అభినా అహెర్
అభినా ఆహెర్ వయసు 44. ముంబయి వాసి. మగపిల్లవాడిగా పుట్టి స్త్రీగా మారింది. ఎకనమిక్స్ అండ్ డిప్లమో ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేసింది. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. కారణం ఆమె సర్టిఫికేట్‌లో జెండర్ ‘మేల్’ అని ఉంది. ఆమె వస్త్రధారణ, హావభావాలు మహిళలా ఉన్నాయి.
ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. కడుపు నింపుకోవడానికి పడుపు వృత్తి ఒక్కటే మార్గమైంది. రెండేళ్ల తర్వాత ఆ వృత్తి నుంచి బయటపడి తనలాంటి వాళ్ల కోసం సర్వీస్ చేసే ఎన్‌జీవోలో ఉద్యోగంలో చేరింది. తనకంటే అధ్వాన్నమెన జీవితాలెన్నో ఉన్నాయని తెలుసుకుంది. ఆ తర్వాత ట్వీట్ (ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ ఈక్విటీ అండ్ ఎంపవర్‌మెంట్ ట్రస్ట్) స్థాపించి తనలాంటి వారి హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తోంది. ‘చదువుకున్నాం... ఉద్యోగం చేస్తాం... ఉద్యోగం ఇవ్వండి. మా జెండర్‌ని గుర్తించండి’ అని పోరాడుతోంది.
రాళ్లతో కొట్టారు
అభినా అహెర్‌కి మూడేళ్ల వయసులోనే తండ్రి పోయాడు. తల్లి మంగళ ముంబయి మున్సిపల్ ఆఫీస్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. మంగళ జానపద నాట్యకారిణి. నాట్యప్రదర్శనలు ఇస్తూ మరాఠీ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటిస్తూ అభిన భవిష్యత్తు కోసం డబ్బు దాస్తుండేది. తల్లి డాన్స్ చేస్తుంటే కళ్లప్పగించి చూసేది అభిన. ఓ రోజు మంగళ ఇంటికి వచ్చేటప్పటికి తల్లి చీర కట్టుకుని, నాట్యకారిణిలా అలంకరించుకుని ఉంది. ‘నీలాగే చేస్తున్నాను చూడు’ అంటూ నాట్యం చేసి చూపించింది.
ఆ క్షణంలో కొడుకుని చూసి మురిసిపోయిందా తల్లి. కానీ అదే పనిగా స్త్రీలాగ ఉండడానికి ప్రయత్నం చేయడాన్ని మాత్రం సహించలేకపోయింది. అప్పటికే ఇరుగుపొరుగు ఎగతాళి మొదలైంది. వద్దని ఎంత చెప్పినా వినని కొడుకు పట్ల తృణీకారం మొదలైంది. తన బిడ్డ గుర్తింపు పురుషుడిగా ఉండాలని తల్లి తాపత్రయం, తన గుర్తింపు స్త్రీగా ఉండాలనేది అభిన ఆకాంక్ష. ఎవరు వద్దన్నా, కాదన్నా సమాజం అభినా అహెర్ గుర్తింపును ‘హిజ్రా’ అని నిర్ధారించేసింది. తోటి పిల్లలు ఏడిపించడం, రాళ్లతో కొట్టడం నిత్యకృత్యమైంది.
అభిన మానసిక క్షోభ తారస్థాయికి చేరి ఆత్మహత్యకు పాల్పడే వరకు వెళ్లింది. ఇన్ని ఆవేదనల మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 27వ ఏట లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని స్త్రీగా మారిపోయింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత హార్మోన్‌లు తగిన మార్పు చెందడానికి కొంత సమయం పట్టింది. ఈ లోపు పరిస్థితులు ఆమె మానసిక ఆరోగ్యాన్ని సవాల్ చేశాయి. అన్నింటికీ ఎదురీది సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టింది.
అసలైన పరీక్ష మొదలైంది. సందేహంగా దేహాన్ని పరిశీలనగా చూసేవారు. సర్టిఫికేట్‌లను, దేహాన్ని మార్చి మార్చి చూసి ‘ఉద్యోగం లేదు’ అనేవారు. కొన్నేళ్లపాటు మాట్లాడడం మానేసిన తల్లి... అభిన స్త్రీగా మారిపోయిన తర్వాత నిస్సహాయ స్థితిలో ‘జెండర్ ఏదయితేనేం. నేను కన్నబిడ్డవి. ఇద్దరి బ్లడ్ గ్రూపూ బీ పాజిటివే. మనిద్దరం ఒకటే’ అని కూతురికి ధైర్యం చెప్పి అండగా నిలిచింది.
ఇది హక్కుల పోరాటం
అభినా అహెర్ తనలాంటి వాళ్ల కోసం పని చేసే హమ్‌సఫర్ ఎన్‌జీవోలో ఉద్యోగంలో చేరింది. హెల్ప్‌లైన్ నంబర్‌కి వచ్చిన ఫోన్‌లు రిసీవ్ చేసుకోవడం, బాధితులకు ధైర్యం ఆమె డ్యూటీ. దాదాపుగా ఎనిమిదేళ్లపాటు ఆ ఉద్యోగంలో తనలాంటి వాళ్లు సమాజంలో ఎదుర్కొనే వెతలు ఎన్ని రకాలుగా ఉంటాయో అర్థమైంది. ట్రాన్స్‌జెండర్‌ల కోసం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయనిపించింది. సొంతంగా 2013లో ట్వీట్ అనే ఎన్‌జీవో స్థాపించింది.
‘‘ట్రాన్స్‌జెండర్స్‌కి కూడా మిగిలిన అందరిలాగానే అన్ని ప్రాథమిక హక్కులూ వర్తిస్తాయనే వాస్తవాన్ని సమాజం మర్చిపోయింది. విద్య, వైద్యం, ఉపాధి హక్కుల పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. నేను స్థాపించిన ట్వీట్ స్వచ్ఛంద సంస్థ ట్రాన్స్‌ఉమెన్, ట్రాన్స్‌మెన్, హెచ్‌ఐవీ బాధితులకు పునరావాస కేంద్రం మాత్రమే కాదు. వాళ్లకు వాళ్ల చదువు, నైపుణ్యాలను బట్టి ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాదే. ఇప్పటి వరకు 250 మందిని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌లలో ఉద్యోగంలో చేర్పించాను.
మాలో డాన్స్ చేయడానికి ఇష్టపడే వాళ్లందరం కలిసి ‘డాన్స్‌క్వీన్స్’ బృందంగా ఏర్పడ్డాం.. వేడుకల్లో నాట్యం చేసి ఆ వచ్చిన డబ్బుతో సంస్థను నడపడానికి ఎల్‌జీబీటీల సహాయం కోసం ఖర్చు చేస్తున్నాం’’ అని చెప్పింది అభినా ఆహెర్. మా అమ్మ కూడా మాతోపాటు నాట్యం చేస్తోందని సంతోషంగా చెప్పింది అభిన. ‘నాట్యం మా తొలి అడుగు మాత్రమే. మా హక్కుల పరిరక్షణ కోసం, జెండర్ మార్చుకున్న వెంటనే మా సర్టిఫికేట్‌లన్నీ మార్చి ఇచ్చేవిధంగా ప్రభుత్వంలో చట్టాల రూపకల్పన కోసం ఉద్యమించడమే మా అసలు లక్ష్యం. సాధించి తీరుతాం’ అని ముక్త కంఠంతో చెబుతున్నారు ట్వీట్ సభ్యులు.
Comments
Please login to add a commentAdd a comment