తన రూపంలో తయారైన బార్బీతో లావెర్న్ కాక్స్
అబ్బాయిల లక్షణాలతో పుట్టిన ఆ చిన్నారికి బార్బీ బొమ్మతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది. కానీ అమ్మాయిలు ఎక్కువగా ఆడుకునే బొమ్మను చిన్నారికి ఇవ్వడం బాగోదని ఆమె తల్లి బార్బీ బొమ్మను కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. చిన్నారి పెరిగి పెద్దదవుతున్నప్పటికీ ఆమె బార్బీతో ఆడుకోవాలన్న ఆశ మరింత పెరుగుతూనే వచ్చింది. అప్పుడప్పుడు మనసుని తీవ్రంగా కలిచి వేస్తుండేది.
నాడు బార్బీకోసం తల్లడిల్లిన ఆ చిన్నారి.. తాజాగా యాభై ఏళ్ల వయసులో తనే ‘బార్బీడాల్’గా మారింది. ఆమె మరెవరో కాదు ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నిర్మాత, నటి, ఎల్‌జీబీటీక్యూ కమ్యునిటి హక్కుల న్యాయవాది అయిన ‘లావెర్న్ కాక్స్’. మే 29న 50వ పుట్టినరోజు సందర్భంగా మ్యాటెల్ సంస్థ కాక్స్‌రూపురేఖలతో బార్బీడాల్‌ను విడుదల చేసింది. దీంతో ‘తొలి ట్రాన్స్ జెండర్ బార్బీ’గా నిలిచి చరిత్ర సృష్టించింది లావెర్న్ కాక్స్.
అమెరికాకు చెందిన లావెర్న్ కాక్స్ నటనలో నిష్ణాతురాలు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్’ వెబ్ సిరీస్‌లో సోఫియా బరెస్ట్ పాత్రలో నటించి మంచిగుర్తిపు తెచ్చుకుంది. నాలుగు సార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్ అవ్వడమేగాక, నిర్మాత ఎమ్మీ అవార్డును గెలుచుకుంది. టెలివిజన్ షో నిర్వహించి తొలి ట్రాన్స్ జెండర్‌గా కూడా నిలిచింది. చుట్టుపక్కల సమాజంలో అనేక వివక్షలను తట్టుకుని ఈ స్థాయికి ఎదిగిన లావెర్న్ బార్బీడాల్‌గా అరుదైన గౌరవం లభించింది. సిల్వర్ మెటాలిక్ బాడీ సూట్‌పైన ముదురు ఎరుపు రంగు గౌను, స్టైలిష్ హెయిర్ స్టైల్, మేకప్‌లో లావెర్న్ బార్బీడాల్‌గా మెరిసిపోతోంది.
పెద్దపెద్ద కలలతో..
చిన్నప్పటి నుంచి బార్బీతో ఆడుకోలేదని బాధపడుతోన్న లావెర్న్ తన రూపంలో ఉన్నæ బార్బీని చూసి తెగ మురిసిపోతూ...‘‘ బార్బీ డ్రెస్ చాలా బావుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్స్ నా బొమ్మ కొంటారేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్ని చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పటికి ట్రాన్స్ చిన్నారులు దాడులకు గురవుతున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఈ దాడులు అడ్డంకిగా మారాయి.
ఇప్పుడు ఈ బార్బీ డాల్ చూసిన చిన్నారులంతా పెద్దపెద్ద కలలతో బంగారు భవిష్యత్తుని నిర్మించుకుంటారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు అబ్బాయిలు, అమ్మాయిలు ఆడుకునే బొమ్మలను వేరుగా చూడకుండా వారి ఆసక్తి ప్రకారం ఆడుకోనిస్తారని ఆశిస్తున్నాను’’ అని లావెర్న్ చెప్పింది. ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్స్‌ని విభిన్నంగా చూసే ఈ సమాజంలో ఈ బార్బీడాల్ కనువిప్పు కలిగించి వాళ్లు కూడా మనలో ఒకరుగా భావించాలని ఆశిద్దాం.
2021 వరకు అందమైన రూపానికి బార్బీ ప్రతీకగా నిలుస్తుండేది. గతేడాది నుంచి సరికొత్త ఇన్నోవేషన్స్‌తో దూసుకుపోతున్న మహిళల గుర్తింపుగా బార్బీ సంస్థ ‘బార్బీ ట్రైబ్యూట్ సిరీస్’ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న మహిళల రూపాలతో బార్బీ సంస్థ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంటర్‌టైన్మెంట్ ఐకాన్ లూసిల్ బాల్, క్వీన్ ఎలిజిబెత్–2, ఇంకా యువతులను సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమ్యాటిక్స్(స్టెమ్)ను చదివేలా ప్రోత్సహించేందుకు నాసాతో కలసి బార్బీని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, ఆస్ట్రోనాట్ రూపం, మహిళా శాస్త్రవేతల రూపాల్లో సందడి చేస్తున్నాయి. ‘‘లావెర్న్ రూపాన్నీ బార్బీగా తీసుకు వచ్చినందుకు మేమెంతో గర్వపడుతున్నాము’’ అని సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment