ప్రధాని నివాసం వైపు ర్యాలీగా వెళ్తున్న ఆప్ నాయకులు, కార్యకర్తలు
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఏడురోజులుగా దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలిపి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించడం లక్ష్యంగా ఆప్ ఈ ర్యాలీని తలపెట్టినప్పటికీ, పోలీసులు అడ్డుకోవడంతో మోదీ ఇంటికి చాలా దూరంలోనే ర్యాలీ ఆగిపోయింది. ఢిల్లీలోని మండీహౌస్ ప్రాంతం నుంచి ఆప్ ఈ ర్యాలీని ప్రారంభించగా, అక్కడకు ఎక్కువ మంది కార్యకర్తలు రాకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ర్యాలీకి అనుమతించేది లేదని ప్రకటించిన పోలీసులు.. మండీహౌస్‌కు దగ్గర్లోని ఐదు ఢిల్లీ మెట్రోరైల్ స్టేషన్లను మధ్యాహ్నమే మూసివేశారు. ఆ ప్రాంతానికి చేరుకునే బస్సులను కూడా నిలిపివేశారు. ప్రధాని మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌లు ర్యాలీని అడ్డుకోవాలని పోలీసుల ద్వారా ఎంత ప్రయత్నించినప్పటికీ 45 వేల మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు కూడా పాల్గొన్న ఈ ర్యాలీ సాయంత్రం 4.45 గంటలకు మండీహౌస్ వద్ద ప్రారంభమై ఆరు గంటల సమయంలో పార్లమెంట్ స్ట్రీట్ వద్దనే ఆగిపోయింది. ర్యాలీ సమయంలో ఏచూరి మాట్లాడుతూ ‘బీజేపీ పాలనలో దేశంలో సమాఖ్య వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో ఉంది. ఇందుకు నిరసనగానే ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం’ అని చెప్పారు.
మేం సమ్మె చేయడం లేదు: అధికారులు
ఐఏఎస్ అధికారులు సమ్మె చేస్తున్నారంటూ ఆప్ చెబుతుండటాన్ని ఢిల్లీ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. అనవసరంగా ఆప్ నేతలు తమను లక్ష్యంగా చేసుకుని బా«ధ్యులుగా చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు కలసి ఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఢిల్లీ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తమకు భద్రత లేని సమావేశాలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారులపై కేజ్రీవాల్ వెనక్కు తగ్గారు. అధికారులంతా తమ కుటుంబంలో భాగమేనన్న ఆయన.. మంత్రులతో సమావేశాల్లో పాల్గొనే సమయంలో వారికి పూర్తి భద్రత ఉంటుందని హామీనిచ్చారు. ఆప్ ప్రభుత్వాన్ని బాయ్‌కాట్ చేయడం మానేసి పనుల్లో నిమగ్నం కావాలని విజ్ఞప్తి చేశారు.
నా స్థానంలో ఎలా వెళ్తారు..
నీతి ఆయోగ్ పరిపాలక మండలి సమావేశానికి తన స్థానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వెళ్లేందుకు తాను అనుమతినివ్వలేదని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్‌కు బదులుగా బైజల్ నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యారని వచ్చిన వార్తలపై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి స్థానంలో ఎల్‌జీ భేటీకి వెళ్లారు?’ అని ప్రశ్నించారు. అయితే బైజల్ సమావేశానికి రానేలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment