‘కాంచన’ సినిమా గుర్తుందా?! అందులో కాంచన ఓ ట్రాన్స్‌జెండర్. గీత అనే మరో ట్రాన్స్‌జెండర్‌ను చేరదీసి డాక్టర్ చదువు చదివిస్తుంటుంది. ఆ సినిమాలో గీత డాక్టర్ కాకుండానే దుండగులు అడ్డుకుంటారు. నిజ జీవితంలో సమాజంలో మాత్రం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే ఓ ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా ఎదిగింది. ‘‘నా గతం ఓ విషాదం. ఇప్పుడు నేనో డాక్టర్ని’’ అని గర్వంగా చెబుతున్న ఆమె పేరు డాక్టర్ త్రినేత్ర. ‘కర్ణాటక రాష్ట్రంలో మొదటి ట్రాన్స్ ఉమన్ డాక్టర్‌గా త్రినేత్ర హల్దార్ గమ్మరాజు గుర్తింపు పొందింది. బెంగళూరులో త్రినేత్రను ఒకప్పుడు అంగద్ గమ్మరాజు అని పిలిచేవారు. లింగమార్పిడి చేయించుకున్న తర్వాత అంగద్ తన తల్లి దుర్గ పేరు మీద ‘త్రినేత్ర’ అని పేరు మార్చుకుంది. తన కుటుంబ సహకారంతోనే డాక్టర్ని అయ్యానని అంటోంది.
‘‘నేను ట్రాన్స్‌జెండర్‌ని అనే కారణంగా చిన్నప్పటి నుండి చాలా అవమానాలను ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు రకరకాల అసభ్యకర పేర్లతో నన్ను పిలిచేవారు. మొదట్లో నా మనసును అవి విపరీతంగా బాధించేవి. వాటిని అన్నీ సహిస్తూనే చదువు మీద దృష్టి పెట్టాను. ఇటీవలే మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాక్టికల్ సెషన్‌లో ఒక మహిళకు ప్రసవాన్ని చేశాను. ఆ బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం నా జీవితంలో మరపురానిది’’ అని ఆనందంగా వివరించింది త్రినేత్ర. ప్రస్తుతం ఆమె మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ హాస్పిటల్ లో పనిచేస్తోంది. ఈశాన్యభారతంలో బియాన్సీ లాయిష్‌రామ్ ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు ఆ తర్వాత స్థానం దక్షిణ భారత దేశంలో త్రినేత్ర దక్కించుకుంది. లక్ష్యంవైపు గురి ఉంటే ఎన్ని అవమానాలు ఎదురైనా అనుకున్నది సాధించవచ్చు అని నిరూపిస్తోంది త్రినేత్ర. (మగవాళ్ల ఆట మీకెందుకు.. అంతేనా?)
Comments
Please login to add a commentAdd a comment