షిండే డిజైన్ చేసిన గౌన్‌లో విశ్వసుందరి హర్నాజ్ , గౌన్ డిజైనర్ షిండే
ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ వేదికపై విశ్వసుందరి కిరీటంతో మెరిసింది మన హర్నాజ్ సంధు. గ్రాండ్ ఫినాలేలో సిల్వర్ గౌనులో వచ్చి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెను వరించిన విశ్వసుందరి కిరీటానికే వన్నె తెచ్చినట్టుగా కనిపించింది ఆ గౌను. దీంతో ఇనుమడించిన అందంతో వెలిగిపోయింది హర్నాజ్. మన భారతీయ అందాన్ని ప్రపంచ అందాల వేదికపై చూపు తిప్పుకోనియ్యకుండా చేసింది డిజైనర్ సైషా షిండే.
నలభై ఏళ్ల సైషా షిండే ఇండియాలో ఉన్న కొద్దిమంది ట్రాన్స్‌జెండర్ ఫ్యాషన్ డిజైనర్‌లలో ఒకరు. గత పదిహేనేళ్లుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలోనే హర్నాజ్ కోరిక మేరకు సిల్వర్ గౌన్‌ను ఎంతో ప్రత్యేకంగా రూపొందించింది సైషా. ఫుల్‌కారీ ప్యాటర్న్‌కు ఎంబ్రాయిడరీ, స్టోన్స్, సీక్వెన్స్‌లను జోడించి పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా గౌన్‌ను రూపొందించింది.
ముంబైకి చెందిన సైషా షిండే.. ఎనిమిదో తరగతిలో ఉండగా గియన్ని వెర్సేస్ ఫ్యాషన్ షోను టీవీలో చూసింది. ఆ ఫ్యాషన్ షో బాగా నచ్చడంతో..అప్పుడే ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు కూడా ఆ నిర్ణయానికి ఒప్పుకున్నప్పటికీ, ముందు చక్కగా చదువుకోవాలని కండీషన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే చదువుకుంటూ ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. తరువాత మిలాన్ లో ఫ్యాషన్ డిప్లొమా చేసింది. ఫ్యాషన్ షోలలో డిజైనర్‌గా పనిచేస్తోన్న సమయంలో.. మధుర్ భండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం వచ్చింది. దీంతో సినిమాలో ప్రియాంక చోప్రా ధరించిన డ్రెస్‌లన్నీ షిండే రూపొందించి మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకుంది.
ఆ తరువాత ల్యాక్‌మే ఫ్యాషన్ హౌస్’ టీవీ షోలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తరువాత ఆరునెలల ఇంటర్న్‌షిప్ చేసింది. ప్రముఖ డిజైనర్లు పాల్గొనే అమెరికన్ టీవీ సిరీస్ ‘ప్రాజెక్ట్ రన్‌వే’ సీజన్ 14లో పాల్గొని ఆరో స్థానంలో నిలిచింది. ఐశ్వర్యారాయ్, సన్నీలియోన్, కరీనా కపూర్ ఖాన్, కియరా అడ్వాణీ, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే, తాప్సీ పొన్ను, మాధురీ దీక్షిత్ వంటివారికి డిజైనర్‌గా పనిచేసిన షిండే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాల కోసం పోటీపడే మోడల్స్‌ను మరింత అందంగా కనిపించేలా డ్రెస్‌లు రూపొందించడంలో విశేషం ఏముంది? వీటితోపాటు అనేక ఫ్యాషన్ షోలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తూ మంచి డిజైనర్‌గా రాణిస్తోంది.
ఇలా మారింది
సైషా షిండే అసలు పేరు స్వప్నిల్ షిండే. పుట్టినప్పటి నుంచి అబ్బాయిగా పెరిగిన షిండేకు .. అమ్మాయిల్లా తయారవాలని అనిపించేది. ఈ ఇష్టం కూడా ఫ్యాషన్‌ను కెరియర్‌గా ఎంచుకునేందుకు ప్రేరేపించింది. డిగ్రీలో ఉన్నప్పుడే తను అబ్బాయి కాదు అమ్మాయిని అని అర్థమైంది. ఇరవై ఏళ్ల వయసులో తెలిసిన ఆ నిజాన్ని జీర్ణించు కోవడానికి షిండేకు కొన్నేళ్లు పట్టింది. తర్వాత బాగా ఆలోచించుకుని తన నిజమైన రూపంతోనే మిగతా జీవితాన్ని గడపాలనుకుంది. నేను ‘గే’ని కాను .. ట్రాన్స్ ఉమెన్‌ను అని ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి ప్రకటించింది. ఇక నుంచి తన పేరు స్వప్నిల్ షిండే కాదు సైషా షిండే అని స్పష్టం చేసింది. అప్పటి నుంచి సైషా షిండేగా పిలవబడుతోంది.
ఇరవై ఏళ్ల నాటి కల..
ఎన్‌ఐఎఫ్‌టీలో సైషా ఫ్యాషన్ డిగ్రీ చదువుతోన్న సమయంలో లారాదత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. అది చూసిన షిండే ‘‘ఇలా మిస్‌యూనివర్స్ కిరీటం దక్కించుకునే విన్నర్‌కు నేను ఏదోక రోజు డ్రెస్ డిజైన్ చేస్తాను’’ అని మనసులో అనుకుంది. అప్పటి కల ఇప్పుడు హర్నాజ్ రూపంలో తీరింది. హర్నాజ్.. తన గ్రాండ్ ఫినాలే డ్రెస్ ఎలా ఉండాలో చెప్పినప్పుడు ఈమె తప్పకుండా విన్నర్ అవుతుందని షిండే అనుకుంది. హార్నాజ్ కోరుకున్నట్లుగా సిల్వర్ గౌన్ రూపొందించింది. ఇప్పుడు ‘మిస్ యూనివర్స్’ గౌన్ రూపొందించినందుకు ఎంతో సంతోషంగానూ గర్వంగానూ ఉందని షిండే సంబరపడిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment