transjendars
-
అయోధ్య: ‘డబ్బులు తీసుకోకుండా ఆశీర్వదిస్తాం’
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ట్రాన్స్జెండర్ల కమ్మూనిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ట్రాన్స్జెండర్లు జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని ఆ పవిత్రమైన రోజు జన్మించే పిల్లల తల్లిదండ్రుల వద్ద ఎటువంటి డబ్బులు, కానుకలు తీసుకోకుండా ఆశీర్వాచనం అందజేస్తామని తెలిపింది. తాము చిన్న పిల్లలు జన్మించిన ఇళ్లకు వెళ్లి పాటలు పాడి.. పుట్టిన చిన్నపిల్లలు సంతోషంగా పెరగాలని ఆశీర్వదిస్తామని ట్రాన్స్ కమ్మూనిటీకి చెందిన ప్రతినిధి రాణీ తెలిపారు. అయితే జనవరి 22 రాముడి ప్రాణప్రతిష్ట రోజున జన్మించే చిన్నారుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు, కానుకలను తీసుకోకుండానే ఉచితంగా ఆశీర్వచనం ఇస్తామని తెలిపారు. రాముడి ప్రణప్రతిష్ట రోజు పిల్లల తల్లిదండ్రులు తమకు డబ్బుల బదులుగా సంతోషంగా పండ్లు ఇచ్చినా తీసుకుంటామని మరో ట్రాన్‌జెండర్ శరదా తెలిపారు. రాముడిని దర్శించుంచుకునే అవకాశం రావటం తమ జీవితాల్లో ఎంతో అదృష్టమని తెలిపారు. 500 ఏళ్ల నుంచి జరిగిన పోరాటం.. జనవరి 22న రాముడి ప్రాణప్రతిష్టతో కార్యరూపం దాల్చుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు.. జనవరి 22న పవిత్రమైన రోజుగా భావిస్తూ.. అయోధ్యతో పాటు పలు రాష్ట్రాలు ‘డ్రై డే’గా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకి రాడంట! -
తొలి ట్రాన్స్ బార్బీ!
అబ్బాయిల లక్షణాలతో పుట్టిన ఆ చిన్నారికి బార్బీ బొమ్మతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది. కానీ అమ్మాయిలు ఎక్కువగా ఆడుకునే బొమ్మను చిన్నారికి ఇవ్వడం బాగోదని ఆమె తల్లి బార్బీ బొమ్మను కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. చిన్నారి పెరిగి పెద్దదవుతున్నప్పటికీ ఆమె బార్బీతో ఆడుకోవాలన్న ఆశ మరింత పెరుగుతూనే వచ్చింది. అప్పుడప్పుడు మనసుని తీవ్రంగా కలిచి వేస్తుండేది. నాడు బార్బీకోసం తల్లడిల్లిన ఆ చిన్నారి.. తాజాగా యాభై ఏళ్ల వయసులో తనే ‘బార్బీడాల్’గా మారింది. ఆమె మరెవరో కాదు ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నిర్మాత, నటి, ఎల్జీబీటీక్యూ కమ్యునిటి హక్కుల న్యాయవాది అయిన ‘లావెర్న్ కాక్స్’. మే 29న 50వ పుట్టినరోజు సందర్భంగా మ్యాటెల్ సంస్థ కాక్స్రూపురేఖలతో బార్బీడాల్ను విడుదల చేసింది. దీంతో ‘తొలి ట్రాన్స్ జెండర్ బార్బీ’గా నిలిచి చరిత్ర సృష్టించింది లావెర్న్ కాక్స్. అమెరికాకు చెందిన లావెర్న్ కాక్స్ నటనలో నిష్ణాతురాలు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్’ వెబ్ సిరీస్‌లో సోఫియా బరెస్ట్ పాత్రలో నటించి మంచిగుర్తిపు తెచ్చుకుంది. నాలుగు సార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్ అవ్వడమేగాక, నిర్మాత ఎమ్మీ అవార్డును గెలుచుకుంది. టెలివిజన్ షో నిర్వహించి తొలి ట్రాన్స్ జెండర్‌గా కూడా నిలిచింది. చుట్టుపక్కల సమాజంలో అనేక వివక్షలను తట్టుకుని ఈ స్థాయికి ఎదిగిన లావెర్న్ బార్బీడాల్గా అరుదైన గౌరవం లభించింది. సిల్వర్ మెటాలిక్ బాడీ సూట్పైన ముదురు ఎరుపు రంగు గౌను, స్టైలిష్ హెయిర్ స్టైల్, మేకప్‌లో లావెర్న్ బార్బీడాల్గా మెరిసిపోతోంది. పెద్దపెద్ద కలలతో.. చిన్నప్పటి నుంచి బార్బీతో ఆడుకోలేదని బాధపడుతోన్న లావెర్న్ తన రూపంలో ఉన్నæ బార్బీని చూసి తెగ మురిసిపోతూ...‘‘ బార్బీ డ్రెస్ చాలా బావుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్స్ నా బొమ్మ కొంటారేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్ని చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పటికి ట్రాన్స్ చిన్నారులు దాడులకు గురవుతున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఈ దాడులు అడ్డంకిగా మారాయి. ఇప్పుడు ఈ బార్బీ డాల్ చూసిన చిన్నారులంతా పెద్దపెద్ద కలలతో బంగారు భవిష్యత్తుని నిర్మించుకుంటారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు అబ్బాయిలు, అమ్మాయిలు ఆడుకునే బొమ్మలను వేరుగా చూడకుండా వారి ఆసక్తి ప్రకారం ఆడుకోనిస్తారని ఆశిస్తున్నాను’’ అని లావెర్న్ చెప్పింది. ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్స్‌ని విభిన్నంగా చూసే ఈ సమాజంలో ఈ బార్బీడాల్ కనువిప్పు కలిగించి వాళ్లు కూడా మనలో ఒకరుగా భావించాలని ఆశిద్దాం. 2021 వరకు అందమైన రూపానికి బార్బీ ప్రతీకగా నిలుస్తుండేది. గతేడాది నుంచి సరికొత్త ఇన్నోవేషన్స్‌తో దూసుకుపోతున్న మహిళల గుర్తింపుగా బార్బీ సంస్థ ‘బార్బీ ట్రైబ్యూట్ సిరీస్’ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న మహిళల రూపాలతో బార్బీ సంస్థ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంటర్టైన్మెంట్ ఐకాన్ లూసిల్ బాల్, క్వీన్ ఎలిజిబెత్–2, ఇంకా యువతులను సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమ్యాటిక్స్(స్టెమ్)ను చదివేలా ప్రోత్సహించేందుకు నాసాతో కలసి బార్బీని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, ఆస్ట్రోనాట్ రూపం, మహిళా శాస్త్రవేతల రూపాల్లో సందడి చేస్తున్నాయి. ‘‘లావెర్న్ రూపాన్నీ బార్బీగా తీసుకు వచ్చినందుకు మేమెంతో గర్వపడుతున్నాము’’ అని సంస్థ తెలిపింది. -
మగపిల్లవాడిగా పుట్టి స్త్రీగా మారింది.. ఎక్కడా ఉద్యోగం రాలేదు.. రెండేళ్లపాటు
అభినా ఆహెర్ వయసు 44. ముంబయి వాసి. మగపిల్లవాడిగా పుట్టి స్త్రీగా మారింది. ఎకనమిక్స్ అండ్ డిప్లమో ఇన్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చేసింది. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. కారణం ఆమె సర్టిఫికేట్లో జెండర్ ‘మేల్’ అని ఉంది. ఆమె వస్త్రధారణ, హావభావాలు మహిళలా ఉన్నాయి. ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. కడుపు నింపుకోవడానికి పడుపు వృత్తి ఒక్కటే మార్గమైంది. రెండేళ్ల తర్వాత ఆ వృత్తి నుంచి బయటపడి తనలాంటి వాళ్ల కోసం సర్వీస్ చేసే ఎన్జీవోలో ఉద్యోగంలో చేరింది. తనకంటే అధ్వాన్నమెన జీవితాలెన్నో ఉన్నాయని తెలుసుకుంది. ఆ తర్వాత ట్వీట్ (ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ట్రస్ట్) స్థాపించి తనలాంటి వారి హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తోంది. ‘చదువుకున్నాం... ఉద్యోగం చేస్తాం... ఉద్యోగం ఇవ్వండి. మా జెండర్‌ని గుర్తించండి’ అని పోరాడుతోంది. రాళ్లతో కొట్టారు అభినా అహెర్కి మూడేళ్ల వయసులోనే తండ్రి పోయాడు. తల్లి మంగళ ముంబయి మున్సిపల్ ఆఫీస్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. మంగళ జానపద నాట్యకారిణి. నాట్యప్రదర్శనలు ఇస్తూ మరాఠీ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటిస్తూ అభిన భవిష్యత్తు కోసం డబ్బు దాస్తుండేది. తల్లి డాన్స్ చేస్తుంటే కళ్లప్పగించి చూసేది అభిన. ఓ రోజు మంగళ ఇంటికి వచ్చేటప్పటికి తల్లి చీర కట్టుకుని, నాట్యకారిణిలా అలంకరించుకుని ఉంది. ‘నీలాగే చేస్తున్నాను చూడు’ అంటూ నాట్యం చేసి చూపించింది. ఆ క్షణంలో కొడుకుని చూసి మురిసిపోయిందా తల్లి. కానీ అదే పనిగా స్త్రీలాగ ఉండడానికి ప్రయత్నం చేయడాన్ని మాత్రం సహించలేకపోయింది. అప్పటికే ఇరుగుపొరుగు ఎగతాళి మొదలైంది. వద్దని ఎంత చెప్పినా వినని కొడుకు పట్ల తృణీకారం మొదలైంది. తన బిడ్డ గుర్తింపు పురుషుడిగా ఉండాలని తల్లి తాపత్రయం, తన గుర్తింపు స్త్రీగా ఉండాలనేది అభిన ఆకాంక్ష. ఎవరు వద్దన్నా, కాదన్నా సమాజం అభినా అహెర్ గుర్తింపును ‘హిజ్రా’ అని నిర్ధారించేసింది. తోటి పిల్లలు ఏడిపించడం, రాళ్లతో కొట్టడం నిత్యకృత్యమైంది. అభిన మానసిక క్షోభ తారస్థాయికి చేరి ఆత్మహత్యకు పాల్పడే వరకు వెళ్లింది. ఇన్ని ఆవేదనల మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 27వ ఏట లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని స్త్రీగా మారిపోయింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత హార్మోన్లు తగిన మార్పు చెందడానికి కొంత సమయం పట్టింది. ఈ లోపు పరిస్థితులు ఆమె మానసిక ఆరోగ్యాన్ని సవాల్ చేశాయి. అన్నింటికీ ఎదురీది సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టింది. అసలైన పరీక్ష మొదలైంది. సందేహంగా దేహాన్ని పరిశీలనగా చూసేవారు. సర్టిఫికేట్లను, దేహాన్ని మార్చి మార్చి చూసి ‘ఉద్యోగం లేదు’ అనేవారు. కొన్నేళ్లపాటు మాట్లాడడం మానేసిన తల్లి... అభిన స్త్రీగా మారిపోయిన తర్వాత నిస్సహాయ స్థితిలో ‘జెండర్ ఏదయితేనేం. నేను కన్నబిడ్డవి. ఇద్దరి బ్లడ్ గ్రూపూ బీ పాజిటివే. మనిద్దరం ఒకటే’ అని కూతురికి ధైర్యం చెప్పి అండగా నిలిచింది. ఇది హక్కుల పోరాటం అభినా అహెర్ తనలాంటి వాళ్ల కోసం పని చేసే హమ్‌సఫర్ ఎన్జీవోలో ఉద్యోగంలో చేరింది. హెల్ప్‌లైన్ నంబర్‌కి వచ్చిన ఫోన్లు రిసీవ్ చేసుకోవడం, బాధితులకు ధైర్యం ఆమె డ్యూటీ. దాదాపుగా ఎనిమిదేళ్లపాటు ఆ ఉద్యోగంలో తనలాంటి వాళ్లు సమాజంలో ఎదుర్కొనే వెతలు ఎన్ని రకాలుగా ఉంటాయో అర్థమైంది. ట్రాన్స్జెండర్ల కోసం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయనిపించింది. సొంతంగా 2013లో ట్వీట్ అనే ఎన్జీవో స్థాపించింది. ‘‘ట్రాన్స్‌జెండర్స్‌కి కూడా మిగిలిన అందరిలాగానే అన్ని ప్రాథమిక హక్కులూ వర్తిస్తాయనే వాస్తవాన్ని సమాజం మర్చిపోయింది. విద్య, వైద్యం, ఉపాధి హక్కుల పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. నేను స్థాపించిన ట్వీట్ స్వచ్ఛంద సంస్థ ట్రాన్స్ఉమెన్, ట్రాన్స్మెన్, హెచ్ఐవీ బాధితులకు పునరావాస కేంద్రం మాత్రమే కాదు. వాళ్లకు వాళ్ల చదువు, నైపుణ్యాలను బట్టి ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాదే. ఇప్పటి వరకు 250 మందిని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లలో ఉద్యోగంలో చేర్పించాను. మాలో డాన్స్ చేయడానికి ఇష్టపడే వాళ్లందరం కలిసి ‘డాన్స్క్వీన్స్’ బృందంగా ఏర్పడ్డాం.. వేడుకల్లో నాట్యం చేసి ఆ వచ్చిన డబ్బుతో సంస్థను నడపడానికి ఎల్జీబీటీల సహాయం కోసం ఖర్చు చేస్తున్నాం’’ అని చెప్పింది అభినా ఆహెర్. మా అమ్మ కూడా మాతోపాటు నాట్యం చేస్తోందని సంతోషంగా చెప్పింది అభిన. ‘నాట్యం మా తొలి అడుగు మాత్రమే. మా హక్కుల పరిరక్షణ కోసం, జెండర్ మార్చుకున్న వెంటనే మా సర్టిఫికేట్లన్నీ మార్చి ఇచ్చేవిధంగా ప్రభుత్వంలో చట్టాల రూపకల్పన కోసం ఉద్యమించడమే మా అసలు లక్ష్యం. సాధించి తీరుతాం’ అని ముక్త కంఠంతో చెబుతున్నారు ట్వీట్ సభ్యులు. -
హర్నాజ్ తళుకులకు ఆమే కారణం.. క్రౌన్ గౌన్ బై షిండే!
ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ వేదికపై విశ్వసుందరి కిరీటంతో మెరిసింది మన హర్నాజ్ సంధు. గ్రాండ్ ఫినాలేలో సిల్వర్ గౌనులో వచ్చి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెను వరించిన విశ్వసుందరి కిరీటానికే వన్నె తెచ్చినట్టుగా కనిపించింది ఆ గౌను. దీంతో ఇనుమడించిన అందంతో వెలిగిపోయింది హర్నాజ్. మన భారతీయ అందాన్ని ప్రపంచ అందాల వేదికపై చూపు తిప్పుకోనియ్యకుండా చేసింది డిజైనర్ సైషా షిండే. నలభై ఏళ్ల సైషా షిండే ఇండియాలో ఉన్న కొద్దిమంది ట్రాన్స్‌జెండర్ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు. గత పదిహేనేళ్లుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలోనే హర్నాజ్ కోరిక మేరకు సిల్వర్ గౌన్‌ను ఎంతో ప్రత్యేకంగా రూపొందించింది సైషా. ఫుల్కారీ ప్యాటర్న్‌కు ఎంబ్రాయిడరీ, స్టోన్స్, సీక్వెన్స్‌లను జోడించి పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా గౌన్‌ను రూపొందించింది. ముంబైకి చెందిన సైషా షిండే.. ఎనిమిదో తరగతిలో ఉండగా గియన్ని వెర్సేస్ ఫ్యాషన్ షోను టీవీలో చూసింది. ఆ ఫ్యాషన్ షో బాగా నచ్చడంతో..అప్పుడే ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు కూడా ఆ నిర్ణయానికి ఒప్పుకున్నప్పటికీ, ముందు చక్కగా చదువుకోవాలని కండీషన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే చదువుకుంటూ ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. తరువాత మిలాన్ లో ఫ్యాషన్ డిప్లొమా చేసింది. ఫ్యాషన్ షోలలో డిజైనర్‌గా పనిచేస్తోన్న సమయంలో.. మధుర్ భండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం వచ్చింది. దీంతో సినిమాలో ప్రియాంక చోప్రా ధరించిన డ్రెస్‌లన్నీ షిండే రూపొందించి మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ల్యాక్మే ఫ్యాషన్ హౌస్’ టీవీ షోలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తరువాత ఆరునెలల ఇంటర్న్‌షిప్ చేసింది. ప్రముఖ డిజైనర్లు పాల్గొనే అమెరికన్ టీవీ సిరీస్ ‘ప్రాజెక్ట్ రన్‌వే’ సీజన్ 14లో పాల్గొని ఆరో స్థానంలో నిలిచింది. ఐశ్వర్యారాయ్, సన్నీలియోన్, కరీనా కపూర్ ఖాన్, కియరా అడ్వాణీ, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే, తాప్సీ పొన్ను, మాధురీ దీక్షిత్ వంటివారికి డిజైనర్‌గా పనిచేసిన షిండే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాల కోసం పోటీపడే మోడల్స్‌ను మరింత అందంగా కనిపించేలా డ్రెస్‌లు రూపొందించడంలో విశేషం ఏముంది? వీటితోపాటు అనేక ఫ్యాషన్ షోలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తూ మంచి డిజైనర్‌గా రాణిస్తోంది. ఇలా మారింది సైషా షిండే అసలు పేరు స్వప్నిల్ షిండే. పుట్టినప్పటి నుంచి అబ్బాయిగా పెరిగిన షిండేకు .. అమ్మాయిల్లా తయారవాలని అనిపించేది. ఈ ఇష్టం కూడా ఫ్యాషన్‌ను కెరియర్‌గా ఎంచుకునేందుకు ప్రేరేపించింది. డిగ్రీలో ఉన్నప్పుడే తను అబ్బాయి కాదు అమ్మాయిని అని అర్థమైంది. ఇరవై ఏళ్ల వయసులో తెలిసిన ఆ నిజాన్ని జీర్ణించు కోవడానికి షిండేకు కొన్నేళ్లు పట్టింది. తర్వాత బాగా ఆలోచించుకుని తన నిజమైన రూపంతోనే మిగతా జీవితాన్ని గడపాలనుకుంది. నేను ‘గే’ని కాను .. ట్రాన్స్ ఉమెన్ను అని ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి ప్రకటించింది. ఇక నుంచి తన పేరు స్వప్నిల్ షిండే కాదు సైషా షిండే అని స్పష్టం చేసింది. అప్పటి నుంచి సైషా షిండేగా పిలవబడుతోంది. ఇరవై ఏళ్ల నాటి కల.. ఎన్ఐఎఫ్టీలో సైషా ఫ్యాషన్ డిగ్రీ చదువుతోన్న సమయంలో లారాదత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. అది చూసిన షిండే ‘‘ఇలా మిస్‌యూనివర్స్ కిరీటం దక్కించుకునే విన్నర్‌కు నేను ఏదోక రోజు డ్రెస్ డిజైన్ చేస్తాను’’ అని మనసులో అనుకుంది. అప్పటి కల ఇప్పుడు హర్నాజ్ రూపంలో తీరింది. హర్నాజ్.. తన గ్రాండ్ ఫినాలే డ్రెస్ ఎలా ఉండాలో చెప్పినప్పుడు ఈమె తప్పకుండా విన్నర్ అవుతుందని షిండే అనుకుంది. హార్నాజ్ కోరుకున్నట్లుగా సిల్వర్ గౌన్ రూపొందించింది. ఇప్పుడు ‘మిస్ యూనివర్స్’ గౌన్ రూపొందించినందుకు ఎంతో సంతోషంగానూ గర్వంగానూ ఉందని షిండే సంబరపడిపోతోంది. -
దారుణం: కానిస్టేబుల్‌పై ట్రాన్స్ జెండర్ల దాడి.. పరిస్థితి విషమం
భువనేశ్వర్: ట్రాన్స్ జెండర్లు రైళ్లలో ప్రయాణికులను బెదిరిస్తూ డబ్బులను వసూలు చేసే సంఘటనలను చూస్తూ ఉంటాం. అదే విధంగా తమను అల్లరి చేసిన వారిని నడిరోడ్డు మీదనే చితకబాదిన వార్తలు విన్నాం. కానీ, తాజాగా ఆరుగురు ట్రాన్స్ జెండర్లు ఏకంగా ఓ పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఒడిశాలోని భరత్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ట్రాన్స్ జెండర్ల దాడిలో తీవ్రంగా గాయపడిని కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు.. రిని బెహరా, సాలిని దాస్, లోపా సేథి, దీపాలి నాయక్, సుని జెనాగా పోలీసులు గుర్తించారు. వారి మీద హత్య కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వెల్లడించారు. కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారనే కోణంలో ట్రాన్స్ జెండర్లపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
ఎన్నికల బరిలో తొలి ట్రాన్స్‌జెండర్
కేరళలో ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే మొదటి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా అనన్య పోటీకి దిగింది. అయితే అక్కడ పోటీలో ఉన్నది అత్యంత బలమైన అభ్యర్థి. ‘అతను స్త్రీలు ఇంటిపట్టునే ఉంటే చాలనుకునే భావజాలం ఉన్న అభ్యర్థి. అతనికి స్త్రీ గురించి ట్రాన్స్జెండర్ల గురించి కూడా గౌరవం నేర్పడానికి రంగంలో దిగాను’ అని అనన్య అందరినీ ఆకట్టుకుంటోంది. పి.కె.కున్హాలి కుట్టి అంటే మలప్పురంలో చాలా సీనియర్. ఎం.పి.గా ఎం.ఎల్.ఏగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి. మంత్రిగా పని చేశాడు. ‘కుంజప్ప’గా ముద్దు పేరు కలిగినవాడు. ఔట్లుక్ పత్రిక వ్యాఖ్యానం ప్రకారం కేరళలో ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ (ఐ.యు.ఎం.ఎల్) పార్టీకి వెన్నుముకలాంటివాడు. ఇప్పుడు ఆ కొండను ఢీకొనడానికి ఒక శివంగి రంగంలో దిగింది. ఆ శివంగి పేరు అనన్య కుమారి. ఏప్రిల్ జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ‘వెంగర్’ నియోజక వర్గం నుంచి కున్హాలి కుట్టి నిలబడితే ‘డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ తరఫున ప్రత్యర్థిగా నిలిచింది. టెలివిజన్ సెట్‌ను ఆమె ఎన్నికల గుర్తుగా కేటాయించారు.‘ఇది మొదలు. నాది తొలి అడుగు. నేను సఫలం అయితే దేశంలోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ చట్టసభల్లో పోటీకి నిలవడానికి మరింత ముందుకు వస్తారు’ అని 28 ఏళ్ల అనన్య కుమారి అంది. కేరళలో ఇది వరకే ‘తొలి ఎఫ్.ఎమ్ ట్రాన్స్‌జెండర్ రేడియో జాకీ’గా అనన్య గుర్తింపు పొందింది.‘కున్హాలి కుట్టి ప్రాతినిధ్యం వహించే పార్టీ ఎన్నో ఏళ్లుగా స్త్రీలను ప్రత్యేక్ష ఎన్నికలలో అనుమతించలేదు. కున్హాలి భావజాలం కూడా అదే. స్త్రీలు, టాన్స్జెండర్లు మంచిపాలన అందిస్తారని నిస్వార్థంగా పని చేస్తారని నేను నిరూపించదలుచుకున్నాను’ అంటుంది అనన్య. కొళ్లాం ప్రాంతానికి చెందిన అనన్య ఇంటర్ వరకూ చదువుకుంది. అనన్య అభ్యర్థిత్వం వెలువడగానే కేరళలోని ట్రాన్స్జెండర్ల సమూహం హర్షం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా ఉత్సాహం కలిగించే వార్త’ అని రియా ఇషా అనే ట్రాన్స్‌జెండర్ మోడల్ అంది. ఎలక్షన్లు ఎంత ఖర్చుతో కూడుకున్నవో ఎన్ని మతలబుల వ్యవహారమో సామాన్యులకు తెలుసు. కాని వివక్షకు గురయ్యే సమూహం నుంచి ఒక అభ్యర్థి వచ్చి పోటీకి నిలవడాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. -
ట్రాన్స్ జెండర్ డెస్క్.. మార్పుకు నాంది: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని, ప్రపంచంలోనే మొదటిసారి ట్రాన్స్ జెండర్ డెస్క్‌ను తీసుకువచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమం దేశంలోనే కమ్యూనిటీ పట్ల మార్పునకు నాంది కాబోతోందని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా ట్రాన్స్ జెండర్లకు ఏమీ అందటంలేదని పేర్కొన్నారు. ఈ డెస్క్ ద్వారా అన్ని సదుపాయాలు అందుతాయని, ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో ఈ కమ్యూనిటీల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. రక్షణ, ఉద్యోగాలు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జాబ్ మేళాల్లో పెద్దఎత్తున పాల్గొంటే ట్రాన్స్జెండర్లకు సాయం అందిస్తామని తెలిపారు. వారికి డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చేలా కృషి చేస్తామన్నారు. వారికి సాయం చేయటంలో ముందుంటామని కానీ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేయాల్సి వస్తుందన్నారు. ట్రాన్స్జెండర్లు మారితేనే వారి కమ్యూనిటీ మారుతుందని తెలిపారు. తెలంగాణలోని ట్రాన్స్ జెండర్లపై ఒక డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి తెలియజేయాలన్నారు. వందల ఏళ్ల వివక్ష పోవటానికి కొంత సమయం పడుతుందని, దేశంలో ఎవరు కష్టాల్లో ఉన్నా ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ ముందుగా స్పందిస్తారని తెలిపారు. చదవండి: ఉప్పల్‌లో లారీ బీభత్సం -
ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు
సాక్షి, ఏలూరు: ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ట్రాన్స్‌జెండర్ అని తెలిసే ప్రేమాయణం సాగించాడు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ నువ్వు నాకు వద్దంటూ వేధింపులకు పాల్పడడంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇంతకీ అతను ఏలూరు సత్రంపాడుకు చెందిన యువకుడు కావటం ఆసక్తిగా మారింది. ఏలూరు సత్రంపాడుకు చెందిన తారక అలియాస్ పండు అనే యువకుడు హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ భూమితో ఫేస్బుక్లో పరిచయం అయ్యి ప్రేమించుకున్నారు. అనంతరం 2020 జనవరిలో పెద్దలను ఒప్పించి మరీ భూమిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా కొనసాగుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో యువకుడు భూమితో ఉండేందుకు నిరాకరించటంతోపాటు, అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు తారకను అరెస్టు చేశారు. చదవండి: మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్లు చదవండి: ముందు ఛాటింగ్ .. తర్వాత ఫోన్ -
నా గతం విషాదం.. ఇప్పుడు నేను డాక్టర్ని
‘కాంచన’ సినిమా గుర్తుందా?! అందులో కాంచన ఓ ట్రాన్స్‌జెండర్. గీత అనే మరో ట్రాన్స్‌జెండర్‌ను చేరదీసి డాక్టర్ చదువు చదివిస్తుంటుంది. ఆ సినిమాలో గీత డాక్టర్ కాకుండానే దుండగులు అడ్డుకుంటారు. నిజ జీవితంలో సమాజంలో మాత్రం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే ఓ ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా ఎదిగింది. ‘‘నా గతం ఓ విషాదం. ఇప్పుడు నేనో డాక్టర్ని’’ అని గర్వంగా చెబుతున్న ఆమె పేరు డాక్టర్ త్రినేత్ర. ‘కర్ణాటక రాష్ట్రంలో మొదటి ట్రాన్స్ ఉమన్ డాక్టర్‌గా త్రినేత్ర హల్దార్ గమ్మరాజు గుర్తింపు పొందింది. బెంగళూరులో త్రినేత్రను ఒకప్పుడు అంగద్ గమ్మరాజు అని పిలిచేవారు. లింగమార్పిడి చేయించుకున్న తర్వాత అంగద్ తన తల్లి దుర్గ పేరు మీద ‘త్రినేత్ర’ అని పేరు మార్చుకుంది. తన కుటుంబ సహకారంతోనే డాక్టర్ని అయ్యానని అంటోంది. ‘‘నేను ట్రాన్స్జెండర్ని అనే కారణంగా చిన్నప్పటి నుండి చాలా అవమానాలను ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు రకరకాల అసభ్యకర పేర్లతో నన్ను పిలిచేవారు. మొదట్లో నా మనసును అవి విపరీతంగా బాధించేవి. వాటిని అన్నీ సహిస్తూనే చదువు మీద దృష్టి పెట్టాను. ఇటీవలే మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాక్టికల్ సెషన్లో ఒక మహిళకు ప్రసవాన్ని చేశాను. ఆ బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం నా జీవితంలో మరపురానిది’’ అని ఆనందంగా వివరించింది త్రినేత్ర. ప్రస్తుతం ఆమె మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ హాస్పిటల్ లో పనిచేస్తోంది. ఈశాన్యభారతంలో బియాన్సీ లాయిష్రామ్ ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు ఆ తర్వాత స్థానం దక్షిణ భారత దేశంలో త్రినేత్ర దక్కించుకుంది. లక్ష్యంవైపు గురి ఉంటే ఎన్ని అవమానాలు ఎదురైనా అనుకున్నది సాధించవచ్చు అని నిరూపిస్తోంది త్రినేత్ర. (మగవాళ్ల ఆట మీకెందుకు.. అంతేనా?) -
పొట్ట కొట్టారు..ట్రాన్స్‌జెండర్ మహిళ కంటతడి
కొచ్చి : సమాజంలో తమపట్ల ఉన్న చెడు అభిప్రాయాన్ని తుడిచేయాలకుంది ఆ ట్రాన్స్‌జెండర్ మహిళ. అందరిలా గౌరవంగా బతకాలనుకున్నారు. సొంతకాళ్లపై నిలబడాలనుకున్నారు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని బిర్యానీ సెంటర్ పెట్టుకున్నారు. ఇతర షాపుల కంటే తక్కువ ధరకు క్వాలిటీ బిర్యానీని అందజేశారు. దీంతో ఆమె గిరాకీ రోజు రోజుకి పెరిగిపోయింది. అయితే ఇది గిట్టని చుట్టుపక్కల వ్యాపారస్తులు ఆమె మీద లేని పోని రూమర్లు సృష్టించారు. ఆమెకు వస్తున్న గిరాకి దెబ్బదీశారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కొచ్చికి చెందిన ట్రాన్స్‌జెండర్ ఉమన్ సజన షాజీ బిర్యానీ సెంటర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా పని దొరక్క ఇబ్బంది పడుతున్న మరో నలుగురు ట్రాన్స్‌జెండర్ మహిళలకు కూడా ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. ఇతరుల కంటే తక్కువ ధరకు క్వాలిటీపుడ్ అందిస్తున్నారు. ఇది గిట్టని పక్క షాపు వాళ్లు ఆమెపై రూమర్లు సృష్టించారు. ఆమె సరఫరా చేసే బిర్యానీ క్వాలిటీది కాదని పుకారు రేపారు. దీంతో ఆమె గిరాకీ దెబ్బతింది. తనతో పాటు మరో నలుగురి ట్రాన్స్‌జెండర్ మహిళలకు ఉపాధి దొరుకుతుందని బిర్యానీ సెంటర్ పెడితే.. కావాలనే కొంతమంది తన గిరాకీ దెబ్బతీస్తున్నారని షాజీ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను చెప్పుకుంటా భోరున విలపించారు. తన షాపుకు ఎదురుగా ఉన్న చెపల వ్యాపారీ గిరీష్ వల్లే తన గిరాకీ దెబ్బతిందని ఆరోపించారు. తమ బిర్యానీ సెంటర్‌కు వచ్చే కస్టమర్లకు అబద్దాలు చెప్పి గిరాకీ పాడు చేస్తున్నారని తన గోడును విన్నవించారు. మొదట్లో తమ షాపులో 300 బిర్యానీ ప్యాకెట్ల వరకు అమ్ముడుపోయేవని, కొద్దిరోజుల తర్వాత అవి 150కి పడిపోయాయని, ఇప్పుడైతే 20 ప్యాకెట్లు కూడా సేల్స్ కావడంలేదని ఆవేదన వ్యక్త చేశారు.‘రైళ్లలో యాచించడం, రాత్రిపూట వీధుల్లో తిరిగే బదులు పని చేసుకొని మంచి జీవితాన్ని గడపమని ప్రజలు చెబుతుంటారు. సమాజం మర్యాదగా పనిచేయడానికి అనుమతించకపోతే, మేము ఏం చేయాలని’అని షాజీ భోరున విలపించారు. -
ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ట్రాన్స్‌జెండర్ ఉమన్
ఓకే ఒక రోజుకు పోలింగ్ ఆఫీసర్. వచ్చేది లేదు, పోయేది లేదు. ‘చేస్తావా అమ్మా!’ అంది ఎలక్షన్ కమిషన్. ‘అమ్మా’ అన్నందుకైనా చేయాలనుకుంది.అమ్మ, మేడమ్, అమ్మాయ్.. మోనిక కోరుకున్న జెండర్ ఐడెంటిటీ! దేశంలోనే తొలిసారిగా.. ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీ చేయబోతున్న ట్రాన్స్‌జెండర్ ఉమన్ మోనిక! బిహార్ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్‌లో ఆమె కనిపిస్తారు. ట్రాన్స్ ఉమెన్‌కు గౌరవాన్ని తెచ్చిపెట్టి..తన బ్యాంక్ డ్యూటీకి తను వెళ్లిపోతారు. ఉద్యోగం వచ్చాక మోనికాదాస్ జీవితమే మారిపోయింది. ఆఫీస్‌లో అంతా ఆమెను గౌరవంగా చూస్తున్నారు. గౌరవంగా చూడదగని వ్యక్తేమీ కాదు ఆమె. అయితే గౌరవం అనే మాట ఎందుకు వచ్చింది? సమాజం తననొక స్త్రీగా గుర్తించాలని మోనికాదాస్ కోరుకుంది. స్త్రీలాగే బట్టలు వేసుకుంది. స్త్రీలా అలంకరించుకుంది. స్త్రీ సహజసిద్ధమైన కోమలత్వంలోకి తనని తను ఇముడ్చుకుంది. గోపాల్ కుమార్ అనే ఒక అబ్బాయి మోనికాదాస్ అనే అమ్మాయిగా కళ్లముందే మారిపోతూ ఉంటే ఆమెను ఏదో ఒకటి అనకుండా ఆమె జీవితాన్ని ఆమెకే వదలిపెట్టడానికి సమాజానికి చాలానే సమయం పట్టింది. ఎంత సమయం అంటే, ఆమె తన 27వ యేట పాట్నాలోని కంకర్‌బాగ్ కెనరా బ్యాంక్ బ్రాంచి ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరేవరకు! 2015లో ఆమె ఆ ఉద్యోగంలోకి వచ్చారు. ఆ క్రితం ఏడాదే ఆమె తన పేరును అధికారికంగా మోనికాదాస్ అని మార్చుకున్నారు. ఆఫీస్‌కి, ఆఫీస్ బయటికి తొలిరోజే వ్యత్యాసాన్ని గమనించారు మోనిక. ‘మేడమ్..టీ’ అన్నాడు ఆఫీస్ బాయ్ వచ్చి, సంశయంగానే అయినా సవినయంగా ఆమె కేబిన్‌లో టీ కప్పును పెడుతూ! అదెంతో సంతోషాన్నిచ్చింది మోనికకు. మిగతా స్టాఫ్ కూడా ఆమెతో చాలా మర్యాద గా ఉన్నారు. అక్కడికి దగ్గర్లోని కంకర్‌బాగ్ ఆటో స్టాండ్ సమీపంలోని సాయి మందిర్ దగ్గర ఉంటుంది మోనిక కుటుంబం. అమ్మ నాన్న, ఒక తమ్ముడు. పెద్ద తమ్ముడి పెళ్లి ఈ మధ్య జరిగింది. ఆ తమ్ముడి పెళ్లికి చీరకట్టుకునే వెళ్లారు మోనిక. ఎవరూ అభ్యంతరపెట్టలేదు. తను అమ్మాయిగానే ఉంటాను అన్నప్పుడు ఆమెను సపోర్ట్ చేసింది మొదట ఆమె తల్లిదండ్రులే. ఐదేళ్ల క్రితం బిహార్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ మహిళా బ్యాంకు ఉద్యోగిగా గుర్తింపు పొందిన మోనికాదాస్ ఈసారి దేశంలోనే తొలిసారి పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విధులను నిర్వహించబోతున్న ట్రాన్స్‌జెండర్ ఉమన్‌గా వార్తల్లోకి వచ్చారు! పాట్నా యూనివర్శిటీలో ‘లా’ చేశారు మోనికాదాస్. ‘లా’లో గోల్డ్ మెడలిస్ట్. పాట్నా నవోదయ విద్యాలయలో స్కూల్ చదువు. స్కూల్లో ‘బ్రిలియంట్ బాయ్’ అనే వారు తనను. ఆ ప్రశంసను ‘బ్రిలియంట్’ అన్నంత వరకే ఆమె స్వీకరించగలిగేది. బాయ్స్‌లా బట్టలు వేసుకోబట్టే కదా తనను అంతా బాయ్ అంటున్నారని బాధపడేది. ఆడపిల్లలా స్కూల్‌కి తయారై రావాలని, ఆడపిల్లల్తో కలిసి కూర్చోవాలని తపించేది. ‘అది అసాధ్యం బాబూ..’ అని ఎప్పటికప్పుడు ఆమెకు ఎవరో ఒకరు చూపులతో, మాటలతో తెలియబరుస్తూనే ఉండేవారు. కాలేజ్‌లో కూడా అంతే. ఉద్యోగం లో చేరాక మాత్రమే ఆమెకు పూర్తి స్వేచ్ఛ లభించింది. మనసా వాచా పూర్తిగా ఒక యువతిలా మారిపోయేందుకు వీలైంది. ఇప్పుడీ కొత్త గుర్తింపుతో (దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ ఉమన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అనే గుర్తింపు) బిహార్‌లో ఉన్న నలభై వేల మంది ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని మోనికా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు, గౌరవం మాత్రమే కాదు, ‘మేము ఫలానా’ అని ధైర్యంగా బయటికి వచ్చి చెప్పుకునే ఆత్మవిశ్వాసం కూడా వారికి తన వల్ల చేకూరుతుందని ఆమె ఆశిస్తున్నారు. అసలందుకే.. ‘చేస్తావా? అమ్మా’ అని ఎలక్షన్ కమిషన్ అడగ్గానే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా చేయడానికి ముందుకు వచ్చారు మోనికాదాస్. పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా మోనికాదాస్ ఈ కోవిద్ సమయంలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. బిహార్‌లో అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీలలో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మోనికాదాస్ రెండో విడత పోలింగ్‌లో పాట్నాలోని ఏదైనా ఒక బూత్‌కు పర్యవేక్షణ అధికారిగా ఉంటారు. పోలింగ్ సజావుగా జరిగేలా చూడటం, ఈవీఎంల పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండటం, జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వులను తు.చ.తప్పకుండా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం, బ్యాలెట్ బాక్సుల భద్రత.. ఇవన్నీ ఆమె చూసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం అక్టోబర్ 8న పట్నాలోని గర్దానీబాగ్లో మోనికాదాస్తోపాటు మరికొందరు ఆఫీసర్లకు ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వబోతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థాపనకు అత్యంత ముఖ్యమైన ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం పొందడాన్ని ఒక ట్రాన్స్పౌరురాలిగా నేను గర్విస్తున్నాను’’ అని అంటున్నారు మోనికాదాస్. తొలిసారి 2016 పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రియా సర్కార్ అనే ట్రాన్స్‌జెండర్ ఉమన్ కోల్‌కతాలో పోలింగ్ ఆఫీసర్‌గా చేశారు. మోనికాదాస్ ప్రిసైడింగ్ ఆఫీసర్. -
కుంభమేళాలో కిన్నెర అఖాడా
ప్రయాగ్‌రాజ్: కుంభమేళా సందర్భంగా ట్రాన్స్జెండర్లతో కూడిన కిన్నెర అఖాడా సభ్యులు మంగళవారం పవిత్ర స్నానాలు ఆచరించి చరిత్ర సృష్టించారు. జునా అఖాడా సభ్యులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చిన కిన్నెర అఖాడా సభ్యులు త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఈ సందర్భంగా ‘హరహర మహాదేవ్’ అంటూ నినాదాలు మిన్నంటాయి. కార్యక్రమానికి హాజరైన వారంతా కిన్నెర అఖాడా సభ్యులను ఆసక్తిగా తిలకించారు. కాగా, కుంభమేళాకు ట్రాన్స్జెండర్లను అనుమతించడం ఇదే ప్రథమం. సంప్రదాయ వాదుల నుంచి వారికి గట్టి ప్రతిఘటన కూడా ఎదురైందని అఖాడా వర్గాలు తెలిపాయి. ‘ప్రాచీన భారతంలో ట్రాన్స్జెండర్లకు ఎలాంటి గౌరవం దక్కిందో మన మత గ్రంథాలు చెబుతున్నాయి. అప్పట్లో మాదిరిగా సమాజం మమ్మల్ని అంగీకరించేందుకే ఈ ప్రయత్నం. రానున్న తరాల వారు మా మాదిరిగా వివక్షకు గురి కాకుండా చూసేందుకే ఇక్కడికి వచ్చాం’ అని కిన్నెర అఖాడా అధిపతి లక్ష్మి నారాయణ్ త్రిపాఠీ(40) తెలిపారు. ‘ట్రాన్స్జెండర్లు బిచ్చగాళ్లుగానే ఉండాలని మీ రెందుకు భావిస్తున్నారు? ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సంస్థలు ఇష్టపడటం లేదు’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె పలు హిందీ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. మందిరం కోసం 33 వేల దీపాలు అయోధ్యలో రామాలయం నిర్మించాలంటూ కుంభమేళా సందర్భంగా సాధువులు రోజుకు 33వేల దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం కోసం ఈ నెలలో 11 లక్షల దీపాలను వెలిగించనున్నట్లు వారు తెలిపారు. కాగా, కుంభ్‌నగరిలో టాయిలెట్లు పనిచేయకపోవడంతో కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజు తరలివచ్చిన సుమారు కోట్ల మందిలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. -
ట్రాన్స్జెండర్ల కోసం ‘టీ’ ఆప్షన్
న్యూఢిల్లీ: టికెట్ రిజర్వేషన్ల ఫారంలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ‘టీ’ ఆప్షన్‌ను రైల్వే బోర్డు అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం రిజర్వేషన్ ఫారాల్లో సవరణలు చేసి ‘ఎం’ (పురుషులు), ‘ఎఫ్’ (స్త్రీలు)తోపాటు ‘టీ’ (ట్రాన్స్‌జెండర్) ఆప్షన్‌ను చేర్చనుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జోన్లకు రైల్వే బోర్డు లేఖ రాసింది. టికెట్ బుకింగ్, రద్దు ఫారాల్లో ట్రాన్స్‌జెండర్ ఆప్షన్‌ను పొందుపరచాలంది. అంతేగాకుండా సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు చేయాలని ఆదేశించింది. అన్ని దరఖాస్తుల్లో ‘థర్డ్ జెండర్’ ఆప్షన్‌ను ఏర్పాటు చేయాలని 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పాస్‌పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, బ్యాంకు ఫారాల్లో ‘టీజీ’ (థర్డ్ జెండర్), ‘టీ’ (ట్రాన్స్‌జెండర్) ఆప్షన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. -
కలలున్నాయ్... కన్నీళ్లున్నాయ్..!
‘సమాజంలో ఆడ-మగ ఇద్దరే కాదు... మేమూ మనుషులమే! మాకూ మనసుంది. మాకూ కన్నీళ్లున్నాయి. మా జీవితాలు ఎవరికీ పట్టవు... అవహేళనలూ, అపవాదులే తప్ప మా గురించి పట్టించుకున్న వారే లేరు’ ఇవీ హిజ్రాలుగా అందరూ పిలిచే ట్రాన్స్‌జెండర్స్ వ్యధ! నేడు ట్రాన్స్‌జెండర్స్ డే. ఈ సందర్భంగా మనకు ఒక వైపే తెలిసిన వారి జీవితాల్లోని రెండో కోణం... ‘హిజ్రా వ్యవస్థ వేల యేళ్ల నుంచే ఉంది. నాటి నుంచి నేటి వరకు ఏ మార్పూ లేనిది మా హిజ్రాలలోనే!’ అంటూ వేలాది ట్రాన్స్జెండర్ల మానసిక వ్యధను తమ మాటల్లో వినిపించారు వైజయంతి, స్వాతి, నందిని, నమిత, కావేరి, స్నేహలత. వారి ఆవేదన వారి మాటల్లోనే... ‘‘మాలో అందరం గత జీవితంలో మగవాళ్లమే! ఆడవాళ్లుగా మారాలనే కోరిక.. ఆడవాళ్లలాగే దుస్తులు ధరించాలనే ఆరాటం చిన్ననాటి నుంచి కుదురుగా ఉండనిచ్చేవి కావు. అందుకే ఆడవాళ్లలా దుస్తులు ధరించి సంబరపడతాం. అంతకంటే అందంగా తయారవ్వాలని, అలాగే మాట్లాడాలని, అలాగే నాజూగ్గా ఉండాలని తపన పడతాం. ఇది ఇంట్లో వారికి నచ్చదు. కొడతారు. హింసిస్తారు. అయినా మా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇంట్లో నుంచి గెంటివేస్తారు. ఎక్కడికెళ్లాలి?! ఎవరు ఆదుకుంటారు?! అందుకే మా లాంటి వారిని వెతుక్కుంటూ వెళతాం. సెక్స్ మార్పిడి కోసం అప్పులు... మాలాగే హిజ్రాలుగా మారతామంటూ వచ్చేవారూ ఉంటారు. అయితే వెంటనే హిజ్రాగా మార్చేయం. కనీసం ఏడాది పాటు హిజ్రాలతోనే కలిసి ఉండాలి. అన్నిరకాలుగా పరీక్షించి, నమ్మకం కుదిరిన తర్వాత హిజ్రా కుటుంబ పెద్ద అనుమతితో మాలో కలుపుకుంటాం. ఆడవారిలాగ మారడానికి సెక్స్ మార్పిడి(ఎస్.ఆర్.ఎస్- సెక్సువల్ రీ-ఎసైన్మెంట్ సర్జరీ) చేయించుకోవాలనుకుంటాం. అలా చేయించుకున్నవారు మాలో చాలామంది ఉన్నారు. డబ్బులు లేక చేయించుకోని వారు ఎంతోమంది. సెక్స్ మార్పిడికి లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. అందుకోసం అయినవారిదగ్గరే అప్పులు చేస్తాం. ఆ అప్పు తీర్చడానికి ఎన్నో పాట్లు పడతాం. పోరాటమే మా జీవితం... ఆధారం లేని బతుకులు మావి. మేం పుట్టినప్పుడు మా కులాలు వేరు, మా జాతులు వేరు. కానీ హిజ్రాగా మారాకా..!! మా కులం, మతం అంతా ఒక్కటే! మాకు ఉండడానికి సొంత గూడు ఉండదు. అద్దెకు ఎవరూ ఇళ్లు ఇవ్వరు. ఎక్కడో ఒకరు ఇచ్చినా ఆ వీధి వీధి అంతా మమ్మల్ని చూడరాని విధంగా చూస్తారు. వారి మాటలు, చేష్టలు నిత్యం మాకు నరకమే! గుర్తింపు కార్డులు లేవు. బ్యాంకు ఖాతాలు తెలియవు. పొట్ట కూటి కోసం భిక్షాటన, వ్యభిచారం వృత్తిగా ఎంచుకుంటాం. అయినా మాలో కొందరు కష్టపడి బాగా చదువుకున్నవారు ఉన్నారు. కానీ, ఒకరో ఇద్దరికో ఉద్యోగాలు ఉన్నాయి. హిజ్రా అని తెలిసి ఎవరూ పనిలో పెట్టుకోరు. కొందరు సినిమాల్లో నటిస్తున్నవారు ఉన్నారు. మంచి జీవితాల్లో ఉన్నారు. కానీ హిజ్రాలలో 95 శాతం మందిది అత్యంత కష్టతరమైన జీవితమే. లేచింది మొదలు కడుపు నింపుకోవడానికి పడరాని పాట్లు పడాల్సిందే! జీవితంతో పోరాడుతున్నాం. జీవితాంతం పోరాడుతూనే ఉన్నాం. అయినా మేం సంతోషంగానే ఉంటాం. మమ్మల్ని దూరంగా పెట్టిన సమాజంతో మాకేం పని. మేమూ మీలాగే పుట్టాం. మీలాగే జీవిస్తున్నాం. ఈ సృష్టిలో ఆడ-మగ ఎలాగో మేమూ అలాగే! కానీ అడుగడుగునా ఉండే వివక్షే మమ్మల్ని నిత్యం బాధిస్తుంటుంది. యాభై ఏళ్లు పై బడితే మా బతుకులు మరింత దుర్భరం. సంపాదన ఉండదు. సాటి హిజ్రాలే వారి సంపాదనలో సగభాగాన్ని పెద్దవారి పోషణకు ఖర్చుపెడతారు. ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. అయినా భరించుకోవాలి. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉంటే 3 నెలలకోసారి వైద్య పరీక్షలు చేస్తారు. మందులు ఇస్తారు. చనిపోతే సూఫీ మత పద్ధతిలో ఖనన కార్యక్రమాలు ఉంటాయి. భర్తతో కాపురం చేయాలనుకుంటాం.. మాకు ఆడవారు అక్కచెల్లెళ్లతో సమానం. మగవారినే ప్రేమిస్తాం. అభిమానిస్తాం. మమ్మల్ని కావాలనుకునేవారికి ప్రేమగా దగ్గరవుతాం. ఎవరికీ తెలియకుండా పెళ్లిళ్లూ చేసుకుంటాం. నమ్మకంతో వారినీ మా సంపాదనతోనే పోషిస్తాం. కానీ వారు జీవితంలో స్థిరపడ్డాక మమ్మల్ని వదిలేసి పోతారు. ‘నీ అవసరం తీరింద’ని ముఖం మీదే చెప్పేస్తారు. ఆ బాధను ఎవరితో చెప్పుకుంటాం? మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? రుజువులు ఏం చూపించగలం? సమాజంలో అందరికీ పోలీసుల రక్షణ ఉంది. మాకు మాత్రం లేదు. మా కష్టసుఖాలను అర్థం చేసుకునేది మాలో మేమే! అందుకే మాకు మేమే -అమ్మ, అక్క, వదిన, చెల్లె, బిడ్డ.. అవుతాం. మా జట్టులో పెద్దవాళ్లు ఎంత చెబితే అంత! పొల్లుపోకుండా వారి మాటలు వింటాం. వినకపోతే మా వ్యవస్థలో మేమే కఠిన శిక్షలు పెట్టుకొని, అమలు చేసుకుంటాం. పిల్లలు, కుటుంబం కావాలనుకుంటాం... సెక్స్ మార్పిడి చేయించుకున్నా మాకు పిల్లలు కలగరు. హిజ్రాలుగా మారిన పిల్లలను, అనాథలైన ఆడ-మగ పిల్లలను పెంచుకుంటాం. మా కుటుంబాలలోని పిల్లల బాధ్యత కూడా కొన్ని సందర్భాలలో మాకు అప్పజెబుతారు. మా సంపాదనతోనే వారి బాగోగులు చూస్తాం. చదువులు చదివిస్తాం. అలా విశాఖపట్టణంలోనూ, విజయవాడలోనూ పిల్లలను దత్తత తీసుకున్న హిజ్రాలు ఉన్నారు. ఆ పిల్లలు పెద్దయ్యాక మమ్మల్ని చూస్తారనే నమ్మకం లేదు. పెద్దయ్యాక మమ్మల్ని ఛీత్కరించుకుంటారేమో అనే అనుమానమూ లేదు. ప్రేమతోనే దగ్గరకు తీస్తాం. ప్రేమగా పెంచుతాం. ప్రేమనే పంచుతాం. మొన్నీ మధ్య రైలులో ఒక స్త్రీ కాన్పు నొప్పులతో బాధపడుతుంటే పురుడు పోసింది మా హిజ్రానే! ప్రేమిస్తే ప్రాణమిస్తాం. బైరూపులతో ఇబ్బందులు... ఇప్పటికే సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మాలాగా వచ్చే బైరూపులతో ఎన్నో ఇక్కట్ల పాలవుతున్నాం. ఈ బైరూపులు మగాళ్లే! వారికి భార్య, పిల్లలు, ఇళ్లు ఉంటాయి. అయినా హిజ్రాల వేషంతో బలవంతంగా వసూళ్లకు తెగపడతారు. దొంగతనాలు చేస్తారు. తప్పుడు పనులు చేసేది వీరైనా అపవాదు మాత్రం మా మీదే పడుతుంది. వాళ్లలో మమ్మల్నీ కలిపి ఇంకా చులకనగా చూస్తారు. బయట రోడ్లపై కనిపించే వారిలో సగానికి సగం మంది హిజ్రాలు కాదు. ఏ మాత్రం గుర్తింపు లేని మేం జీవనప్రయాణాన్ని కష్టంగా సాగిస్తుంటే బైరూపులనే ఈ మాయగాళ్లతో మాకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ అంటూ తమ సమస్యలను తెలియపరిచారు స్వాతి, నందిని, నమిత, కావేరి, స్నేహలత. కార్పోరేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న వైజయంతి మాట్లాడుతూ- ‘ఉపాధికి ఎన్నో వృత్తులు ఉన్నాయి. కానీ, వాటిని ఇక్కడ హిజ్రాలకు పరిచయం చేసేవారు లేరు. ఈ సమాజం మా కాళ్ల మీద మమ్మల్ని నిలబడనిస్తే చాలని వేడుకుంటున్నాం’’ అని ముగించారు. ఉత్తరాదిన ఇచ్చే గౌరవమర్యాదలు, ప్రభుత్వ పథకాలు అక్కడి హిజ్రాలను ఉన్నతమార్గంలో పయనింప జేస్తున్నాయి. దక్షిణాదిన మాత్రం హిజ్రాలు అట్టడగుస్థాయిలో ఇంకా నిత్యసమరం చేస్తూనే ఉన్నారు. అటు మగవారిలోనూ, ఇటు ఆడవారిలోనూ కలవలేక సమాజంతో ఛీత్కరింపబడుతున్న హిజ్రాలకు సరైన గౌరవం దక్కాలని కోరుకుందాం. - సంభాషణ: నిర్మలారెడ్డి ముస్తాబు మాకు ప్రాణం... మాలో అన్నీ స్త్రీలలో ఉండే భావాలు ఉంటాయి. అందుకే ఆడవారిలాగే ఇంకా చెప్పాలంటే వారికన్నా అందంగా తయారవ్వాలనే ఆలోచన ఎక్కువ. వీధిలో వెళుతుంటే ఆడవారి కన్నా మేమే అందంగా ఉన్నామని మగవారు అనేలా తయారవ్వాలనుకుంటాం. ఆడ-మగ ముస్తాబు ఎంత సహజంగా ఉంటుందో, మేం అలాగే ఇంకా బాగా ముస్తాబు చేసుకుంటాం. నేను ఇప్పటికే సినిమాల్లో నటిస్తున్నాను. నటనలో రాణించాలన్నదే నా ఆశ. మాలో కొంతమంది బ్యూటీషియన్లూ ఉన్నారు. - నమిత మార్పు రావాలి... నేను ఇప్పుడు ప్రసిద్ధ ఎమ్.ఎన్.సి కంపెనీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. వృద్ధులైన నా తల్లిదండ్రులకు అండగా ఉంటున్నాను. నా సహోద్యోగులు నా పనితనాన్ని చూస్తున్నారు. అభినందిస్తున్నారు. అంతే తప్ప ‘నువ్వు ఇలా అని’ ఏనాడూ చిన్నచూపు చూడలేదు. ఇదే దృక్ఫథం అందరిలోనూ రావాలి. హిజ్రాలకూ మనసుంటుందని, వారూ మనుషులని అందరూ భావించాలి. వివక్ష చూపకుండా అందరితో కలిసి అందరూ సంతోషంగా ఉండే రోజులు రావాలి. హిజ్రాలు చదువుకునేందుకు స్కాలర్షిప్లు, ఉద్యోగాలు ఇచ్చి గౌరవంగా జీవించే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. - వైజయంతి వసంత మోగ్లీ (జెండర్ హక్కుల ఉద్యమకారిణి) -
‘గే’లకూ ఒక ప్రతినిధి..!
స్వజాతీయం గే, లెస్బియన్, ట్రాన్స్‌జెండర్స్, హోమో సెక్సువల్స్... మానవ జాతి పరిణామక్రమంలోని ప్రతి దశలోనూ వీళ్లున్నారు. ఒక్కో నాగరకత వీరిని ఒక్కోలా ట్రీట్ చేసింది. ప్రస్తుతం మన దేశంలో అయితే తమను అసహ్యించుకొంటారేమో అనే భయం చాలా మంది ఎల్జీబీటీలను గుట్టుగా బతికేలా చేస్తోంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ బయటకు వస్తున్నారు. సమాజంలో నిరాదరణ ఉంటుందని తెలిసి కూడా తమను తాము గేలుగా, లెస్బియన్లుగా ధైర్యంగా చెప్పుకొంటున్నారు. తామూ మనుషులమేనని అంటున్నారు. తమకూ హక్కులున్నాయంటున్నారు, తమకూ ప్రతిభ ఉందని నిరూపించుకొన్నారు. ఇలాంటి వారిలో ఒకరు నక్షత్రబాగ్వే. ఒక అవార్డు విన్నింగ్ ఫిలిమ్ మేకర్‌గా, దేశంలోని తొలి గే అంబాసిడర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాడితను. ‘లాగింగ్ ఔట్’అనే జీరో బడ్జెట్ సినిమాను రూపొందించి, దాని ద్వారా అవార్డులను పొంది ఉన్నఫళంగా సెలబ్రిటీగా మారాడు నక్షత్ర. కేవలం రెండే రోజులతో... అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. యూట్యూబ్‌లో అప్లోడ్ చే యడంతో నక్షత్ర అనేకమంది దర్శకుల కళ్లలో పడ్డాడు. ఇక సినిమాతో వచ్చిన గుర్తింపు కొత్త సినిమా అవకాశాలను కూడా తెచ్చిపెడుతోంది. ఒక భారతీయ ఫీచర్ ఫిలిమ్‌లోనూ, ఒక అమెరికన్ఫిలిమ్ మేకర్ రూపొందిస్తున్న సినిమాలోనూ నక్షత్ర నటిస్తున్నాడు. ఇలాంటి సమయంలో తన నేపథ్యాన్ని చెప్పుకొంటూ తను గే అన్న విషయాన్ని కూడా ప్రకటించుకొన్నాడు. ఎటువంటి మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నాడు. చాలా మంది ఈ విషయంలో భయపడతారని, అయితే తను ‘గే’ అని ప్రకటించుకొన్నాక కూడా తనను ఎవరూ తక్కువ చేసి చూడలేదని, అలాగే ఆ విషయం గురించి తనను గుచ్చి ప్రశ్నించిన వారు కూడా ఎవరూ లేరని నక్షత్ర చెప్పాడు. నక్షత్ర ఇప్పుడు ఎల్జీబీటీల హక్కుల కోసం గళం విప్పాడు. వాళ్లను మనుషులుగా గుర్తించాలని అంటున్నాడు. ఇందుకోసం మూవ్జ్ అనేక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎల్జీబీటీల కోసమే ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ను ప్రారంభించనున్నారట.