lgbtq community
-
ఇన్‌స్టా రీల్‌కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య
భోపాల్: ఇన్‌స్టా రీల్‌కు ద్వేషపూరిత కామెంట్లు రావడంతో ఓ ట్రాన్స్‌జెండర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో జరిగింది. దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోకు అసభ్యకరమైన కామెంట్లు వచ్చాయని, ఆ కారణంగానే ఆర్టిస్టు మరణించాడని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అన్నారు. ప్రన్షు(16) ఉజ్జెయినికి చెందిన ట్రాన్స్ జెండర్ సొంతంగా మేకప్ కళను నేర్చుకున్నాడు. మేకప్ ఆర్టిస్టుగా ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా నడుపుతున్నాడు. మేకప్ కళ, బ్యూటీ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుండేవాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే.. ఈ వీడియోకు 4,000 ద్వేషపూరితమైన కామెంట్లు వచ్చాయని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు తెలిపారు. ఈ కారణంగానే ప్రన్షు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి రక్షణ కల్పించడంలో ఇన్‌స్టా యాజమాన్యం విఫలమౌతోందని అన్నాడు. View this post on Instagram A post shared by Trinetra Haldar Gummaraju (@trintrin) ప్రన్షు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని స్థానిక పోలీసులు తెలిపారు. వీడియోకు వచ్చిన కామెంట్ల కారణంగానే ప్రన్షు మరణించాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు -
ఎల్జీబీటీక్యూ సిబ్బందికి మరిన్ని సదుపాయాలు
ముంబై: పని ప్రదేశాల్లో లింగ సమానత్వం పాటించే దిశగా ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే తదితరులు) ఉద్యోగులకు బాసటనివ్వడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా తమ సిబ్బంది, వారి భాగస్వాములకు ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెచ్చినట్లు 24/7డాట్ఏఐ సంస్థ వెల్లడించింది. అలాగే, పేటర్నిటీ, మెటర్నిటీ లీవుల సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. సంస్థ అంతర్గతంగా ఏర్పాటు చేసిన కమిటీకి మిగతా ఉద్యోగుల తరహాలోనే వారు తమ సమస్యలను తెలియజేసి, అవసరమైన సహాయాన్ని పొందేలా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. మరోవైపు, ఆర్పీజీ గ్రూప్ కూడా ప్రైడ్మంత్ సందర్భంగా తమ సంస్థలో ఉద్యోగుల కోసం ఎల్జీబీటీక్యూఏఐప్లస్ అండ్ పార్ట్నర్స్ బెనిఫిట్స్ పాలసీని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. అటు ఆర్–షీల్డ్ పేరిట ప్రత్యేక హెల్ట్లైన్ను కూడా ఏర్పాటు చేసినట్లు సంస్థ చైర్మన్ హర్ష్ గోయెంకా తెలిపారు. -
LGBTQI: అసహజమేనా!.. స్వలింగ సంపర్కంపై మారుతున్న దృక్కోణం
స్వలింగ సంపర్కం. అసహజ లైంగిక ప్రవృత్తి. ఇది కొత్తదేమీ కాదు. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే అన్ని సమాజాల్లోనూ, అన్ని కాలాల్లోలోనూ అనివార్యంగా కన్పించే ధోరణే. కానీ కొన్ని దశాబ్దాల క్రితం దాకా దీనికి సమాజం ఆమోదం లేదు. సరికదా, ఇందుకు పాల్పడే వారిని దోషుల్లా పరిగణిస్తూ హీనంగా చూసే ధోరణే చాలా సమాజాల్లో ఉండేది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్‌ను కూడా గే సెక్స్‌కు పాల్పడ్డారంటూ జైల్లో పెట్టారు! అత్యంత ప్రగతిశీల దేశంగా చెప్పుకునే ఇంగ్లండ్‌లో కూడా వందేళ్ల క్రితం ఇదీ పరిస్థితి! ఇప్పటికీ ఐరాస సభ్య దేశాల్లో 76కు పైగా స్వలింగ సంపర్కులపై వివక్షపూరితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే గత పాతికేళ్లుగా ఈ విషయంలో పౌర సమాజం దృక్కోణంలో చెప్పుకోదగ్గ మార్పు కన్పిస్తోంది. లైంగిక ప్రవృత్తి విషయంలో స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కు వంటిదేనన్న వాదనలూ బయల్దేరాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ సంబంధాలకు సమర్థన 1990ల్లో 20 శాతం లోపే ఉండగా 2020 నాటికి 70 శాతానికి పైగా పెరిగింది! తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అధ్యక్షుడు బైడెన్ సంతకం కూడా చేశారు. ఐక్యరాజ్యసమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, హక్కుల సంఘాలు కూడా స్వలింగ సంపర్కానికి, ఆ వివాహాలకు కొన్నేళ్లుగా ఎంతగానో మద్దతిస్తున్నాయి. స్వలింగ వివాహాలను తొలిసారిగా 2000లో నెదర్లాండ్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 34 దేశాల్లో చట్టపరంగానో, కోర్టు ఆదేశాల రూపేణో అందుకు ఆమోదం లభించింది. ఐరాస సభ్య దేశాల్లో భారత్‌తో పాటు మొత్తం 71 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి. ఆసియా దేశాల్లో... దక్షిణ, మధ్య ఆసియాతో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో స్వలింగ సంపర్కం, వివాహాలపై తీవ్ర వ్యతిరేకత, నిషేధం అమల్లో ఉన్నాయి. ఆసియాలో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది. అలాగే చైనా కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు. అయితే వారి వివాహాన్ని మాత్రం నేరంగానే చూస్తోంది. వియత్నాం కూడా ఇవి నేరం కాదని పేర్కొన్నా ఇంకా పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించలేదు. ఆ దేశాల్లో మరణశిక్షే... సౌదీ అరేబియా, సుడాన్, యెమన్, ఇరాన్‌ల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే! నైజీరియా, సోమాలియాల్లోనూ కొన్ని ప్రావిన్సుల్లో ఇదే పరిస్థితి! అసహజ రతి, వివాహేతర సంబంధాలతో పాటు స్వలింగ సంపర్కులను కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అరబ్ దేశాలతో పాటు పలు ఇరత దేశాల్లో అమల్లో ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ, ఖతార్ వంటి దేశాల్లోనూ ఇందుకు మరణశిక్ష విధించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రూనై మాత్రం స్వలింగ సంపర్కాలకు మరణశిక్ష అమలు చేయబోమని ప్రకటించడం విశేషం. భారత్‌లో పరిస్థితి? మన దేశంలో ఆది నుంచీ స్వలింగ సంపర్కంపై చిన్నచూపే ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వారి హయాంలో దీనిపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు కూడా ఇది ప్రకృతి విరుద్ధమని, శిక్షార్హమైన నేరమేనని 2013లో తీర్పు చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నాన్ బెయిలబుల్ నేరం. దీనికి పదేళ్ల దాకా జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఎంతమాత్రమూ నేరం కాదని పేర్కొంటూ 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఉన్న దేశాలు చిలీ, స్విట్జర్లాండ్, కోస్టారికా, ఈక్వెడార్, తైవాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, మాల్టా, జర్మనీ, కొలంబియా, అమెరికా, గ్రీన్లాండ్, ఐర్లండ్, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, స్కాట్లండ్, ఇంగ్లండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఉరుగ్వే, డెన్మార్క్, అర్జెంటీనా, పోర్చుగల్, ఐస్లాండ్, స్వీడన్, మెక్సికో, నార్వే, దక్షిణాఫ్రికా, స్పెయిన్, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, తైవాన్ ఏమిటీ ఎల్జీబీటీక్యూఐ? ► రకరకాల అసహజ లైంగిక ప్రవృత్తులున్న వారందరినీ కలిపి ఎల్జీబీటీక్యూఐ అని వ్యవహరిస్తుంటారు. ► ఇది లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్ సెక్స్‌కు సంక్షిప్త నామం. ► ఇద్దరు మహిళల మధ్య ఉండే లైంగికాసక్తి లెస్బియనిజం. ఇలాంటివారిని లెస్బియన్‌గా పిలుస్తారు. అదే పురుషుల మధ్య ఉంటే వారిని గే అంటారు. ► సందర్భాన్ని బట్టి ఎవరి మీదనైనా ఆకర్షణ చూపేవారు బై సెక్సువల్. ► ఇక పుట్టినప్పుడు ఆడ/మగగా ఉండి, పెరిగి పెద్దయ్యాక అందుకు భిన్నంగా మారేవారిని/మారేందుకు ఆసక్తి చూపేవారిని ట్రాన్స్‌జెండర్/ట్రాన్స్ సెక్సువల్ అంటారు. అంటే తృతీయ ప్రకృతులన్నమాట. మన దగ్గర హిజ్రాలుగా పిలిచేది వీరినే. దేశవ్యాప్తంగా వీరికి రకరకాల పేర్లున్నాయి. మళ్లీ వీరిలో చాలా రకాల వారుంటారు. ఉదాహరణకు మగ పిల్లాడిగా పుట్టి కూడా తనను తాను అమ్మాయిగా భావించుకుంటూ మరో అబ్బాయిని ఇష్టపడేవాళ్లు ఈ కోవలోకే వస్తారు. ఇలాంటివారిని హెటిరో సెక్సువల్ ట్రాన్స్‌జెండర్ అంటారు. ► క్యూ అంటే క్వీర్. వీరికి తాము ఆడా, మగా, ట్రాన్స్‌జెండరా, మరోటా అన్నదానిపై వాళ్లకే స్పష్టత ఉండదు. అందుకే వీరిని క్వశ్చనింగ్ అని కూడా అంటూంటారు. ► చివరగా ఇంటర్‌సెక్స్. అంటే పుట్టినప్పుడు జననాంగాల స్థితిగతులను బట్టి ఆడో, మగో చెప్పలేనివారు. మళ్లీ వీరిలోనే క్రాస్డ్రెస్సర్స్ అనీ, మరోటనీ పలు రకాలున్నాయి. ► ఎల్జీబీటీక్యూఐ మొత్తాన్నీ కలిపి ఇటీవల కామన్‌గా గే గా వ్యవహరిస్తున్నారు. ► వీరు తమ ఆకాంక్షలకు ప్రతీకగా తరచూ ఆరు రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ జెండా ఒకరకంగా ఎల్జీబీటీక్యూఐ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా మారిపోయింది. అమెరికాలో స్వలింగ వివాహాలు ఇక చట్టబద్ధం బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం మధ్యాహ్నం వేలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. స్వలింగ వివాహాలకు వీలు కల్పించే బిల్లు చట్టరూపం దాల్చడమే వారి ఆనందానికి కారణం. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిన స్వలింగ వివాహాల(గే, లెస్బియన్ మ్యారేజెస్) బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బిల్లు ఇక చట్టంగా మారింది. ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు ఇది చాలా ప్రాధాన్యం అంశమని అన్నారు. బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేసే కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేసిన వారికి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీచ్‌లో ఉంగరాలు మార్చుకుని ఒక్కటైన లెస్బియన్ జంట.. ఫొటోలు వైరల్..
తిరువనంతపురం: కేరళకు చెందిన లెస్బియన్ జంట అదిలా నసరీన్, ఫాతిమా నూరా ఎట్టకేలకు ఒక్కటయ్యింది. బీచ్‌లో ఘనంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కోర్టు తీర్పుతో ఈ ఇద్దరూ స్కూల్లో చదువుకునే సమయం నుంచే స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలనుకున్నారు. కానీ ఈ జంట ప్రేమ విషయం తెలిసినప్పుడు ఇద్దరి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సమాజంలో తమ పరువు ఏమవుతుందని ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది మేలో ఇద్దరూ కోజికోడ్ పారిపోయారు. ఎల్జీబీటీక్యూ సొసైటీ ఆశ్రమంలో ఉన్నారు. అయితే తల్లిదండ్రులు వారి వద్దకు వెళ్లి పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లను తీసుకెళ్లారు. కానీ ఇంటికెళ్లాక పెళ్లి కుదరదని మాట మార్చారు. తన ప్రేమను దక్కించుకునేందుకు నసరీన్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు అనుకూలంగా వచ్చింది. వీరిద్దరికి కలిసి జీవించే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టబద్దమైన చిక్కులు వీడటంతో ఎల్జీబీటీక్యూ సొసైటీ వీరి కోసం బీచ్‌లో వేడుక ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లోనే ఇద్దరూ రింగ్‌లు మార్చుకుని ఒక్కటయ్యారు. లెహంగా ధరించి, పూలదండలు వేసుకుని ఎంతో సంతోషంగా కన్పిస్తున్న ఈ జంట ఫొటోలను నసరీన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీచ్‌లో ఇలాంటి ఫొటో షూట్లు నిర్వహించడం ఆసక్తిగా ఉందని నసరీన్ చెప్పింది. భవిష్యత్తులో తామిద్దరం పెళ్లి చేసుకుంటామని పేర్కొంది. తండ్రి పేరుతో ఇబ్బంది.. నసరీన్, ఫాతిమా కుటుంబాలు వీళ్లను దూరం పెట్టాయి. అయితే ఇంకా ఏవైనా ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు తల్లిదండ్రుల పేర్లు ఉపయోగించాల్సి వస్తోందని, ఇది తమకు ఇబ్బందిగా ఉందని నజరీన్ చెబుతోంది. ఇటీవల తామిద్దరం ఆస్పత్రిలో చేరినప్పుడు హాస్పిటల్ ఫాంలో తండ్రి పేరు అడిగారని చెప్పుకొచ్చింది. స్వలింగ సంపర్క వివాహాలకు భారత్‌లో ఇంకా చట్టబద్దత లేదు. సేమ్ సెక్స్ రిలేషన్స్ నేరమని నిబంధనలు ఉన్నప్పటికీ 2018లో వాటిని నిలిపివేశారు. అయితే కొంతమంది స్వలింగ సంపర్కులు మాత్రం వేడుకలు నిర్వహించి అధికారికంగా ఒక్కటవుతున్నారు. ఘనంగా వివాహాలు కూడా చేసుకుంటున్నారు. చదవండి: పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు.. -
తొలి ట్రాన్స్ బార్బీ!
అబ్బాయిల లక్షణాలతో పుట్టిన ఆ చిన్నారికి బార్బీ బొమ్మతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది. కానీ అమ్మాయిలు ఎక్కువగా ఆడుకునే బొమ్మను చిన్నారికి ఇవ్వడం బాగోదని ఆమె తల్లి బార్బీ బొమ్మను కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. చిన్నారి పెరిగి పెద్దదవుతున్నప్పటికీ ఆమె బార్బీతో ఆడుకోవాలన్న ఆశ మరింత పెరుగుతూనే వచ్చింది. అప్పుడప్పుడు మనసుని తీవ్రంగా కలిచి వేస్తుండేది. నాడు బార్బీకోసం తల్లడిల్లిన ఆ చిన్నారి.. తాజాగా యాభై ఏళ్ల వయసులో తనే ‘బార్బీడాల్’గా మారింది. ఆమె మరెవరో కాదు ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నిర్మాత, నటి, ఎల్జీబీటీక్యూ కమ్యునిటి హక్కుల న్యాయవాది అయిన ‘లావెర్న్ కాక్స్’. మే 29న 50వ పుట్టినరోజు సందర్భంగా మ్యాటెల్ సంస్థ కాక్స్రూపురేఖలతో బార్బీడాల్ను విడుదల చేసింది. దీంతో ‘తొలి ట్రాన్స్ జెండర్ బార్బీ’గా నిలిచి చరిత్ర సృష్టించింది లావెర్న్ కాక్స్. అమెరికాకు చెందిన లావెర్న్ కాక్స్ నటనలో నిష్ణాతురాలు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్’ వెబ్ సిరీస్‌లో సోఫియా బరెస్ట్ పాత్రలో నటించి మంచిగుర్తిపు తెచ్చుకుంది. నాలుగు సార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్ అవ్వడమేగాక, నిర్మాత ఎమ్మీ అవార్డును గెలుచుకుంది. టెలివిజన్ షో నిర్వహించి తొలి ట్రాన్స్ జెండర్‌గా కూడా నిలిచింది. చుట్టుపక్కల సమాజంలో అనేక వివక్షలను తట్టుకుని ఈ స్థాయికి ఎదిగిన లావెర్న్ బార్బీడాల్గా అరుదైన గౌరవం లభించింది. సిల్వర్ మెటాలిక్ బాడీ సూట్పైన ముదురు ఎరుపు రంగు గౌను, స్టైలిష్ హెయిర్ స్టైల్, మేకప్‌లో లావెర్న్ బార్బీడాల్గా మెరిసిపోతోంది. పెద్దపెద్ద కలలతో.. చిన్నప్పటి నుంచి బార్బీతో ఆడుకోలేదని బాధపడుతోన్న లావెర్న్ తన రూపంలో ఉన్నæ బార్బీని చూసి తెగ మురిసిపోతూ...‘‘ బార్బీ డ్రెస్ చాలా బావుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్స్ నా బొమ్మ కొంటారేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్ని చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పటికి ట్రాన్స్ చిన్నారులు దాడులకు గురవుతున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఈ దాడులు అడ్డంకిగా మారాయి. ఇప్పుడు ఈ బార్బీ డాల్ చూసిన చిన్నారులంతా పెద్దపెద్ద కలలతో బంగారు భవిష్యత్తుని నిర్మించుకుంటారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు అబ్బాయిలు, అమ్మాయిలు ఆడుకునే బొమ్మలను వేరుగా చూడకుండా వారి ఆసక్తి ప్రకారం ఆడుకోనిస్తారని ఆశిస్తున్నాను’’ అని లావెర్న్ చెప్పింది. ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్స్‌ని విభిన్నంగా చూసే ఈ సమాజంలో ఈ బార్బీడాల్ కనువిప్పు కలిగించి వాళ్లు కూడా మనలో ఒకరుగా భావించాలని ఆశిద్దాం. 2021 వరకు అందమైన రూపానికి బార్బీ ప్రతీకగా నిలుస్తుండేది. గతేడాది నుంచి సరికొత్త ఇన్నోవేషన్స్‌తో దూసుకుపోతున్న మహిళల గుర్తింపుగా బార్బీ సంస్థ ‘బార్బీ ట్రైబ్యూట్ సిరీస్’ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న మహిళల రూపాలతో బార్బీ సంస్థ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంటర్టైన్మెంట్ ఐకాన్ లూసిల్ బాల్, క్వీన్ ఎలిజిబెత్–2, ఇంకా యువతులను సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమ్యాటిక్స్(స్టెమ్)ను చదివేలా ప్రోత్సహించేందుకు నాసాతో కలసి బార్బీని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, ఆస్ట్రోనాట్ రూపం, మహిళా శాస్త్రవేతల రూపాల్లో సందడి చేస్తున్నాయి. ‘‘లావెర్న్ రూపాన్నీ బార్బీగా తీసుకు వచ్చినందుకు మేమెంతో గర్వపడుతున్నాము’’ అని సంస్థ తెలిపింది. -
షాదీడాట్‌కామ్ సంచలన నిర్ణయం
పాపులర్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ షాదీడాట్‌కామ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏ మ్యారేజ్ మ్యాట్రిమోనియల్ వేయని అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కోసం ఓ ప్లాట్‌పామ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. LGBTQ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) కమ్యూనిటీ, విదేశాల్లో నివసించేవాళ్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్ సేవల్ని అందించబోతుందట షాదీడాట్‌కామ్. సేమ్ సెక్స్ రిలేషన్‌షిప్స్‌పై అవాంతరాలను సుప్రీం కోర్టు తీర్పు తొలగించిన నాలుగేళ్లకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే షాదీడాట్‌కామ్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ‘వివిధ ప్రాంతాలను, దేశాలను, జెండర్లను దృష్టిలో పెట్టకుని ఈ అడుగు వేస్తున్నాం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయినా ఫర్వాలేదు. కేవలం అవసరం అయినవాళ్లకు ‘తోడు’ అందించాలనే దానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని సీఈవో అనుపమ్ మిట్టల్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి లాభాపేక్షకు దూరంగా ఉంటోంది షాదీడాట్‌కామ్. వాస్తవానికి కాజువల్ డేటింగ్ కంపెనీల్లాంటివి ఈ ఏడాదిలో సగం బిలియన్ దాకా ఆదాయం వెనకేసుకున్నాయనే అంచనాల నడుమ.. షాదీడాట్‌కామ్ మాత్రం ఆ లిస్ట్‌కు పూర్తి దూరంగా ఉంది. జీవిత భాగస్వామిని వెతకడం తామోక వ్యాపారంగా చూడట్లేదని ప్రకటించుకుంటోంది షాదీడాట్‌కామ్. మరిన్ని సర్వీసులు.. 1996లో Sagaai.comగా మొదలై ఆ తర్వాత షాదీడాట్‌కామ్ గా పేరు మార్చేసుకుంది. భారత్‌తో పాటు పాక్, బంగ్లాదేశ్, మరికొన్ని దేశాల్లో మ్యాచ్‌మేకింగ్ సెంటర్లతో రిటైల్ నెట్‌వర్క్‌లను సైతం నడిపిస్తోంది. భారత్‌మ్యాట్రిమోనీ, జీవన్సాథీ డాట్కామ్లకు గట్టిపోటీ ఇస్తోంది. వీటితో పాటు కమ్యూనిటీలకు తగ్గట్లు సంగం పేరుతో మరో ప్లాట్‌ఫామ్‌ను నడిపిస్తోంది. కరోనా టైంలో షాదీమీట్ పేరుతో వెడ్డింగ్ ప్రిపరేషన్ గైడ్‌ను లాంఛ్ చేసింది. తద్వారా ఆన్లైన్లోనే తోడు వెతుక్కునేందుకు లక్షల మందికి వీలు కలిగింది. అయితే ఈ ఐడియా అనుకున్నంత సక్సెస్ కాపోయినా.. పెద్ద నష్టమేమీ లేదని ప్రకటించుకుంది కంపెనీ. -
షాకిచ్చిన స్టార్ హీరోయిన్.. సహనటితో ఎంగేజ్మెంట్
Kristen Stewart And Dylan Meyer Are Engaged: ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టెవర్ట్ షాకింగ్ ప్రకటన చేశారు. సహనటి డైలాన్ మేయర్‌తో తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. రెండేళ్ల నుంచి తాము డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించారు. అయితే వీరద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజా ప్రకటనతో వీరి బంధం గురించి జనాలకు ఓ క్లారిటీ వచ్చింది. సైరస్ఎక్స్ఎం ది హోవార్డ్ స్టెర్న్ షోకు గెస్ట్‌గా వచ్చిన క్రిస్టెన్ తన ఎంగేజ్మెంట్ వార్తను ప్రకటించారు. పెళ్లి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్టెన్ మాట్లాడుతూ.. ‘‘అతి త్వరలో నేను, డైలాన్ వివాహం చేసుకోబోతున్నాం. మేం ఒకరి కోసం ఒకరం జీవించాలని కోరుకుంటున్నాం. నా కోసం తను.. డైలాన్ కోసం నేను.. మమ్మల్ని మార్చుకున్నాం. మేం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం’’ అని తెలిపారు. (చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం) ఇక క్రిస్టెన్, డైలాన్ 2019 నుంచి డేటింగ్లో ఉన్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ ఇరువురు ఈ వార్తలపై స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టైల్ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూ సందర్భంగా క్రిస్టెన్ తనకు, డైలాన్‌కు మధ్య ఉన్న అనుబంధం గురించి వివరించారు. ‘‘నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ని కలవడానికి ప్రతిరోజు బయటకు వెళ్లేదాన్ని. తనతో ఆప్యాయంగా ఉన్న సమయంలో నన్ను ఫోటో తీయడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. కానీ నేను వాటి గురించి పట్టించుకునేదాన్ని కాదు’’ అన్నారు. ‘‘నేను ఎంతో ఒత్తిడిని అనుభవించాను. కానీ ఈ ఒత్తిడి నన్ను నేను ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన దాన్ని అని ఫీల్ అయ్యేలా చేయలేదు. జనాలు నాకు సంబంధించిన ఫోటోలు చూస్తున్నారు.. వార్తలు చదువుతున్నారు. ఆ తర్వాత వారు బయటకు వచ్చి తమ గురించి ప్రకటించుకోగలుగుతున్నారు. ఈ విషయంలో చిన్నతనంలో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. నాలా బాధపడేవారికి ఉపశమనం కలిగించేందుకు నేను చేస్తున్న ప్రయత్నాలు నాకు తృప్తిని ఇస్తున్నాయి’’ అని తెలిపారు. (చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో నటి రహస్య వివాహం!) డైలాన్ మేయర్ ఒక నటి, రచయిత. ఆమె మోక్సీ, రాక్ బాటమ్, మిస్ 2059 వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందింది. క్రిస్టెన్ స్టెవర్ట్ తదుపరి స్పెన్సర్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె యువరాణి డయానాగా నటించనుంది. క్రిస్టెన్ స్టీవర్ట్ గతంలో సూపర్ మోడల్ స్టెల్లా మాక్స్వెల్, ట్విలైట్ సహనటుడు రాబర్ట్ ప్యాటిన్సన్లతో డేటింగ్ చేసింది. చదవండి: ముచ్చటగా మూడోసారి బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్మెంట్.. వైరల్ -
14 ఏళ్ల బంధం.. నేను, సిద్ధాంత్ విడిపోతున్నాం: దర్శకుడు
బాలీవుడ్లో మొట్టమొదటి స్వలింగ సంపర్క జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు అపూర్వ అస్రానీ, మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధాంత్ పిల్లై. గత 14 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితమే సొంతంగా ఇళ్లు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అపూర్వ అస్రానీ శనివారం సంచలన ప్రకటన చేశాడు. తామిద్దరం విడిపోతున్నామని.. 14 ఏళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ‘‘మా ప్రయాణంలో కొన్ని తప్పులు చేశాం’’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ప్రకటన చేశాడు అపూర్వ అస్రానీ. దాంతో పాటు ఓ నోట్‌ని కూడా షేర్ చేశాడు. దీనిలో.. ‘‘నేను, సిద్ధాంత్ విడిపోతున్నట్లు ప్రకటించడానికి చాలా బాధపడుతున్నాను. దేశంలో చాలా మంది ఎల్జీబీటీక్యూ కపుల్స్‌కి మేం ఆదర్శంగా నిలిచాం. ఈ విషయం వారందరిని నిరాశపరుస్తుందని నాకు తెలుసు. కానీ ఈ 14 ఏళ్ల కాలంలో ప్రతి రోజు ఎంతో ముఖ్యమైనది.. విలువైనది. ఇన్నేళ్ల తర్వాత మేం స్నేహపూర్వకంగా విడిపోతున్నాం’’ అని తెలిపాడు ‘‘మన దేశంలో స్వలింగ సంపర్క జంటకు ఎలాంటి ప్రేరణలు, ఆదర్శాలు ఉండవు. మేం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేకమైన మార్గంలో కొన్ని తప్పులు చేశాం. స్వలింగ సంపర్కులమైనప్పటికి మా ప్రేమ గురించి ధైర్యంగా ప్రకటించాం.. అంతేకాక కలిసి ఉండాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తొలి తరం ఎల్జీబీటీక్యూ జంట మేమే. దీని గురించి చెప్పడానికి నాకు ఎలాంటి బాధ లేదు. కానీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మా ప్రయాణంలో కూడా ఆ మార్పులు వచ్చాయి. దాంతో మేం విడిపోక తప్పడం లేదు’’ అన్నాడు. ‘‘ఈ సందర్భంగా మీ అందరిని కోరిది ఒక్కటే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా గోప్యతని, మనోభావాలని గౌరవించాలని కోరుకుంటున్నాను. ఎలాంటి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ మెసేజ్‌లలో కూడా మమ్మల్ని ట్యాగ్ చేయవద్దు. భవిష్యత్తుపై నమ్మకం ఉందనే మాటతో దీన్ని ముగించాలనుకుంటున్నాను. సిద్, నేను అనే కాదు మాలో ప్రతి ఒక్కరం కోరుకునేది ప్రేమ, కమిట్మెంట్, సురక్షితమైన నివాసం. నమ్మకంపై ఆశలు వదులుకోకండి’’ అంటూ అపూర్వ అస్రానీ ఈ నోట్‌ని ముగించాడు. View this post on Instagram A post shared by Apurva (@apurva_asrani) ఇక కొద్ది రోజుల క్రితం అపూర్వ నటి సంధ్య మ్రిదులతో కలిసి ఉన్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిలో ఆమెని మ్యాచ్‌మేకర్ అని.. తనను మ్యాచ్ చేసింది అని తెలిపాడు. అపూర్వ అస్రానీ, సిద్ధాంత్ గతేడాది గోవాలో సొంతంగా ఇల్లు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘‘గత 13 ఏళ్లుగా మమ్మల్ని కజిన్స్‌గా చెప్పుకుంటూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా గురించి చుట్టుపక్కల వారికి తెలియకుండా ఉండటం కోసం గది తలుపులు మూసి ఉంచేవాళ్లం. కొద్ది రోజుల క్రితం మా సొంత ఇంటిని కొనగోలు చేశాం. మేం పార్ట్నర్స్మని ఇప్పుడు మా ఇరుగుపొరుగు వారికి మేమే స్వచ్ఛందంగా చెప్తున్నాం. ఎల్జీబీటీక్యూ కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి ఈ ప్రకటన చేస్తున్నాం’’ అంటూ ట్వీట్ అపూర్వ ట్వీట్ చేశాడు. ఇలా ప్రకటించిన ఏడాదిలోపే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చాడు. For 13 years we pretended to be cousins so we could rent a home together. We were told 'keep curtains drawn so neighbors don't know 'what' you are'. We recently bought our own home. Now we voluntarily tell neighbors we are partners 💕. It's time LGBTQ families are normalised too. pic.twitter.com/kZ9t9Wnc7i — Apurva (@Apurvasrani) May 29, 2020 చదవండి: ‘ప్రియురాలి’తో మహిళ.. తీసుకెళ్లిన పోలీసులు 'గే'ల కోసం మాట్లాడితే రూ.10 లక్షల ఫైన్ -
వివక్షపై విజయానికి రెండేళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించి నేటికి రెండేళ్లు పూర్తయ్యింది. ఎల్జీబీటీలపై (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) 157 ఏళ్ల పాటుసాగిన విపక్షపై విజయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయాన్ని లిఖించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్‌నటి ప్రియాంక చోప్రా నాటి జడ్జ్మెంట్ను గుర్తుచేస్తూ తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. చారిత్రాత్మక తీర్పుకు రెండేళ్లు అంటూ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా తీవ్ర వివక్షకు గురవుతున్న ఎల్జీబీటీకు సుప్రీం తీర్పుతో న్యాయం జరిగిందని గ్లోబర్ స్టార్ ప్రియాంక అభిప్రాయపడ్డారు. కేసు పూర్వాపరాలు తెలుసుకుందాం.... స్వలింగ సంపర్కం నేరం కాదని 2019 సెప్టెంబర్ 6న చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కింద గే సెక్స్‌లో పాల్గొనే వారికి శిక్ష విధించడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ డీవై చంద్రచుద్, రోహింటన్ ఫాలి నారీమన్, ఏఎం ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాలతో కూడిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గే సెక్స్‌ను నేరంగా పరిగణించడం సహేతుకం కాదని జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్ (ఎల్జీబీటీ)లకు కూడా ఇతర పౌరుల్లాగే సమాన హక్కులు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 ప్రకారం ఇప్పటి వరకూ హోమో సెక్స్ నేరం. అంటే ప్రకృతి విరుద్ధంగా.. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో లేదా జంతువులతో అసహజ లైంగిక చర్యలకు పాల్పడటం శిక్షార్హం. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. 1861 నాటి చట్టం ప్రకారం గే సెక్స్‌లో పాల్గొనే వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 1533 నాటి (బగ్గరీ యాక్ట్) ఆధారంగా నాటి బ్రిటీష్ పాలనలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. హోమో సెక్స్ సహా అసహజ శృంగారానికి పాల్పడటం సెక్షన్ 377 ప్రకారం నేరం. ఈ చట్టం తొలినుంచి వివాదాస్పదమవుతూనే ఉంది. హిజ్రాలను థర్డ్ జెండర్‌గా గుర్తించాలి... సెక్షన్ 377 వివాదం తొలిసారిగా 2001లో తెరమీదకు వచ్చింది. నాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీవోతోపాటు ఎయిడ్స్ బేదభావ్ విరోధ్ ఆందోళన్లు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు వేయగా.. వాటిని న్యాయస్థానం కొట్టివేసింది. హోమో సెక్సువాలిటీ నేరం కాదని ఎనిమిదేళ్ల తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. కానీ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయగా.. 2013లో అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హిజ్రాలను థర్డ్ జెండర్‌గా గుర్తించాలని 2014లో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వారిని ఓబీసీ కోటాలో చేర్చాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఎల్జీబీటీ కమ్యూనిటీలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే నాజ్ ఫౌండేషన్ జడ్జిమెంట్‌ను పునః పరిశీలించాలని కోరుతూ ఐదుగురు పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరిలో ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ పిటీషన్‌ను పరిశీలించింది. ఈ కేసును ఐదుగురు సభ్యుల బెంచ్‌కు రిఫర్ చేశారు. దీనిపై జోక్యం చేసుకుని తమ అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా కేంద్రాన్ని సైతం సుప్రీం కోరింది. ఈ రిట్ పిటీషన్లను చర్చిల సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు, కొన్ని ఎన్జీవోలు తీవ్రంగా వ్యతిరేకించాయి. గత జులైలో సెక్షన్ 377 విషయం సుప్రీంలో వాదనకు వచ్చింది. హోమో సెక్సువాలిటీ అనేది ఉల్లంఘన కాదు, వైవిధ్యం మాత్రమేనని జూలై 12న విచారణ సందర్భంగా జస్టిస్ ఇందు మల్హోత్రా అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, సమాజం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో ఇలాంటి వారు తమకు నచ్చుకున్నా అపోజిట్ సెక్స్ ఉన్నవాళ్లను పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల బై సెక్సువాలిటీ, ఇతర మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సెక్షన్ 377 కాలరాస్తోందని పిటిషనర్లు వాదించారు. సెప్టెంబర్ 6, 2018న హోమోసెక్సువాలిటీ నేరం కాదని ఐదుగురు జడ్జిల బెంచ్ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. చరిత్ర క్షమాపణ చెప్పాలి చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లు) సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. -
'గే'ల కోసం మాట్లాడితే రూ.10 లక్షల ఫైన్
పాప్ గాయని మడోన్నాకు రష్యా ప్రభుత్వం 10 లక్షల రూపాయల జరిమానా వేసిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ఎనిమిదేళ్ల క్రితం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూలకు మద్దతు తెలుపుతూ మాట్లాడినందుకు ప్రభుత్వం 1 మిలియన్ డాలర్ల జరిమానా విధించిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె 2012లో రష్యా టూర్‌కు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్జీబీటీక్యూల హక్కుల కోసం మాట్లాడారు. వారికి అందరితోపాటు సమాన గౌరవం, సమాన హక్కులు కల్పించాలని గొంతెత్తి నినదించారు. ఆమె ఉపన్యాసానికి అభిమానుల చప్పట్లతో, ఈలలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అయితే రష్యా ప్రభుత్వానికి మాత్రం ఇది మింగుడుపడనట్లుంది. ఫలితంగా ఆమెకు పది లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ రుసుమును కాస్త తగ్గించిందని మడోన్నా తెలిపారు. కానీ తాను మాత్రం ఇప్పటివరకు పైసా కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. తాజాగా ఆనాటి చేదు సంఘటనను అభిమానులతో పంచుకోవడంతోపాటు, "గే"లకోసం మాట్లాడిన వీడియోను సైతం గాయని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!) View this post on Instagram 8 years ago. I was fined 1 million dollars by The government for supporting the Gay community. I never paid.................... #freedomofspeech #powertothepeople #mdna A post shared by Madonna (@madonna) on Jul 19, 2020 at 7:42pm PDT -
నేను గే కాదు; క్లారిటీ ఇచ్చిన ఫాల్క్‌నర్
‘నిన్న రాత్రి నేను చేసిన పోస్టు అపార్థాలకు దారి తీసింది. నేను స్వలింగ సంపర్కుడిని(గే) కాదు. ఏదేమైనప్పటికీ ఎల్బీజీటీ కమ్యూనిటీ నుంచి నాకు అద్భుతమైన మద్దతు లభించింది. ఈ విషయాన్ని నేనెన్నటికీ మరచిపోలేను. ఎవరిదైనా ప్రేమే. ఇక రోబుస్టా నాకు మంచి స్నేహితుడు. ఇంకో విషయం.. రాత్రి చెప్పినట్లు ఐదేళ్లుగా కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉంటున్నామని ఉద్దేశం. అయినా ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో మద్దతుగా నిలవడం చాలా బాగుంది’ అంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ తాను గేను కానని స్పష్టం చేశాడు. కాగా సోమవారం తన 29వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను ఫాల్క్‌నర్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ‘నా బాయ్‌ఫ్రెండ్ రొబుస్టాతో పాటు మా అమ్మతో కలిసి పుట్టిన రోజు డిన్నర్’ అంటూ టుగెదర్ఫర్5ఇయర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఫాల్క్‌నర్ గే అని, స్వలింగ సంపర్కుడినంటూ ప్రకటన చేసిన తొలి ఆసీస్ క్రికెటర్ అని పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఫాల్క్‌నర్‌తో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కూడా ఈ కథనాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి కరీనా కేస్లెర్ మాట్లాడుతూ.. ‘ వ్యాపార భాగస్వామి, హౌజ్‌మేట్ అయిన స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధం గురించి ఫాల్క్‌నర్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. అతడు చేసిన ఈ జోక్ కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాం. పత్రికలు కూడా ఈ విషయం గురించి ప్రచురించే ముందు అతడిని సంప్రదించలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఎల్జీబీటీ కమ్యూనిటీకి జేమ్స్, సీఏ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టి20లు ఆడిన ఫాల్క్‌నర్... ఏడాదిన్నరగా జట్టులోకి ఎంపిక కాలేదు. కాగా, తాను ‘గే’నంటూ చెప్పుకొన్న తొలి అంతర్జాతీయ క్రికెటర్ ఇంగ్లండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్. 2011లో అతడీ మేరకు ప్రకటన చేశాడు. View this post on Instagram There seems to be a misunderstanding about my post from last night, I am not gay, however it has been fantastic to see the support from and for the LBGT community. Let’s never forget love is love, however @robjubbsta is just a great friend. Last night marked five years of being house mates! Good on everyone for being so supportive. A post shared by James Faulkner (@jfaulkner44) on Apr 29, 2019 at 5:07pm PDT -
ముకేశ్, అరుంధతిలకు ‘టైమ్’
న్యూయార్క్: రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ప్రజా ప్రయో జన వ్యాజ్యాలతో మానవ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామిలకు అరుదైన గుర్తింపు లభించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది రూపొందించే ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపించిన 100 మంది జాబితాలో భారత్ నుంచి వారికి చోటు లభించింది. మార్గదర్శకులు, నాయకులు, కళాకారులు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలతో 2019 సంవత్సరానికి టైమ్స్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండో అమెరికన్ కమేడియన్, టీవీ హోస్ట్ హసన్ మిన్హాజ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని ఇమ్రాన్, గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్‌వుడ్స్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ముద్ర వేశారో టైమ్స్ వారి ప్రొఫైల్స్‌లో వివరించింది. అరచేతిలో ప్రపంచం ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ భారత వాణిజ్య రంగంలో అద్భుతమైన దార్శనికుడని, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేయడంలో ఆయన పాత్రను మరువలేమని ముకేశ్ ప్రొఫైల్‌ని రాసిన మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్ర అన్నారు. అరచేతిలో∙ప్రపంచమంటూ ముఖేశ్ చేసిన రిలయన్స్ జియో ఆవిష్కరణతో ఆయన ప్రతిష్ట పెరిగిందన్నారు. స్వలింగ సంపర్కులు హక్కుల కోసం, సెక్షన్ 377ను (దీని ప్రకారం స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరం. ఈ సెక్షన్‌ను 2018 సెప్టెంబర్‌లో సుప్రీం రద్దు చేసింది) రద్దు కోసం పోరాడి సుప్రీంకోర్టులో విజయం సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న పిటిషన్‌దారులు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి. ‘ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం అరుంధతి, మేనక చిత్తశుద్ధితో చేసిన న్యాయపోరాటం మరువలేనిది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఎలుగెత్తి చాటి భారత్ సామాజిక పురోగతికి ముందడుగు వేశారు’ అని నటి ప్రియాంక అన్నారు. -
ఒక్క తీర్పులో ఎన్ని తీర్పులో!
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో లెస్బీయన్లు, గేలు, బైసెక్సువల్స్, ట్రన్స్‌జెండర్లు (ఎస్‌జీబీటీలు) కూడా వ్యక్తులేనని, వారికి కూడా వ్యక్తిత్వం, మానవత్వం ఉంటాయని, వారికి ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని, వారి మధ్య లైంగిక సంబంధాలను నిషేధిస్తున్న 377వ సెక్షన్ చెల్లదంటూ సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. ఈ తీర్పు ఒక్క ఎస్‌జీబీటీల విజయమే కాదు, భారత పౌరులందరి విజయంగా పేర్కొనవచ్చు. అన్ని హక్కులకన్నా ప్రాథమిక హక్కులు ముఖ్యమని ఈ తీర్పు చెప్పడమే కాకుండా సమాజంలో మెజారిటీ, మైనారిటీ అని తేడా లేకుండా అందరికి సమానంగా ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తద్వారా భిన్నత్వంలో ఏకత్వానికున్న ప్రాధాన్యతను తెలియజేసింది. దేశంలో అతి తక్కువగా ఉన్న ఎస్‌జీబీటీల కోసం ఎప్పటి నుంచో చట్టంలో కొనసాగుతున్న 377వ సెక్షన్‌ను కొట్టివేయలేమని 2013లో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. స్ఫూర్తిదాయకమైన సుప్రీం కోర్టు తీర్పునకు కారణమైంది భారత రాజ్యాంగంలోని 32వ అధికరణం. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లే అధికారాన్ని ఈ అధికరణ కల్పిస్తోంది. అందుకనే ఈ అధికరణ కిందనే ఎస్‌జీబీటీలు తమ వాదనను కోర్టుకు నేరుగా వినిపించగలిగారు. ఈ ‘32వ అధికరణ’నే మొత్తం రాజ్యాంగానికి ఆత్మ, హృదయమని నాటి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ స్వయంగా నాటి రాజ్యాంగ పరిషద్‌లో నొక్కి చెప్పారు. భారత రాజ్యాంగం ఓ బండరాయి కాదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే వీలున్న ‘పరివర్తనా రాజ్యాంగం’ అని కూడా సుప్రీం తాజా తీర్పు సూచిస్తోంది. తీర్పు చెప్పిన జడ్జీల్లో ఒకరు ‘పరివర్తనా రాజ్యాంగం’ అని వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం కూడా. 2013లో ఎస్‌జీబీటీల వాదనను తిరస్కరించిన సుప్రీం కోర్టు 2018 నాటికి వారి వాదనకు సానుకూలంగా స్పందించడమే అందుకు నిదర్శనం. -
స్వలింగ సంపర్కం నేరం కాదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్ 377పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. సమానత్వపు హక్కును హరిస్తున్న ఈ సెక్షన్‌లోని పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మైనార్టీ తీరిన ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రైవేటు ప్రదేశంలో స్వలింగ శృంగారంలో పాల్గొనడం ఇకపై ఏమాత్రం నేరం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం పేర్కొంది. ‘స్వలింగ సంపర్కం హేతుబద్ధం కాదని, సమర్థించలేమని, నిరంకుశమని ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు చెబుతున్నాయి. అయితే బ్రిటీష్ కాలంనాటి 158 ఏళ్ల నాటి ఈ నిబంధన సరికాదు. సమాజంలో ఎల్జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 సమాజంలో వేళ్లూనుకుపోయిన పాతతరం ఆలోచనలకు ప్రతిరూపమని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులంతా స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించడంలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ఇన్నాళ్లుగా సరైన న్యాయం జరగలేదని పేర్కొన్నారు. 2013లో సురేశ్ కౌశల్ కేసులో ‘అంగీకారం ఉన్నప్పటికీ.. అసహజ శృంగారం నేరమంటూ’ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేశారు. జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘నవభారతంలో మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించేందుకు చీకటి నుంచి వెలుగులోకి వచ్చే సమయమిది’ అని చెప్పి తీర్పును సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ముగించారు. తాజా తీర్పు ద్వారా ప్రపంచంలో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్ నిలిచింది. ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు, న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు సుప్రీం తీర్పును స్వాగతించాయి. అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే లైంగికవాంఛ సహజమైన జీవసంబంధమైన ప్రక్రియని.. దీన్ని సాకుగా చూపి వివక్ష కనబరచడం స్వలింగ సంపర్కుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని కోర్టు పేర్కొంది. ‘18 ఏళ్లు నిండిన వారి స్వలింగ సంపర్కాన్ని సెక్షన్ 377 నేరంగా పరిగణిస్తోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21లకు విఘాతం కల్గించడమే. అయితే వీరి మధ్య శృంగారం పరస్పర అంగీకారంతోనే, నిర్బంధ రహితంగానే జరగాలి’ అని 493 పేజీల తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 కారణంగానే ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా దేశంలో ద్వితీయశ్రేణి పౌరుల్లా బతకాల్సి వచ్చిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377.. మైనారిటీ తీరిన హోమోసెక్సువల్స్ (ఇద్దరు పురుషులు), హెటిరో సెక్సువల్స్ (ఓ ఆడ, ఓ మగ), లెస్బియన్స్ (ఇద్దరు ఆడవాళ్లు) మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాన్ని ఏర్పర్చుకోవడం నేరం, రాజ్యాంగ వ్యతిరేకం అని చెబుతోంది. ఇదే సెక్షన్ ఓ మగాడైనా, ఆడదైనా.. జంతువుతో శృంగారంలో పాల్గొనటాన్నీ తప్పుబట్టింది. అంతేకాదు, పరస్పర అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య బలవంతంగా లైంగిక చర్య జరగటాన్నీ నేరంగానే పరిగణిస్తోంది. ఇలాంటి కేసులకు సెక్షన్ 377 గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తోంది’ అని ధర్మాసనం గుర్తుచేసింది. శృంగార వాంఛ నేరం కాదు: నవ్‌తేజ్ జౌహార్, జర్నలిస్ట్ సునీల్ మెహ్రా, చెఫ్ రితూ దాల్మియా, హోటల్ యజమానులు అమన్నాథ్, కేశవ్ సూరీ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయేషా కపూర్ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది. ‘శృంగారమనేది జీవసంబంధమైన ప్రక్రియ. ఇది సహజం, ప్రతి ఒక్కరిలోనూ న్యూరోలాజికల్, బయాలాజికల్‌గా అంతర్గతంగా కలిగే మార్పు. పరస్పర ఆకర్షణ కలిగినపుడు శృంగార భావన ఏర్పడటం సహజం. ఇలాంటి వారిని నేరస్తులుగా చూడడం ఎల్జీబీటీక్యూల భావప్రకటన హక్కుకు విఘాతం కల్గించినట్లే’ అని కోర్టు తీర్పు పేర్కొంది. ఎల్జీబీటీక్యూల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలపై భారత్ కూడా సంతకాలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఇక మేమూ సమాజంలో భాగమే! 17 ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించినందుకు ఢిల్లీ సహా దేశంలోని పలుచోట్ల ఎల్జీబీటీక్యూ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేక్‌లు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వరా>్గన్ని ప్రతిబింబించే ఇంద్రధనస్సు రంగుల జెండాలను ఊపుతూ తీర్పును స్వాగతించారు. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని ఈ సమాజం అడ్డుకోలేదంటూ నినాదాలు చేశారు. ‘మా ఆవేదనను అర్థం చేసుకుని భారత న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచేలా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. మొత్తానికి మేం కూడా సమాజంలో భాగస్వాములమయ్యాం’ అని ఎల్జీబీటీక్యూల కోసం డెల్టా యాప్‌ను రూపొందించిన ఇషాన్ సేథీ పేర్కొన్నారు. స్వాగతించిన న్యాయనిపుణులు: సుప్రీం తీర్పును సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణులు స్వాగతించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ మిగిలిన వారితో సమానంగా, హుందాగా బతికే హక్కు ఉందన్నారు. ఇది సంబరాలు జరుపుకునే తీర్పు అని మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ పేర్కొన్నారు. ఈ తీర్పు రాజకీయాలను, మానవ విలువలను మారుస్తుందని సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ అభిప్రాయపడ్డారు. ప్రముఖుల మద్దతు బాలీవుడ్ ప్రముఖులు, రచయితలు, టీచర్లు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లోని వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ప్రాథమిక మానవ హక్కులు కల్పించేలా సుప్రీం తీర్పు ఉందన్నారు. గే అయినందుకు తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న చిత్ర దర్శకుడు హన్సల్ మెహతా ఈ తీర్పు కొత్త ఆరంభానికి సూచకమన్నారు. బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్ ‘దేశానికి మళ్లీ ఆక్సీజన్ అందింది’ అని ట్వీట్ చేశారు. ‘భవిష్యత్తులో ఒకరోజు ఎవరు ఏంటి అనే ముద్ర వేయడం ఉండదు. అలాంటప్పుడు దేశం స్వర్గం అవుతుంది’ అని నటి సోనమ్ కపూర్ పేర్కొన్నారు. నైతికత పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాయడం ఎవరి తరం కాదని నటి స్వరా భాస్కర్ అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కుల హక్కులపై మాట్లాడినందుకు తనను లోక్‌సభలో అడ్డుకున్న బీజేపీ ఎంపీలంతా సిగ్గుపడాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చరిత్ర వీరికి క్షమాపణ చెప్పాలి: జస్టిస్ ఇందు మల్హోత్రా ‘తోటి సమాజమంతా స్వలింగ సంపర్కం పూర్తిగా సహజమైన ప్రక్రియ అని గుర్తించలేకపోవడంతో ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా భయం భయంగా బతుకుతున్నారు. ఏదో మహాపరాధం చేశామన్న భావనలో పడిపోయారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు న్యాయం జరగడంలో, హక్కులు కల్పించడంలో ఆలస్యమైనందుకు చరిత్ర వీరికి క్షమాపణలు చెప్పాలి. శతాబ్దాలుగా వీరు అవమానాలకు గురయ్యారు. సమాజానికి వీరి గురించి సరైన అవగాహన లేకపోవడమే కారణం. అందువల్ల ఆర్టికల్ 14 కల్పించిన ప్రాథమిక హక్కులను ఎల్‌జీబీటీక్యూలు కోల్పోయారు’ అని తన తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 377 నేపథ్యమిదీ.. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో 377వ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ముసాయిదాను బ్రిటిష్ పాలనలో 1838లో థామస్ మెకాలే రూపొందించగా 1861లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బ్రిటిష్ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్ 1533) ఆధారంగా రూపొందింది. సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. నేరస్తులకు పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు వీలు కల్పించింది. ఢిల్లీలో సెక్షన్377 రాసి ఉన్న కేక్ కట్ చేస్తున్న దృశ్యం -
అమ్మాయిల ప్రేమ: టీవీ షో తీరుపై ఆగ్రహం!
నటి గీతపై మండిపడుతున్న ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఒక ప్రైవేటు తెలుగు చానెల్లో ప్రసారమయ్యే టీవీషోలో ఇద్దరు అమ్మాయిల జంటపై ఆగ్రహం వ్యక్తంచేసిన ప్రముఖ నటి గీత తీరుపై విమర్శలు వస్తున్నాయి. నటి గీత తీరును స్వలింగసంపర్కులకు చెందిన ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ తీవ్రంగా తప్పుబడుతున్నది. గత నెల 31న ప్రసారమైన 'బతుకు జట్కాబండి' షోలో 20 ఏళ్ల అమ్మాయి, 23 ఏళ్ల లింగమార్పిడి చేసుకున్న అమ్మాయి (ట్రాన్స్ మ్యాన్) జంట వచ్చింది. అయితే, విడిపోయిన దంపతులను, జంటలను న్యాయ పరిష్కార విధానాలు, కౌన్సెలింగ్ ద్వారా ఏకం చేసే సామాజిక కార్యక్రమంగా పేరొందిన ఈ షోలో ఈ జంటపై వ్యాఖ్యాత అయిన గీత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించడం ఏమిటని తప్పుబట్టింది. 'ఆమె నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు.. నువ్వు ఎలా అంగీకరించావు' అని గీత లింగమార్పిడి చేసుకున్న వ్యక్తిని ప్రశ్నించింది. అమ్మాయిలు-అమ్మాయిలు, అబ్బాయిలు-అబ్బాయిలు పెళ్లిచేసుకోవడం గురించి తనకు తెలుసునని, కానీ, ఇది వాస్తవంలో ఆచరణ సాధ్యమేనా? అని గీత వారిని ప్రశ్నించింది. ఇలాంటి అనుబంధాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని, వీటిని భారతదేశంలో పాటించకూడదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నప్పటి నుంచి తన లైంగిక అభిరుచులు భిన్నంగా ఉండేవని ట్రాన్స్ మ్యాన్ చెప్పినా.. నువ్వెందుకు పురుషుల హెయిర్‌స్టైల్, దుస్తులను అనుసరిస్తున్నావని ప్రశ్నించింది. మీ ఇద్దరు కలిసి ఇలా సినిమాలకు, పార్కులకు వెళ్లడం జుగుప్సకరం. మగవాడిలా డ్రెస్ వేసుకున్నంతమాత్రాన సరిపోదు అని వ్యాఖ్యలు చేసింది. ‘ఒక అమ్మాయితో కలిసి తిరుగడానికి నీకు సిగ్గులేదా? ఇలా చేస్తే నీ కాళ్లు విరగ్గొడతా’ అంటూ గీత బెదిరింపులకు దిగిందని ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమది భిన్నమైన సమూహమని, తమ గురించి తెలుసుకోకుండా ఈ విధంగా బెదిరింపులకు దిగడం సరికాదని, దీనిపై సదరు చానెల్, షో నిర్వాహకులు వివరణ ఇవ్వాలని తెలుగురాష్ట్రాల్లోని ఎల్జీబీటీ కమ్యూనిటీ డిమాండ్ చేస్తున్నది. -
ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి వణుకు
ఆర్లాండో మారణకాండతో.. అమెరికాలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎవరొచ్చి తుపాకులతో మీద పడతారోనని భయం భయంగా గడుపుతున్నారు. అసలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్లాండో దారుణ మారణకాండకు కారణమైన ఉన్మాది ఒమర్ మతీన్‌ను ప్రేరేపించిన అంశం ఏమిటి? మతీన్ ఎన్నడూ ముస్లిం కమ్యూనిటీలో పెరగకపోవడం, ఆయనకు ఇస్లాం టెర్రరిస్టులతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో మతీన్‌ను ఉన్మాదిగా మార్చిన అంశం ఏమిటన్న దానిపైనే ప్రధానంగా అమెరికా దర్యాప్తు అధికారులు తమ దృష్టిని కేంద్రీకరించారు. ఇద్దరు మగవాళ్లు ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాన్ని చూసి కొన్నాళ్ల క్రితం మతీన్ డిస్టర్బ్ అయ్యాడని, ఇద్దరు మగవాళ్లు ముద్దు పెట్టుకోవడం ఏంటంటూ తనతో చాలాసేపు వాదన కూడా పెట్టుకున్నాడని మతీన్ తండ్రి ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. మతీన్‌ను ఉన్మాదిగా మార్చిన అంశం ఏమిటన్నది స్పష్టంగా తేలకపోయినా, ఎల్జీబీటీక్యూ (లెస్బేనియన్లు, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, కీర్) సంస్కృతిలో భాగంగా అవతరించిన నైట్ క్లబ్ లక్ష్యంగా ఓ ఉన్మాది దాడి చేయడం అంటేనే ఈ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించే స్వభావంతో మతీన్ దాడికి పాల్పడి ఉంటాడని మానసిక నిపుణులు భావిస్తున్నారు. ఈ వాదనతో విభేదిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎంతోకాలంగా ఫ్లోరిడా రాష్ట్రంలో నివసిస్తున్న మతీన్‌కు ఎల్జీబీటీక్యూ ఉద్యమం గురించి మొదటి నుంచి తెలిసే ఉంటుందని, దేశంలో గే పెళ్లిళ్లను అనుమతించే వరకు సాగిన ఉద్యమం గురించి అవగాహన ఉన్న మతీన్ ఈ కారణంగా ఇంత దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం చేయడని మరికొంత మంది వాదన. మతీన్ దాడికి ముందే పోలీసులకు ఫోన్ చేసి తాను ఇస్లాం రాజ్యం కోసం ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పడం వల్ల ఇస్లాం టెర్రరిస్టులతో అతడికి సంబంధం ఉండి ఉంటుందని పోలీసు అధికారులు ముందుగా భావించారు. కానీ అతడికి వారితో ఎలాంటి సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇస్లాం రాజ్యాన్ని కోరుకుంటున్న ఐఎస్ లాంటి టెర్రరిస్టు సంస్థలు కూడా గే సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇస్లాం రాజ్యం గురించి మతీన్ మాట్లాడి ఉంటాడన్నది ఓ వర్గం వాదన. అమెరికాలోని కొన్ని చర్చిలు కూడా గే సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా ఎల్జీబీటీక్యూ కార్యకర్తల్లో ఈ దారుణం వణుకు పుట్టిస్తోంది. ఇక ఇలాంటి గే క్లబ్బులకు తాము వెళ్లమని కూడా గేలు చెబుతున్నారు. గే పెళ్లిళ్లను తొలుత వ్యతిరేకించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని గే హక్కులకు ఓకే చెప్పారు. ఇప్పుడు అదే అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం గే సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన 'గే'లకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మన దేశంలో.. భారత దేశంలో గే సంస్కృతి శిక్షార్హమైన నేరం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 377వ సెక్షన్ కింద శిక్ష విధిస్తారు. ఈ చట్టాన్ని భారత్‌లో పెద్దగా ప్రయోగించకపోయినా ఈ చట్టం కారణంగా గేలకు వ్యతిరేకంగా విద్వేషం పెరిగే ఆస్కారం ఉందన్న కారణంగా ఈ సెక్షన్ ఎత్తి వేయాలంటూ ఎప్పటి నుంచో ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. 377లోని కొన్ని క్లాజులను కొట్టివేయాలంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పును కూడా ఇచ్చింది. అయితే ఆ చట్టాన్ని కొట్టివేసే అధికారం కోర్టులకు లేదని, పార్లమెంటుకు మాత్రమే ఉందంటూ ఆ తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సెక్షన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గతేడాది ఓ బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీలకు అతీతంగా ఆయనకు సభ్యులెవరూ మద్దతు ఇవ్వక పోవడమే అందుకు కారణం.