కుంభమేళాకు హాజరైన అశేష జనవాహిని
ప్రయాగ్‌రాజ్: కుంభమేళా సందర్భంగా ట్రాన్స్‌జెండర్‌లతో కూడిన కిన్నెర అఖాడా సభ్యులు మంగళవారం పవిత్ర స్నానాలు ఆచరించి చరిత్ర సృష్టించారు. జునా అఖాడా సభ్యులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చిన కిన్నెర అఖాడా సభ్యులు త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఈ సందర్భంగా ‘హరహర మహాదేవ్’ అంటూ నినాదాలు మిన్నంటాయి. కార్యక్రమానికి హాజరైన వారంతా కిన్నెర అఖాడా సభ్యులను ఆసక్తిగా తిలకించారు. కాగా, కుంభమేళాకు ట్రాన్స్‌జెండర్లను అనుమతించడం ఇదే ప్రథమం. సంప్రదాయ వాదుల నుంచి వారికి గట్టి ప్రతిఘటన కూడా ఎదురైందని అఖాడా వర్గాలు తెలిపాయి.
‘ప్రాచీన భారతంలో ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి గౌరవం దక్కిందో మన మత గ్రంథాలు చెబుతున్నాయి. అప్పట్లో మాదిరిగా సమాజం మమ్మల్ని అంగీకరించేందుకే ఈ ప్రయత్నం. రానున్న తరాల వారు మా మాదిరిగా వివక్షకు గురి కాకుండా చూసేందుకే ఇక్కడికి వచ్చాం’ అని కిన్నెర అఖాడా అధిపతి లక్ష్మి నారాయణ్ త్రిపాఠీ(40) తెలిపారు. ‘ట్రాన్స్‌జెండర్లు బిచ్చగాళ్లుగానే ఉండాలని మీ రెందుకు భావిస్తున్నారు? ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సంస్థలు ఇష్టపడటం లేదు’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె పలు హిందీ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు.
మందిరం కోసం 33 వేల దీపాలు
అయోధ్యలో రామాలయం నిర్మించాలంటూ కుంభమేళా సందర్భంగా సాధువులు రోజుకు 33వేల దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం కోసం ఈ నెలలో 11 లక్షల దీపాలను వెలిగించనున్నట్లు వారు తెలిపారు. కాగా, కుంభ్‌నగరిలో టాయిలెట్లు పనిచేయకపోవడంతో కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజు తరలివచ్చిన సుమారు కోట్ల మందిలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment