట సేపు ప్రసంగించారు. దీనిని బట్టి రాబోయే మహాకూటమి ర్యాలీల్లో స్థానిక పార్టీనే ఎక్కువ ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగితే ఆప్, చెన్నైలో డీఎంకే ప్రభావం ఎక్కువ ఉండొచ్చు.
శనివారం కోల్‌కతాలో జరిగిన విపక్ష ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు
ర్యాలీకి వచ్చిన ముఖ్యనేతలకు భోజనం వడ్డిస్తున్న మమతా బెనర్జీ
Comments
Please login to add a commentAdd a comment