‘గే’లకూ ఒక ప్రతినిధి..!
స్వజాతీయం
గే, లెస్బియన్, ట్రాన్స్‌జెండర్స్, హోమో సెక్సువల్స్... మానవ జాతి పరిణామక్రమంలోని ప్రతి దశలోనూ వీళ్లున్నారు. ఒక్కో నాగరకత వీరిని ఒక్కోలా ట్రీట్ చేసింది. ప్రస్తుతం మన దేశంలో అయితే తమను అసహ్యించుకొంటారేమో అనే భయం చాలా మంది ఎల్‌జీబీటీలను గుట్టుగా బతికేలా చేస్తోంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ బయటకు వస్తున్నారు.
సమాజంలో నిరాదరణ ఉంటుందని తెలిసి కూడా తమను తాము గేలుగా, లెస్బియన్‌లుగా ధైర్యంగా చెప్పుకొంటున్నారు. తామూ మనుషులమేనని అంటున్నారు. తమకూ హక్కులున్నాయంటున్నారు, తమకూ ప్రతిభ ఉందని నిరూపించుకొన్నారు. ఇలాంటి వారిలో ఒకరు నక్షత్రబాగ్వే. ఒక అవార్డు విన్నింగ్ ఫిలిమ్ మేకర్‌గా, దేశంలోని తొలి గే అంబాసిడర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాడితను.
‘లాగింగ్ ఔట్’అనే జీరో బడ్జెట్ సినిమాను రూపొందించి, దాని ద్వారా అవార్డులను పొంది ఉన్నఫళంగా సెలబ్రిటీగా మారాడు నక్షత్ర. కేవలం రెండే రోజులతో... అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చే యడంతో నక్షత్ర అనేకమంది దర్శకుల కళ్లలో పడ్డాడు.
ఇక సినిమాతో వచ్చిన గుర్తింపు కొత్త సినిమా అవకాశాలను కూడా తెచ్చిపెడుతోంది. ఒక భారతీయ ఫీచర్ ఫిలిమ్‌లోనూ, ఒక అమెరికన్‌ఫిలిమ్ మేకర్ రూపొందిస్తున్న సినిమాలోనూ నక్షత్ర నటిస్తున్నాడు. ఇలాంటి సమయంలో తన నేపథ్యాన్ని చెప్పుకొంటూ తను గే అన్న విషయాన్ని కూడా ప్రకటించుకొన్నాడు. ఎటువంటి మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నాడు.
చాలా మంది ఈ విషయంలో భయపడతారని, అయితే తను ‘గే’ అని ప్రకటించుకొన్నాక కూడా తనను ఎవరూ తక్కువ చేసి చూడలేదని, అలాగే ఆ విషయం గురించి తనను గుచ్చి ప్రశ్నించిన వారు కూడా ఎవరూ లేరని నక్షత్ర చెప్పాడు. నక్షత్ర ఇప్పుడు ఎల్‌జీబీటీల హక్కుల కోసం గళం విప్పాడు. వాళ్లను మనుషులుగా గుర్తించాలని అంటున్నాడు. ఇందుకోసం మూవ్‌జ్ అనేక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎల్‌జీబీటీల కోసమే ఒక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను ప్రారంభించనున్నారట.